కార్యాలయం గోడలు పాకురు పట్టిన దృశ్యం
భయం భయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
పట్టించుకోని అధికారులు
అల్లాదుర్గం: గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసే కార్యాలయమే శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భవనం నిర్మించి 15 ఏళ్లు కాకముందే శిథిలం కావడం... భవన నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను పాటించారో అర్థం చేసుకోవచ్చు.
వర్షం పడినప్పుడు కార్యాలయం ఉరుస్తుండటంతో ప్రజలతో పాటు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీళ్లకు ఫైల్ తడిసి ముద్దవుతున్నాయి. అల్లాదుర్గం ఎంపీపీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే శ్లాబ్ పైనుంచి నీళ్లు కారుతున్నాయి. ఈ భవనాన్ని 2002లో ప్రారంభించారు. భవనం నిర్మించి 15 ఏళ్లు దాటక ముందే శిథిలావస్థకు చేరుకుంది.
ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది భయాబ్రాంతులకు గురవుతూనే విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం గోడలు తడవడంతో విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. వర్షపు నీటికి గోడలు పాకురుపట్టాయి. మండల సర్వసభ్య సమావేశాలను మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నా... ఈ భవనం గురించి తీర్మానం చేసిన దాఖలాలు లేవు.
ప్రమాదం జరిగితే తప్పా అధికారులు స్పందించరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న భవనం మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.