నానో లచ్చమ్మ!
‘ఓటరుపండుగ’ డ్రాలో వరించిన నానో కారు
సంగారెడ్డి, : మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం జక్కాపూర్ మదిరా గ్రామానికి చెందిన పరుస లచ్చమ్మను నానో కారు వరించింది. 95 శాతం ఓటింగ్ సాధించిన గ్రామాలకు ప్రకటించిన బహుమతుల బంపర్ డ్రాలో శనివారం కలెక్టర్ స్మితా సబర్వాల్ లచ్చమ్మకు కారును అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణులే అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారని, అక్షరాస్యులుగా భావించే పట్టణ ప్రజలు ఓటింగ్ నమోదులో వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని పాటించాలని కోరారు. ఈ సందర్భంగా 106 గ్రామాలకు చెందిన ఓటర్లకు గ్రామానికి పది మందికి చొప్పున బహుమతులను అందజేశారు.
వేతనంతో కూడిన సెలవు ప్రకటించి అధిక ఓటింగ్ నమోదుకు సహకరించిన పరిశ్రమల ప్రతినిధులకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. అధిక శాతం ఓటింగ్ సాధించిన నర్సాపూర్ రిటర్నింగ్ అధికారికి రూ.50వేల నగదును, అందోల్ రిటర్నింగ్ అధికారికి రూ.25వేల నగదు బహుమతులను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విశేష సేవలందించిన జిల్లా పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. 95 శాతం పైగా ఓటింగ్ సాధించిన 25 గ్రామాల సర్పంచ్‌లకు రూ. 2 లక్షల ప్రోత్సాహక నగదును అందజేశారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, ఏజేసీ మూర్తి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.