శిథిలావస్థకు చేరిన జీసీసీ భవనం
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): నియోజకవర్గంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో విలువైన ఫైల్లు, ఇతర సామగ్రికి భద్రత లేకుండా పోయింది. వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో మొత్తం 57 ప్రభుత్వ కార్యాలయాలకు గాను వీటిలో 13 వరకు శిథిలభవనాల్లో నడుస్తున్నాయి. అన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయాలు పూర్తిగా పాడయ్యాయి. సీతంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయం శిథిలమైంది. అయితే ఈ భవన సముదాయానికి సంబంధించి నూతన భవనాలు నిర్మాణానికి ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారు.
పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అలాగే గిరిజన సహకార సంస్థ భవనాలు, మండల రెవెన్యూ కార్యాలయం, ఎంఆర్‌సీ కార్యాలయం పూర్తిగా పాడయ్యాయి. చిన్నపాటి వర్షం పడినా వరదతో నిండిపోతున్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. భామిని మండలంలో భామిని, బత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు మరమ్మతులకు గురయ్యాయి. పాలకొండలో మండల విద్యావనరుల కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, ఇరిగేషన్ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం శిథిలమయ్యాయి. వీరఘట్టం మండలంలో వ్యవసాయ కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయలాది ఆదేదారి. వీటి స్థానంలో కొత్తవి ఎప్పుడు నిర్మిస్తారనేది ప్రశ్నగా మారింది. మరికొన్ని కార్యాలయాలు పరాయి పంచన నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు వేడుకుంటున్నారు.ఽ
నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు..
మండలం | ప్రభుత్వ కార్యాలయాలు | శిథిలమైనవి |
సీతంపేట | 18 | 4 |
పాలకొండ | 15 | 5 |
వీరఘట్టం | 14 | 2 |
భామిని | 10 | 2 |
మొత్తం | 57 | 13 |
ఎప్పటి నుంచో సమస్య ఉంది
శిథిల భవనాల స్థానంలో నూతన భవనాలు మంజూరు చేయాలని గతంలో పలు మా ర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. రికార్డులకు భద్రత లేకుండా పోతోంది. చిన్నపాటి వర్షం కురిసినా సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.
– విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ
కార్యాలయాలన్నీ అలాగే ఉన్నాయి
రెవెన్యూ, వ్యవసాయశాఖ ఇలా మండలంలో ఏ కార్యాలయాలు చూసినా శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. ఎంపీడీవో కార్యాయలం పూర్తిగా పాడైంది. అయితే తప్పదన్నట్లు అక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలి.
– ఎస్.భాస్కరరావు, కారెంకొత్తగూడ
Comments
Please login to add a commentAdd a comment