నర్రా కన్నుమూత
- షుగర్‌తో బాధపడుతున్న రాఘవరెడ్డి
- నార్కట్‌పల్లి కామినేనిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- నేడు నల్లగొండ జిల్లా వట్టిమర్తిలో అంత్యక్రియలు
చిట్యాల/నార్కట్‌పల్లి/నకిరేకల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి(91) గురువారం సాయంత్రం అనారోగ్యంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తిలోని తన నివాసంలో ఆయన 20 రోజుల క్రితం జారి కిందపడ్డాడు. మధుమేహంతో బాధపడుతున్న నర్రా తీవ్ర అస్వస్థతకు గురవడంతో తొలుత హైదరాబాద్‌లోని నిమ్స్ అసుపత్రికి తరలించారు. కోలుకున్నాక పది రోజుల క్రితం వట్టిమర్తికి తీసుకువచ్చారు.
కాగా గురువారం ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఉదయం 11 గంటల సమయంలో నార్కట్‌పల్లి శివారులోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటల సమయంలో నర్రా మృతిచెందారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం నల్లగొండలోని సీపీఎం కార్యాలయానికి తరలించారు. శుక్రవారం ఆయన స్వగ్రామం వట్టిమర్తిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నర్రా మరణవార్త తెలుసుకున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.
పార్టీలు, నేతల సంతాపం
సాక్షి, హైదరాబాద్: నర్రా రాఘవరెడ్డి మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాఘవరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని శ్లాఘించారు. నర్రా మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. నర్రాకు జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబసభ్యులకు సీపీఎం తరఫున పార్టీ తెలంగాణ కార్యదర్మి తమ్మినేని వీరభద్రం సానుభూతి వ్యక్తంచేశారు.
అట్టడుగు నుంచి అగ్ర స్థాయికి..
సీపీఎం విధానాలకు ఆకర్షితుడైన నర్రా రాఘవరెడ్డి 1949లో పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత వట్టిమర్తి గ్రామ శాఖ కార్యదర్శిగా మొదలుకుని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడి వరకు వివిధ హోదాల్లో పని చేశారు. 1959లో వట్టిమర్తి సర్పంచ్‌గా ఎన్నికై ఏడేళ్ల పాటు కొనసాగారు. 1967లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తొలి ప్రయత్నం లోనే శాసనసభకు ఎన్నికయ్యారు. 1972లో జరిగిన ఎన్నికల్లో పార్టీలో వర్గ విభేదాల వల్ల ఓటమి పాలయ్యారు. 1978 నాటికి పార్టీని నియోజకవర్గంలో పటిష్టం చేసి తిరిగి గెలుపొందారు. అప్పటినుంచి వరుసగా 1984, 1989, 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 1983 నుంచి ఏడేళ్లపాటు శాసన సభలో సీపీఎంపక్ష నాయకుడిగా పని చేశారు. 1999 తర్వాత వయస్సు మీద పడటం, అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు.