అల్లాదుర్గం: విచ్చలవిడిగా విక్రయిస్తున్న మద్యం కారణంగా గొడవలు, అల్లర్లు ఎక్కువ కావటం ఆ గ్రామస్తులను ఆలోచింపజేసింది. మద్య నిషేధమే దానికి విరుగుడు అని వారందరూ భావించారు. అందరూ ఏకతాటిపై నిలబడి గ్రామంలో బెల్టుషాపులు వద్దంటూ తీర్మానించుకున్నారు. ఆ మేరకు అధికారులకు వినతి పత్రాలు సమర్చించి సహకరించాలని కోరారు. వివరాలివీ.. మెద్ జిల్లా అల్లాదుర్గం మండలం కెరూర్ గ్రామ జనాభా 1499 మంది. ఈ గ్రామంలో 5 కిరాణా దుకాణాలలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. మద్యం మత్తులో పడిన మందుబాబులు గొడవలకు దిగటం పరిపాటిగా మారింది.
ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ జరుగుతుండటం గ్రామ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో మంగళవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో మద్య నిషేధం విధించాలని సర్పంచ్ మంగమ్మ ఆధ్వర్యంలో తీర్మానించుకున్నారు. మద్యం అమ్మితే రూ.20 వేల జరిమాన, తాగిన వారికి రూ.10 వేల జరిమాన విధించాలని నిర్ణయించారు. ఎవరైనా గ్రామంలో దొంగచాటుగా విక్రయించే వారి వివరాలు చెబితే రూ.5 వేలు బహుమతిగా ఇస్తామని సర్పంచ్ మంగమ్మ చెప్పారు. గ్రామం ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. బుధవారం తహశీల్దార్ మనోహర్ చక్రవర్తికి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో సర్పంచ్ వినతి పత్రం అందజేసి, తమ గ్రామంలో మద్యం నిషేధానికి సహకరించాలని కోరారు.