alladurgam
-
వల నిండా.. కొండచిలువలు
అల్లాదుర్గం (మెదక్) : చేపలు పట్టేందుకు వల వేస్తే రెండు కొండచిలువలు చిక్కాయి. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గోండ్ల సాయిలు మంగళవారం అప్పాజీపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా రెండు కొండచిలువలు చిక్కుకున్నాయి. మీటరున్నర పొడవున్న వీటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు సాయిలు తెలిపారు. (క్లిక్: మస్క్ మలన్‌తో మస్తు పైసలు) -
కేసీఆర్ సభను జయప్రదం చేయాలి
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రచారసభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయరామరాజు అన్నారు. ఆదివారం మండలంలోని బుజ్రాన్‌పల్లి, టెంకటి, జంబికుంట, దానంపల్లి, మల్కాపూర్, గొట్టిముక్కుల గ్రామాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తరపున ప్రచారం చేశారు. ఏప్రిల్ 3న అల్లాదుర్గంలో జరిగే కేసీఆర్ సభకు కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సురేష్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు మాణిక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు హరి, గోవర్దన్, పున్నయ్య, అంజయ్య ఉన్నారు. -
వినూత్న బోధన
అల్లాదుర్గం(మెదక్): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య గాడి తప్పుతుంటే, ఈ ఉపాధ్యాయుడు ప్రాణం పోస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ పాఠశాలలో ఉన్న ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించడం ఇబ్బందిగా మారుతుంది. ఐతే ఆయనకు వినూత్నమైన ఆలోచన తట్టింది. సేల్ఫోన్ సహాయంతో ఐదు తరగతులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఆయన ఒక తరగతిలో బోధిస్తూ , మిగితా వాటిలో ఫోన్ ద్వారా యూట్యూబ్‌లోని వీడియోలను డౌన్లోడ్ చేసి దానికి సౌండ్ బాక్స్‌లను అనుసంధానం చేసి పలు తరగతుల్లో ఉంచడం ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. యూట్యూబ్ నుంచి తెలుగు వర్ణమాల, గుణితాలు, పద్యాలు, ఆంగ్ల వర్ణమాల నంబర్లను డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా చార్ట్‌లను తయారు చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తున్నాడు. బ్లూటూత్ ద్వారా కనెక్షన్.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ తండా (మాణిక్యరాజ్‌తండా) ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యబోధన జరుగుతోంది.ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెల్‌ఫోన్‌కు చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నాడు. ఒక్క ఉపాధ్యాయుడు ఐదు తరగతులు బోధించడం గగనంగా మారింది.దీంతో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు చిట్టిబాబుకు ఈ ఐడియా వచ్చింది. ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా చిన్న చిన్న సౌండ్ బాక్స్ ఏర్పాటు చేశారు. అఆలు రాస్తు చెబుతుంటే అందులో విద్యార్థులు వింటూ నేర్చుకుంటున్నారు. విద్యార్థులు చక్కగా వింటూ పలకడం, రాయడం చేస్తుండటంతో ఉపాధ్యాయుడి వినూత్న ప్రయోగం విజయవంతమైంది. ఉపాధ్యాయుడి రూపొందించిన వివిధ రకాల చార్ట్‌లు పాఠశాల గోడలపై అతికించిన చార్ట్‌లు సులువుగా నేర్చుకుంటున్నారు.. రాష్ట్రంలోనే ఈ విధంగా విద్యబోధన చేయడం ఏ ప్రభుత్వ పాఠశాలలో కనిపించదు. కూడికలు, తీసివేతలు, గుణితాలు, సంయుక్త అక్షరాలు, వివిధ రకాల చాట్లు 500 వరకు ఆయన తయారు చేశాడు. విద్యార్థులకు చార్ట్‌లు ఇచ్చి కూడికలు, తీసివేతలు, గుణితాలు చేయాలని చేప్తూ విద్యార్థులకు బోధిస్తున్నాడు. అలాగే రైమ్స్ పద్యాలు విద్యార్థులు సులువుగా నేర్చుకుంటున్నారు. బొమ్మల కథలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లిష్ పదాలు, కాకుర్తాలు ఫోన్లో వింటూ నేర్చుకుంటున్నారు. ఇబ్బందిగా ఉండేది.. ఐదు తరగతులకు ఒక్కడినే బోధించాంలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ ఐడియా ద్వారా విద్యబోధన సులువు అయ్యింది. ఫోన్లో అక్షరాలు రాయడం, పలకడంతో విద్యార్థులు శ్రద్ధగా వింటూ నేర్చుకుంటున్నారు. 3 , 4 తరగతుల విద్యార్థుల కోసం చార్ట్‌లు తయారు చేసి , విద్యార్థుల ముందు పెట్టడంతో వారే వాటిని చూసుకుని గణితం, తెలుగు, సైన్స్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇలా ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ల్యాప్‌ట్యాప్, ట్యాబ్ పంపిణీ చేస్తే ఇలాంటి బోధనతో విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారు. – చిట్టిబాబు, ఉపాధ్యాయుడు, గడిపెద్దాపూర్‌తండా -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
అల్లాదుర్గం (మెదక్) : ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మునిగి బీరప్ప(16) సాయంత్రం ఈతకు వెళ్లి బావిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. -
వాహనం ఢీకొని బాలుడి మృతి
అల్లాదుర్గం (మెదక్ జిల్లా): అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన బాలుడిని తూఫాన్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పెద్దశంకరంపేటకు చెందిన నగేష్(9)గా గుర్తించారు. పండుగ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వచ్చిన నగేష్ మార్గమధ్యంలో ఉన్న గుడికి వెళ్లాడు. దైవదర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులను వదిలి ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో పెద్దశంకరంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోన్న తూఫాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
ముస్తాబవుతున్న కార్యాలయాలు
అల్లాదుర్గం: వట్పల్లి గ్రామాన్ని ప్రభుత్వం నూతన మండలం చేయడంతో కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ కార్యాలయాల కోసం భవనాలను ఎంపిక చేశారు. భవనాల్లో తాత్కాలికంగా ఫర్నిచర్, బోర్డులను రాశారు. శనివారం జోగిపేట సీఐ వెంకటయ్య పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన భవనంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అల్లాదుర్గంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం కోసం కేటాయించిన హౌసింగ్ భవనంలో ఏర్పాట్లు చేపట్టారు. భవనం చుట్టూ పొదలు తొలగించారు. ముందు భాగంలో చదును చేశారు. కార్యాలయాల ప్రారంభం కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
నిధులు లేవు.. పనులు ఎలా చేయాలి?
గ్రామసభలో సర్పంచ్ ఆవేదన అల్లాదుర్గం: ‘గ్రామ పంచాయతీలకు నిధులు రావడం లేదు. గ్రామసభలు పెడితే ప్రజలు అడుగుతున్నారు. రూపాయి లేకుండా విద్యుత్ బిల్లుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను తీసుకుంది. గ్రామంలో పనులు ఎలా చేయాలి’ అని అల్లాదుర్గం మండలం పల్వట్ల సర్పంచ్ ఆడిగే ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పల్వట్లలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తామని, గతంలో గ్రామజ్యోతి ద్వారా పనులు వివరాలు, తీర్మానాలు తీసుకున్న ప్రభుత్వం నిధులను మాత్రం మంజూరు చేయలేదన్నారు. పంచాయతీలో నిధులు లేక కనీసం మురికి కాల్వలను తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు మాత్రం సమావేశాలు పెట్టి పారుశుద్ధ్యం పనులు చేయాలని చెబుతున్నారని, నిధులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంజ్రేకర్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
శిథిలావస్థలో ఎంపీపీ కార్యాలయం
భయం భయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పట్టించుకోని అధికారులు అల్లాదుర్గం: గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసే కార్యాలయమే శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భవనం నిర్మించి 15 ఏళ్లు కాకముందే శిథిలం కావడం... భవన నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను పాటించారో అర్థం చేసుకోవచ్చు. వర్షం పడినప్పుడు కార్యాలయం ఉరుస్తుండటంతో ప్రజలతో పాటు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీళ్లకు ఫైల్ తడిసి ముద్దవుతున్నాయి. అల్లాదుర్గం ఎంపీపీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే శ్లాబ్ పైనుంచి నీళ్లు కారుతున్నాయి. ఈ భవనాన్ని 2002లో ప్రారంభించారు. భవనం నిర్మించి 15 ఏళ్లు దాటక ముందే శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది భయాబ్రాంతులకు గురవుతూనే విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం గోడలు తడవడంతో విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. వర్షపు నీటికి గోడలు పాకురుపట్టాయి. మండల సర్వసభ్య సమావేశాలను మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నా... ఈ భవనం గురించి తీర్మానం చేసిన దాఖలాలు లేవు. ప్రమాదం జరిగితే తప్పా అధికారులు స్పందించరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న భవనం మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అల్లాదుర్గం సబ్‌డివిజన్ కోసం తీర్మానం
అల్లాదుర్గం: అల్లాదుర్గంను సబ్‌డివిజన్ చేయాలని కోరుతూ మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఎంపీపీ రాంగారి ఇందిర బుధవారం విలేకర్లకు చెప్పారు. ఈ నెల 23న మండల సర్వసభ్య సమావేశంలో సబ్‌డివిజన్ సాధన కమిటీ మెమొరాండం సమర్పించిందన్నారు. సభ్యుల ఆమోదంతో తీర్మానం చేసినట్లు తెలిపారు. సబ్‌డివిజన్ అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. -
లారీ, కంటెయినర్ ఢీ: ఒకరి మృతి
అల్లాదుర్గం (మెదక్ జిల్లా): అల్లాదుర్గం మండల చిల్వెరా గ్రామ శివారులో లారీ, కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ లియాఖత్(31) అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి చిన్నపాటి గాయాలయ్యాయి. మృతుడు లియాఖత్ స్వస్థలం హర్యానా. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల శ్రమదానం
అల్లాదుర్గం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అల్లాదుర్గం చౌరస్తాలో రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అల్లాదుర్గం ఎస్ఐ మహ్మద్ గౌస్ స్పందించారు. సోమవారం తన సిబ్బందితో కలిసి శ్రమదానం చేపట్టి గుంతలను పూడ్చారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశం, కానిస్టేబుళ్లు నర్సింలు, మస్తాన్, గంగాధర్, రాంపూర్ రాజు, మోహన్‌రాథోడ్ పాల్గొన్నారు. -
వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టులు
నీట మునిగిన పంటలు.. చెరువులకు బుంగలు వృథాగాపోతున్న వరద నీరు అల్లాదుర్గం: మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. కల్వర్టులు కొట్టుకపోవడంతో రాకపొకలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అల్లాదుర్గం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల అలుగులు పారుతున్నాయి. చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. ముస్లాపూర్ నుంచి బహిరన్‌దిబ్బ గ్రామం వైపు వెళ్లే రహదారిపై రెండు కల్వర్టులు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. ముస్లాపూర్ చెరువు నిండి అలుగు పారడంతో రైతు వెంకయ్య పొలం నీట మునిగింది. 8 ఎకరాల పంట నీటిలో మునిగిపోయిందని రైతులు చెప్పారు. అప్పాజీపల్లిలోని చెరువుకు బుంగపడింది. నీరంతా వృథాగా పోతోంది. మిషన్‌కాకతీయ పథకం కింద లక్షలాది రూపాయలతో పనులు చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిపల్లి గ్రామ చెరువు మూడేళ్ల తరువాత పూర్తిగా నిండి అలుగు పారుతోంది. అల్లాదుర్గం గ్రామ శివారులో భారీ వర్షానికి పత్తి పంట నీట మునిగింది. ముప్పారం నుంచి అప్పాజీపల్లి తండాకు వెళ్లే రహదారిపై రెండు కల్వర్టులు కొట్టుకుపోయాయి. గౌతాపూర్ రోడ్డు పూర్తి దెబ్బతింది. రోడ్డుపై బీటీ కొట్టుకపోయి గుంతలమయంగా మారింది. మండలంలో 57 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని రెవెన్యూ అధికారులు చెప్పారు. గడిపెద్దాపూర్, కేరూర్, బిజిలిపూర్, రాంపూర్, కాయిదంపల్లి, చిల్వెర గ్రామాల్లోని చెరువులు నిండి నీటితో కళకళలాడుతున్నాయి. బోరు బావుల్లో భూగర్భజలాలు పెరిగాయి. అల్లాదుర్గం మండలంలో వర్షాలకు నిండిన చెరువులను జెడ్పీటీసీ కంచరి మమత ఆదివారం పరిశీలించారు. కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులను పరిశీలించారు. పాడైన రోడ్లు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వివాహిత ఆత్మహత్య
అల్లదుర్గం (మెదక్) : కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం నాగులపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సుఖలత(25) గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నొప్పి ఎక్కువ కావడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
అల్లాదుర్గం (మెదక్) : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కవిత(30) మూడేళ్ల క్రితం భర్త నుంచి వేరు పడి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించిన మహిళ శనివారం దూలానికి వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. -
మాకు మద్యం వద్దు...సహకరించండి
అల్లాదుర్గం: విచ్చలవిడిగా విక్రయిస్తున్న మద్యం కారణంగా గొడవలు, అల్లర్లు ఎక్కువ కావటం ఆ గ్రామస్తులను ఆలోచింపజేసింది. మద్య నిషేధమే దానికి విరుగుడు అని వారందరూ భావించారు. అందరూ ఏకతాటిపై నిలబడి గ్రామంలో బెల్టుషాపులు వద్దంటూ తీర్మానించుకున్నారు. ఆ మేరకు అధికారులకు వినతి పత్రాలు సమర్చించి సహకరించాలని కోరారు. వివరాలివీ.. మెద్ జిల్లా అల్లాదుర్గం మండలం కెరూర్ గ్రామ జనాభా 1499 మంది. ఈ గ్రామంలో 5 కిరాణా దుకాణాలలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. మద్యం మత్తులో పడిన మందుబాబులు గొడవలకు దిగటం పరిపాటిగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ జరుగుతుండటం గ్రామ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో మంగళవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో మద్య నిషేధం విధించాలని సర్పంచ్ మంగమ్మ ఆధ్వర్యంలో తీర్మానించుకున్నారు. మద్యం అమ్మితే రూ.20 వేల జరిమాన, తాగిన వారికి రూ.10 వేల జరిమాన విధించాలని నిర్ణయించారు. ఎవరైనా గ్రామంలో దొంగచాటుగా విక్రయించే వారి వివరాలు చెబితే రూ.5 వేలు బహుమతిగా ఇస్తామని సర్పంచ్ మంగమ్మ చెప్పారు. గ్రామం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. బుధవారం తహశీల్దార్ మనోహర్ చక్రవర్తికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సర్పంచ్ వినతి పత్రం అందజేసి, తమ గ్రామంలో మద్యం నిషేధానికి సహకరించాలని కోరారు. -
ఏం నిద్రపోతున్నారా?
► విధుల నుంచి తొలగిస్తా.. జాగ్రత్తగా పనిచేయండి ► ఉపాధి సిబ్బందిపై కలెక్టర్ కస్సుబుస్సు ► కూలీలకు పనులు కల్పించకపోవడంపై మండిపాటు ► అల్లాదుర్గంలో సమీక్ష సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్ రాస్ అల్లాదుర్గం: ఏం నిద్రపోతున్నారా?... విధుల ను జాగ్రత్తగా నిర్వహించకపోతే తొలగిస్తా.. ఇ ప్పటికే జిల్లాలో 13 మందిని తొలగించాం... మరో 120 మందిని తొలగిస్తే తెలుస్తుంది*.. అంటూ కలెక్టర్ ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం అల్లాదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హమీ పథకం ఒక్కో గ్రామంలో 20, 30, 40, 70 మంది కూలీలు పని చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ సిబ్బంది అంతా హాయిగా ఉంటున్నట్టు రికార్డులను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 13 మందిని తొలగించాం, మరో 120 మందిని తొలగించినా తప్పులేదన్నారు. రూ.180 కూలి చెల్లించాల్సి ఉండగా వంద రూపాయలు కూడా ఎందుకు దాటడం లేదని ప్రశ్నించారు. అంతా నిద్రపోతున్నారా? అంటూ మండిపడ్డారు. మండలంలో 80 శాతం మరుగుదొడ్లు లేని వారు ఉన్నారని సర్వేలో పేర్కొనడంపై అనుమానం వ్యక్తం చేశారు. అసలు సర్వే చేశారా?, ఇళ్లల్లో కూర్చోని రాశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌నుంచి సోషల్ ఆడిట్ బృందాన్ని పిలిపించి ఆడిట్ చేయించి అందరిని విధుల నుంచి తొలగిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. ఐకేపీ సిబ్బంది వ్యాపారాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుందన్నారు. సమావేశంలో డ్వామా పీడీ సురేందర్, ఎంపీడీఓ కరుణశీల, తహశీల్దార్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి ఎదుట పురిటి నొప్పులతో గర్భిణి యాతన
అల్లాదుర్గం: నిండు గర్భిణి ప్రసవం కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అక్కడున్న సిబ్బంది.. ఇంకా టైమ్ ఉండగానే వెళ్లిపోయారు. రాత్రి విధులకు రావాల్సిన సిబ్బంది ఎంతకీ రాలేదు. దీంతో పట్టించుకునే వారెవరూ లేక ఆరోగ్య కేంద్రం ఎదుట రోడ్డుపైనే ఆ గిరిజన మహిళ నరకయాతన అనుభవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీతానగర్ తండాకు చెందిన పడ్త్యా మంజుల బుధవారం సాయంత్రం ప్రసవం నిమిత్తం అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అప్పటికి విధుల్లో ఉన్న సిబ్బంది ఇంకా సమయం ఉండగానే వెళ్లిపోయారు. నైట్ డ్యూటీకి ఎవరూ హాజరు కాలేదు. ఒకపక్క ఆరోగ్య కేంద్రంలో ఎవరూ పట్టించుకోకపోవడం, మరోపక్క నొప్పులు తీవ్రం కావడంతో మంజుల రోడ్డుపైనే అవస్థలు పడింది. చివరకు 108 వాహనంలో ఆమెను జోగిపేట ఆస్పత్రికి తరలించారు. -
ఎంపీ వాహనాన్ని అడ్డుకుని ఖాళీ బిందెలతో ఘెరావ్
అల్లాదుర్గం రూరల్ (మెదక్): నీటి సమస్యపై అల్లాదుర్గం గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వస్తున్నారని రోడ్డుపై బిందెలు పెట్టుకుని వాహనాన్ని అడ్డిగించి ఘెరావ్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆదివారం మధ్యాహ్నం అల్లాదుర్గం చేరుకున్నారు. నీటి కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్న స్థానికులు ఎంపీ వాహనాన్ని అడ్డుకుని ఖాళీ బిందెలతో ఘెరావ్ చేశారు. గ్రామంలో రెండు రోజుల కోసారి నీరు సరఫరా అవుతుందని, నాలుగు రోజులకోసారి స్నానాలు చేస్తున్నామని ఆయనకు తెలిపారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ పాటిల్ నీటి ఎద్దడి నివారణకు మూడు రోజుల్లో కొత్త బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. -
దొంగలొస్తున్నారు...జాగ్రత్త
అల్లాదుర్గం రూరల్: మెదక్ జిల్లా అల్లాదుర్గం అంతా అప్రకటిత హై అలర్ట్...ఎక్కడి వారక్కడే అప్రమత్తమయ్యారు.. డబ్బులను జాగ్రత్తగా పెట్టుకున్నారు.. మహిళలు తమ నగలను భూమిలో పాతిపెట్టారు... ఎందుకిదంతా..? అల్లాదుర్గం పట్టణంలో దొంగలు సంచరిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారి ఆటకట్టించాలనుకున్న పోలీసులు గ్రామాల్లో చాటింపు వేయించారు. గ్రామాల్లో దొంగలు తిరుగుతున్నారని.. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. డబ్బు, నగలను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నారు. కొందరు మహిళలు తమ నగలను భూమిలో పాతిపెట్టారు. అయితే, ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే తాము దండోరా వేయిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. -
గ్యాస్ లేదని పస్తులు పెట్టారు
అల్లాదుర్గం రూరల్ : కట్టెలు లేక, గ్యాస్ అయిపోవడంతో మూడు గంటల వరకు భోజనం లేకపోవడంతో విద్యార్థుల కడుపులు కాలి కన్నీరు పెట్టిన ఘటన మండల కేద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక విలేకరులతో తమ గోడును వెల్లబోసుకున్నారు. 15 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని సరిగా భోజనం చేయడం లేదన్నారు. రోజూ నీళ్ల చారు చేస్తున్నారని, తాగునీరు కూడా కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు (సోమవారం) హాస్టల్లో గ్యాస్ అయిపోయిందని, ఇదే సమయంలో కట్టెలు కూడా లేకపోవడంతో ఉదయం టిఫెన్ కూడా లేదన్నారు. కనీసం మధ్యాహ్నం ఒంటి గంటకైనా అన్నం పెడతారనుకుంటే మూడు గంటలకు పెట్టారని తెలిపారు. దీంతో చాలా మంది విద్యార్థినులు ఆకలికి తట్టుకోలేక ఏడ్చార న్నారు. గతంలో ఒక సారి గ్యాస్ అయిపోవడంతో వంట మనిషి మా వద్ద డ బ్బులు వసూలు చేసింది. ఇంత వరకు తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం ఎంపీపీ ఇందిర, టీఆర్ఎస్ నాయకులు సుభాష్రావ్, బసవరాజ్, ప్రేమ్ కుమార్, కిషోర్, వెంకట్‌రెడ్డిలు కస్తూర్బా విద్యాలయానికి చేరుకుని బిస్కెట్ అందజేశారు. ఈ విషయాన్ని నాయకులు ఎమ్మెల్యే బాబూమోహన్‌కు ఫోన్లో తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్వీఎం సీఎంఓ వెంకటేశం, డిప్యూటీ తహశీల్దార్ తులసీరాంలు అల్లాదుర్గం కేజీవీబీలో విచారణ జరిపారు. ఇదిలా ఉండగా విద్యాలయ ప్రిన్సిపాల్ జ్యోతి మెటర్నటీ లీవ్‌లో ఉండగా ఇన్చార్జ్గా ప్రతిభ బాధ్యలు చేపట్టారు. అయితే ఆమె తనకు మెయిటెనెన్స్ బాధ్యతలు అప్పగించలేదని తెలిపారు. దీంతో తానేమీ చేయలేకపోయానని చెప్పారు. -
టీఆర్ఎస్కు విలువలు లేవు
అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ పార్టీకి విలువుల లేవని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. గురువారం అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబీ వద్ద ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంత భావజాలం లేని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏం పాలిస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ తన కొడుకుకు సిరిసిల్లా, కూతురుకు నిజామాబాద్, అల్లుడికి సిద్దిపేటలో టికెట్ ఇచ్చి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బాబుమోహన్, హన్మం త్‌రావ్, మాణిక్‌రెడ్డిలు ఎన్ని పార్టీలు మారారని, 24గంటల్లో కండువా మార్చిన వారికి టికెట్లు కేటాయిస్తూ వలసలను పోత్సహిస్తున్నారని విమర్శించారు. నాయకులు గ్రూపులు చేసుకొని పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తే రా జకీయ వ్యభిచారం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉం డి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు తమ ఉనికి కాపాడుకోవడానికి గ్రూపులు చేయడం మంచిపద్దతి కాదని హితవు పలికారు. తెలంగాణలో టీఆర్ఎస్కే మెజార్టీ సీట్లువచ్చే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇతర పార్టీలో చిచ్చుపెట్టి తాను రాజకీయ లబ్ధి పొ ందేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యులు సంగమేశ్వర్, నాయకులు జగదీశ్వర్, నారాయణగౌడ్, శేషారెడ్డి, నర్సింహా రెడ్డి, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.