ముస్లాపూర్ గ్రామ శివారులో వరద తాకిడికి కోట్టుకుపోయిన కల్వర్టు
నీట మునిగిన పంటలు.. చెరువులకు బుంగలు
వృథాగాపోతున్న వరద నీరు
అల్లాదుర్గం: మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. కల్వర్టులు కొట్టుకపోవడంతో రాకపొకలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అల్లాదుర్గం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల అలుగులు పారుతున్నాయి. చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి.
ముస్లాపూర్ నుంచి బహిరన్‌దిబ్బ గ్రామం వైపు వెళ్లే రహదారిపై రెండు కల్వర్టులు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. ముస్లాపూర్ చెరువు నిండి అలుగు పారడంతో రైతు వెంకయ్య పొలం నీట మునిగింది. 8 ఎకరాల పంట నీటిలో మునిగిపోయిందని రైతులు చెప్పారు. అప్పాజీపల్లిలోని చెరువుకు బుంగపడింది.
నీరంతా వృథాగా పోతోంది. మిషన్‌కాకతీయ పథకం కింద లక్షలాది రూపాయలతో పనులు చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిపల్లి గ్రామ చెరువు మూడేళ్ల తరువాత పూర్తిగా నిండి అలుగు పారుతోంది. అల్లాదుర్గం గ్రామ శివారులో భారీ వర్షానికి పత్తి పంట నీట మునిగింది.
ముప్పారం నుంచి అప్పాజీపల్లి తండాకు వెళ్లే రహదారిపై రెండు కల్వర్టులు కొట్టుకుపోయాయి. గౌతాపూర్ రోడ్డు పూర్తి దెబ్బతింది. రోడ్డుపై బీటీ కొట్టుకపోయి గుంతలమయంగా మారింది. మండలంలో 57 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని రెవెన్యూ అధికారులు చెప్పారు. గడిపెద్దాపూర్, కేరూర్, బిజిలిపూర్, రాంపూర్, కాయిదంపల్లి, చిల్వెర గ్రామాల్లోని చెరువులు నిండి నీటితో కళకళలాడుతున్నాయి.
బోరు బావుల్లో భూగర్భజలాలు పెరిగాయి. అల్లాదుర్గం మండలంలో వర్షాలకు నిండిన చెరువులను జెడ్పీటీసీ కంచరి మమత ఆదివారం పరిశీలించారు. కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులను పరిశీలించారు. పాడైన రోడ్లు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.