
నాసాకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఎంపిక
►ప్రాజెక్టుకు పారిజాతగా నామకరణం
►వెళ్లనున్న ముగ్గురు విద్యార్థుల బృందం
►ఆహ్వానం రావడమే తరువాయి
►ఇద్దరు ఈ కళాశాలకు చెందినవారే..
భైంసా/బాసర : చదువుల తల్లి సరస్వతీ నిలయమైన బాసరలోని ట్రిపుల్‌ఐటీకి చెందిన విద్యార్థులిద్దరు నాసాకు ఎంపికయ్యారు. ఏటా అంతరిక్షంలో మానవ మనుగడపై నాసా ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలను తెలిపేందుకు విద్యార్థులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులు తమ ఆలోచనలను కొరియర్, ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. నాసా బృందం విద్యార్థుల ఆలోచనలను చూసి వారిని ఆహ్వానిస్తుంది. ఎంపికైన వారు నాసాకు వెళ్లి అక్కడ ప్రపంచ శాస్త్రవేత్తల ముందు అంతరిక్షంలో మానవ మనుగడపై తమ ఆలోచనలను వివరించాలి. వీటిపై పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు కూడా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి పలువురు విద్యార్థులను ఎంపిక చేశారు.
నాలుగోసారి..
బాసర ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులు ఇప్పటికి నాలుగుసార్లు నాసాకు ఎంపికయ్యారు. అమర్థ్య, ఇంద్రప్రస్తా, శ్రీచక్ర పేరిట తమ ఆలోచనలను వివరించారు. నాసా వేదికగా తాము పంపిన ప్రాజెక్టులను వివరించి శాస్త్రవేత్తల మెప్పు పొందారు.
ఇప్పుడు పారిజాత..
ఇప్పటికే మూడు పర్యాయాలు నాసా వెళ్లిన బాసర విద్యార్థులు ఈ ఏడాది కూడా తమ ప్రాజెక్టుకు పారిజాతగా నామకరణం చేశారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ-1 చదివే తోల నిహారిక, ఈ-2 చదివే కోన్‌కటి ప్రశాంత్, కరీంనగర్‌లో పాలిటెక్నిక్ చదివే త్రిశూల్ ఈ ప్రాజెక్టును రూపొందించారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఫిజిక్స్ లెక్చరర్ రాకేశ్‌రోషన్ గైడ్‌గా వ్యవహరించారు. విద్యార్థుల ఆలోచనలకు పదునుపెట్టి ప్రాజెక్టును రూపొందించారు. ఎంపికైన విద్యార్థులు మే 18 నుంచి 22వ తేదీ వరకు అంతరిక్షంలో మానవమనుగడ అనే అంశంపై శాస్త్రవేత్తల సమక్షంలో నాసాకు వెళ్లి పారిజాత ప్రాజెక్టును వివరించనున్నారు. ఈ ఎంపికపై తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా నుంచి మరొకరు..
మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గ పరి ధిలో గల నంగునూరు మండలంలోని ఘన్‌పూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ బాసర ట్రిపుల్‌ఐటీలో ఈ-2 చదువుతున్నాడు. నంగునూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిన ఈ విద్యార్థి బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. తండ్రి ఎల్లయ్య, తల్లి మనమ్మ వ్యవసాయ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను చదివించారు. అందరిలో చిన్నవాడైన ప్రశాంత్ నాసాకు ఎంపికకావడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులోని అంశాలు ఇవే...
బాసర ట్రిపుల్‌ఐటీలో ఉండే విద్యార్థులంతా రూరల్ నుంచి వచ్చిన యూత్ సభ్యులే. ఈ రూరల్ యూత్ నుంచి ఇప్పటికే పలువురు నాసాకు ఎంపికయ్యారు. పారిజాత పేరిట రూపొందిం చిన ఈ ప్రాజెక్టులో అంతరిక్షంలో మానవమనుగడపై విద్యార్థుల బృందం పలు విషయాలను సూచించింది. అంతరిక్షంలో ఎనర్జీ రీసైకిల్‌న్‌బిన్, రోబోల వినియోగం, భవన నిర్మాణాలు, భూమిమీద ఉన్న సౌకర్యాలను అంతరిక్షంలో టెక్నాలజీ సహాయంతో ఎలా రూపొందించాలో విద్యార్థులు వివరించనున్నారు. అయితే ఈ మేరకు వారికి ఆహ్వానం అందాల్సి ఉంది.
ఎంపిక కావడం సంతోషంగా ఉంది
మాది మెదక్ జిల్లా, నంగునూర్ మండలం గన్‌పూర్ గ్రామం. అమ్మ మణెమ్మ, నాన్న ఎల్లయ్య వ్యవసాయం చేస్తూ నన్ను చదివిస్తున్నారు. నాసాకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. - ప్రశాంత్, మెదక్
అమ్మ కష్టపడి చదివిస్తోంది
మాది కరీంగనర్‌లోని మంకమ్మతోట. అమ్మ విజయ, నాన్న మురళి చనిపోయారు. మా అమ్మ టెలర్‌గా పని చేస్తూ నన్ను చదివిస్తోంది. దీంతో నేను నాసా ప్రాజెక్టులో మొదటి ర్యాంక్ సాధించాను. - నిహారిక, కరీంన గర్