ఏపీలో నీలి విప్లవం తెస్తాం... | National Fisheries Development Board | Sakshi
Sakshi News home page

ఏపీలో నీలి విప్లవం తెస్తాం...

Published Sun, Nov 9 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

National Fisheries Development Board

  • ఎన్‌ఎఫ్‌డీబీ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎం.వి.రావు వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: ‘‘పిజ్జాలు, బర్గర్లు ఇంటికొస్తున్నాయా? లేదా? అటువంటప్పుడు పచ్చి చేపలు, ఇతర చేప ఉత్పత్తులు ఎందుకు ఇళ్ల వద్దకు రావు? వాటిని అందరికీ అందుబాటు తేవడమే లక్ష్యం. ఇందుకోసం పెద్దఎత్తున కార్యక్రమాలను చేపట్టాం...’’ అని జాతీయ మత్స్యశాఖాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.వి.రావ్ పేర్కొన్నారు.

    మత్స్యపరిశ్రమపై ఆధారపడిన వారిలో లక్షలాది పేద మత్స్యకారులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారేనని.. ఈ ఏడాది లక్ష మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు చేపల వినియోగాన్ని విరివిగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.
     
    కేజ్ కల్చర్‌కు ప్రోత్సాహం...

    ఆక్వా పెంపును ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తేవాలన్నది తమ లక్ష్యమని రావ్ చెప్పారు. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల నిల్వ, విక్రయ మెళకువలపై జాలర్లకు శిక్షణ ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వేయి మందికి పైగా జాలర్లకు శిక్షణ ఇచ్చారు. ‘‘ఇప్పటికే ఇది ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ముమ్మరంగా సాగవుతోంది.

    రాష్ట్రంలో శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. రిజర్వాయర్ లేదా చెరువుల్లో కొంతభాగాన్ని ఎంచుకుని అక్కడ నీటి మళ్లు ఏర్పాటు చేసి వాటి చుట్టూ ప్లాస్టిక్‌తో అడ్డుకట్టలు వేసి చేపల్ని పెంచుతారు. చిన్న రైతులతో పాటు పెద్దపెద్ద సంస్థలు సైతం ప్రస్తుతం ఈ కేజ్ కల్చర్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది’’ అని ఆయన వివరించారు.
     
    ఆధునిక చేపల మార్కెట్లు...

    చేపల మార్కెట్లను ఆధునీకరించి పరిశుభ్రంగా మలచాలని ఎన్‌ఎఫ్‌డీబీ నిర్ణయించినట్లు రావ్ తెలిపారు. మార్కెట్లను హోల్‌సేల్, రిటైల్, సంచార మార్కెట్లుగా విభజించిందని.. రోజువారీ చేపలు తెచ్చుకుని అమ్ముకునే వారికి, మత్స్యకారుల సహకార సంఘాలకు, మహిళా సంఘాలకు వాహనాలు రాయితీపై ఇస్తున్నట్లు చెప్పారు.  
     
    రాయితీ పొందటం ఇక సులభం...

    రాయితీ పొందే ప్రక్రియను సరళం చేశామని, ఒక పేజీ దరఖాస్తు చేసుకుంటే వారంలోగా దానిని పరిష్కరించటం జరుగుతుందని రావ్ వివరించారు. వ్యక్తిగత పథకాలకు (ద్విచక్రవాహనాలు, ఐస్ బాక్సులు, సంచార మార్కెట్ వంటివి) 25 శాతం, అదే ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం, అక్వేరియం చేపలకు (మహిళలకు) 40 శాతం, పురుషులకు (జనరల్) 25 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందని తెలిపారు. శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జాలర్లు ఈ రాయితీ ద్వారా లబ్ధి పొందినట్లు చెప్పారు. చేపల చెరువుకైతే హెక్టారుకు రూ. 3 లక్షల వ్యయమవుతుందని.. అందులో రూ. 60 వేలు రాయితీగా పొందవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement