భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త.. ఆమె చితి వద్దే తీవ్ర మనస్తాపంతో కన్ను మూశాడు.
ఉప్పల్ (హైదరాబాద్): భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త.. ఆమె చితి వద్దే తీవ్ర మనస్తాపంతో కన్ను మూశాడు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...ఉప్పల్ బీరప్పగడ్డకు చెందిన గర్నెపల్లి నర్సింహ(80), మీనమ్మ(75) దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే, మీనమ్మ అనారోగ్య కారణాలతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందింది. వీరికి ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. బుధవారం కుటుంబ సభ్యులు మీనమ్మ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఉప్పల్ నాలా వద్ద గల శ్మశాన వాటికకు తీసుకువచ్చారు.
నడువలేని స్థితిలో ఉన్న భర్త నర్సింహను అతని కుమారులు ఆటోలో శ్మశాన వాటికకు తీసుకు వచ్చారు. ఆయన భార్యను కడసారిగా చూసుకున్నాడు. అంత్యక్రియల్లో భాగంగా కొడుకు చితి చుట్టూ తిరిగి నిప్పు పెట్టేలోగానే నర్సింహ కుర్చీలో కూర్చున్న చోటే కన్నుమూశాడు. దీంతో హతాశులైన కుటుంబ సభ్యులు కాసేపటి తరువాత నర్సింహకు కూడా అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు.