నిలిపివేసిన బాన్సువాడ బస్సులు
నిజాంసాగర్(జుక్కల్): సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా హైద్రాబాద్ వెళ్తున్న బాన్సువాడ ఆర్టీసీ బస్సు సర్వీసులపై నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో అధికారులు అభ్యంతరం తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట బస్టాండ్ వద్ద బాన్సువాడ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులను నారాయణఖేడ్ డిపో అధికారులు అడ్డుకున్నారు. బిచ్కుంద, పిట్లం మీదుగా హైద్రాబాద్‌కు బాన్సువాడ డిపో నుంచి ఆరు అదనపు బస్సులు నడుపుతూ నారాయఖేడ్, సంగారెడ్డి, హైద్రాబాద్ ఆర్టీసీ డిపోల ఆదాయానికి గండి కొడుతున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్ మీదుగా వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేసి, సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా బస్సు సర్వీసులను ప్రారంభించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఆర్టీసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాన్సువాడ నుంచి బస్సు సర్వీసులను నడపడం వల్ల తమ బస్సులకు ఆదాయం తగ్గుతోందని, నష్టాలకు గురికావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను నిజాంపేటలో నిలిపి, ప్రయాణికులను ఇతర డిపోల బస్సుల్లో హైద్రాబాద్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సు సర్వీసులను రద్దు చేసుకొవాలని బాన్సువాడ ఆర్టీసీ అధికారులకు వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment