సాక్షి, వైరా: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు విమ్శలు చేస్తున్నాయని, అభివృద్ధి పనులు చేస్తున్న వారిని అభినందించాల్సింది పోయి, విమర్శలు చేయటం సరైంది కాదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, రాష్ట్ర పథకాలనే కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని చెప్పారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ దూర దృష్టితో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు 60 లక్షల సభ్యత్వం ఉందని, తక్కువ సమయంలో ఇంత మందికి పార్టీ సభ్యత్వాలు అందించటం హర్షించదగిన విషయమని అన్నారు. సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలన్నారు.
సీఏం కేసీఆర్ ప్రకటించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలను ప్రజాప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. 30 రోజుల ప్రణాళికల ద్వారా గ్రామాల్లో ప్రతి చిన్న సమస్య కూడా పరిష్కరించే అవకాశం ఉంటుందని, సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీ వరకు బాధ్యతను పెంచేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేస్తోందని వివరించారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు సాధ్యమైనంత మేర గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా సీఎం ప్రణాళికలు తయారు చేశారని, రానున్న రోజుల్లో తెలంగాణలో కోటి ఎకరాల భూమి సేద్యం కావడం తథ్యమని అన్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే లావూడ్యా రాములు నాయక్ ఎంపీని ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ సభ్యురాలు నంబూరి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment