Blue Revolution
-
‘మత్స్య సంపద’కు 20 వేల కోట్లు
న్యూఢిల్లీ: మత్స్య రంగ సమగ్ర అభివృద్ధి ద్వారా నీలి విప్లవం సాధించేందుకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)’కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 20,050 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర వాటా రూ. 9,407 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ. 5763 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకాన్ని 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల పాటు అమలు చేస్తారు. 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం, మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం, చేపల ఉత్పత్తిని 2024–25 నాటికి 2.2 కోట్ల టన్నులకు పెంచడం ఈ పథకం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం మత్స్య రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ పథకంలో రెండు విభాగాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అవి సెంట్రల్ సెక్టార్ స్కీమ్(సీఎస్), సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్(సీఎస్ఎస్). సీఎస్‌లో మొత్తం ప్రాజెక్టు ఖర్చును కేంద్రం భరిస్తుంది. కేబినెట్ ఆమోదించిన ఇతర నిర్ణయాలు.. ► వృద్ధులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి వయ వందన యోజన(పీఎంవీవీవై)’ను మరో మూడేళ్ల పాటు(2023 మార్చ్ 31వరకు) పొడగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 60 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వృద్ధులకు కనీస పెన్షన్ కచ్చితంగా లభించే ఈ పథకాన్ని ఎల్ఐసీ ద్వారా అమలు చేస్తున్నారు. 2020–21 సంవత్సరానికి రేట్ ఆఫ్ రిటర్న్‌ను 7.4 శాతానికి తగ్గించారు. గత సంవత్సరం ఇది 8 శాతంగా ఉంది. 2017–18 బడ్జెట్లో మొదట ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ► రెండు నెలల పాటు సుమారు 8 కోట్ల మంది వలస కూలీలకు కేంద్రం వాటా నుంచి నెలకు 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం రూ. 2982.27 కోట్లను ఫుడ్ సబ్సీడీ కింద, రూ. 127.25 కోట్లను రవాణా, ఇతర ఖర్చుల కింద కేటాయించారు. -
'చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం'
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నీలి విప్లవం పథకం కింద సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించడానికి పలు విధాలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మత్స్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నీలి విప్లవం పథకం కింద సాంప్రదాయక చేపల పడవలను ఆధునీకరించుకోవడానికి, మత్స్యకారులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఫైబర్ గ్లాస్ ప్లాస్టిక్ బోట్లు, ఇన్సులేటెడ్ ఐస్ బాక్స్‌లు సమకూర్చుకోవడానికి ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మత్స్యకారులు సముద్ర జలాల్లో సుదూరంగా వేటను కొనసాగించడానికి ట్రాలర్లను లాంగ్ లైనర్స్ కింద మార్చుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేట సామర్ధ్యం తగ్గ లేదని, 2017-18లో మొత్తం మత్స్య సంపదలో 70 శాతం వరకు వేటాడినట్లు మంత్రి వివరించారు. అయితే దేశంలో వివిధ కేటగిరీలకు చెందిన 2.6 లక్షల బోట్లు చేపల వేట సాగిస్తున్నట్లు తెలిపారు. దేశానికి చెందిన సముద్ర జలాల్లో మొత్తం 5.31 మిలియన్ మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉన్నట్లుగా అంచనా వేశామని తెలిపారు. తీర ప్రాంత భద్రతను పటిష్టపరచేందుకు ఏర్పాటైన జాతీయ కమిటీ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల భద్రతకు సంబంధించినన వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. -
నీలి విప్లవం
నల్లగొండ టూటౌన్: చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేపలు పోయగా కేంద్రప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ప్రైవేట్ భూముల్లో చెరువుల తవ్వకానికి సబ్సిడీ అవకాశం కల్పిస్తూ మత్స్య పరిశ్రమ సమీకృత అభివృద్ధి పథకం (నీలి విప్లవం) ప్రవేశ పెట్టింది. దీనిని పకడ్బందీగా అమలు చేసి అర్హులైన వారికి ఈ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నీరు ఉన్న చోటనే చెరువుల నిర్మాణం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీలి విప్లవం పథకంలో చేపల చెరువుల నిర్మాణాలకు సమృద్ధిగా నీటి వసతి ఉండాల్సి ఉంటుంది. కేవలం బోరు, బావుల మీదే ఆధార పడకుండా ప్రవహించే వనరులు కలిగి ఉండాలి. రైతులు నిర్మించే చెరువుకు సమీపంలో ఏదైనా నది, పారే కాల్వ, వాగులు, ఏఎమ్మార్పీ కెనాల్,మూసీ లాంటి నదులు ఉండి నీటి వసతి పుషల్కంగా ఉండే ప్రాంతాల రైతులకే దీనిని వర్తింప జేస్తారు. చేపల చెరువు నిర్మాణాల్లో 50 శాతం ప్రభుత్వం ఇవ్వనుండగా రైతు 50 శాతం భరించాల్సి ఉంది. ఒక్కో లబ్థిదారుడికి రెండున్నర హెక్టార్లకు (5ఎకరాలు) మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. వీటికి సబ్సిడీ .. చేపల చెరువులు, ఉత్పాదకాలు, చేప పిల్లల హేచరీల నిర్మాణం, చేప పిల్లల పెంపక, చెరువుల నిర్మాణం, కేజ్ (పంజరాలు) లలో చేపల పెంపకం, మినీ దాణా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు తదితర వాటికి సబ్సిడీ ఇవ్వనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపల పిల్లలను ఉచితంగా మత్స్యకారులకు సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎక్కడా లేకపోవడంతో ఆంధ్రాప్రాంతం నుంచి చేప పిల్లల విత్తనాలను తెప్పించింది. ఇక్కడ చేప పిల్లల పెంపకం చేపట్టే విధంగా ప్రభుత్వం సబ్సిడీ అవకాశం కల్పిం చింది. ఇక్కడే చేప పిల్లల విత్తనాలు లభించడం, ఉత్పత్తిని ప్రోత్సహిం చ డం ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశం లభించనుంది. కలెక్టర్ నేతృత్వంలో లబ్ధిదారుల ఎంపిక.. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే రైతులు జిల్లా స్థాయి కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఏ రైతు అయినా చేపల పెంపకానికి చెరువులు నిర్మాణాలు చేపట్టవచ్చు. భూమి పై పూర్తి హక్కు ఉండడంతో పాటు స్వదేశీ చేపలను మాత్రమే పెంచాల్సి ఉంటుంది. భూమి సారవంతమైనది కాకూడదు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖ అధికారి కన్వీనర్‌గా , జేడీఏ, ఐబీ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ అన్ని దరఖాస్తులను పరిశీలించి అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుంది. చెరువుల నిర్మాణాల వివరాలు పథకం పేరు యూనిట్ సబ్సిడీ లబ్ధిదారుడి విలువ వాటా చేపల చెరువుల నిర్మాణం 7.00 3.50 3.50 ఉత్పాదకాలు 1.50 0.75 0.75 చేపల హేచరీల నిర్మాణం 25.00 12.50 12.50 చేపల పిల్లల పెంపక 6.00 3.00 3.00 చెరువుల నిర్మాణం కేజ్‌లలో చేపల పెంపకం 25.00 20.00 5.00 మినీ దాణా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు 10.00 5.00 5.00 -
ఏపీలో నీలి విప్లవం తెస్తాం...
ఎన్ఎఫ్డీబీ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎం.వి.రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘పిజ్జాలు, బర్గర్లు ఇంటికొస్తున్నాయా? లేదా? అటువంటప్పుడు పచ్చి చేపలు, ఇతర చేప ఉత్పత్తులు ఎందుకు ఇళ్ల వద్దకు రావు? వాటిని అందరికీ అందుబాటు తేవడమే లక్ష్యం. ఇందుకోసం పెద్దఎత్తున కార్యక్రమాలను చేపట్టాం...’’ అని జాతీయ మత్స్యశాఖాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.వి.రావ్ పేర్కొన్నారు. మత్స్యపరిశ్రమపై ఆధారపడిన వారిలో లక్షలాది పేద మత్స్యకారులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారేనని.. ఈ ఏడాది లక్ష మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు చేపల వినియోగాన్ని విరివిగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. కేజ్ కల్చర్‌కు ప్రోత్సాహం... ఆక్వా పెంపును ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తేవాలన్నది తమ లక్ష్యమని రావ్ చెప్పారు. ఇందులో భాగంగా చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల నిల్వ, విక్రయ మెళకువలపై జాలర్లకు శిక్షణ ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వేయి మందికి పైగా జాలర్లకు శిక్షణ ఇచ్చారు. ‘‘ఇప్పటికే ఇది ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ముమ్మరంగా సాగవుతోంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. రిజర్వాయర్ లేదా చెరువుల్లో కొంతభాగాన్ని ఎంచుకుని అక్కడ నీటి మళ్లు ఏర్పాటు చేసి వాటి చుట్టూ ప్లాస్టిక్‌తో అడ్డుకట్టలు వేసి చేపల్ని పెంచుతారు. చిన్న రైతులతో పాటు పెద్దపెద్ద సంస్థలు సైతం ప్రస్తుతం ఈ కేజ్ కల్చర్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది’’ అని ఆయన వివరించారు. ఆధునిక చేపల మార్కెట్లు... చేపల మార్కెట్లను ఆధునీకరించి పరిశుభ్రంగా మలచాలని ఎన్ఎఫ్డీబీ నిర్ణయించినట్లు రావ్ తెలిపారు. మార్కెట్లను హోల్‌సేల్, రిటైల్, సంచార మార్కెట్లుగా విభజించిందని.. రోజువారీ చేపలు తెచ్చుకుని అమ్ముకునే వారికి, మత్స్యకారుల సహకార సంఘాలకు, మహిళా సంఘాలకు వాహనాలు రాయితీపై ఇస్తున్నట్లు చెప్పారు. రాయితీ పొందటం ఇక సులభం... రాయితీ పొందే ప్రక్రియను సరళం చేశామని, ఒక పేజీ దరఖాస్తు చేసుకుంటే వారంలోగా దానిని పరిష్కరించటం జరుగుతుందని రావ్ వివరించారు. వ్యక్తిగత పథకాలకు (ద్విచక్రవాహనాలు, ఐస్ బాక్సులు, సంచార మార్కెట్ వంటివి) 25 శాతం, అదే ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం, అక్వేరియం చేపలకు (మహిళలకు) 40 శాతం, పురుషులకు (జనరల్) 25 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందని తెలిపారు. శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జాలర్లు ఈ రాయితీ ద్వారా లబ్ధి పొందినట్లు చెప్పారు. చేపల చెరువుకైతే హెక్టారుకు రూ. 3 లక్షల వ్యయమవుతుందని.. అందులో రూ. 60 వేలు రాయితీగా పొందవచ్చని తెలిపారు. -
'పెర్ డ్రాప్ మోర్ క్రాప్'
న్యూఢిల్లీ: నాణ్యతలో రాజీపడకుండా పంటల ఉత్పత్తులు పెంచేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పరిశోధనా ఫలాలు రైతులకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. 'పెర్ డ్రాప్- మోర్ క్రాప్' తమ విధానమని ప్రధాని స్పష్టం చేశారు. రైతులను చైతన్యవంతులను చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సొంతంగా రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దిగుమతులపై ఆధారపడకుండా ఆయిల్ సీడ్స్, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నించాలన్నారు. నీలి విప్లవం ద్వారా చేపల వర్తకం పెంచేందుకు పాటు పడాలని మోడీ పిలుపునిచ్చారు. -
నీలి విప్లవంతో ఆహార భద్రత: రాధామోహన్ సింగ్
* కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ * ముఖ్యమంత్రులు కేసీఆర్, బాబుతో వేర్వేరుగా భేటీ సాక్షి, హైదరాబాద్: సుస్థిరమైన ఆహార భద్రతకు నీలి విప్లవం దోహద పడుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరిగే ఏషియా ఫసిఫిక్ రీజియన్ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు 21 దేశాల నుంచి 30 మంది మత్స్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తుల్లో మనదేశం రెండో స్థానంలో ఉందన్నారు. దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందడమే లక్ష్యంగా నరేంద్రమోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. నదుల అనుసంధానం ద్వారా ఈ ల క్ష్యం సాధిస్తామని పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలని నరేంద్రమోడీ కృతనిశ్చయంతో ఉన్నార ని, ఇది జరగాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్‌మోర్చా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఫిష్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. సాగుకు సాయపడండి తెలంగాణలో వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు ఇవ్వాల ని కేంద్ర మంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశా రు. కేంద్రమంత్రి సింగ్ సీఎం కేసీఆర్‌ను సోమవారం సచివాలయంలో కలిశారు. తుంపర సేద్యానికి 500 కోట్లివ్వండి: బాబు ఆంధ్రప్రదేశ్‌లో తుంపర సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాధామోహన్‌సింగ్‌ను కోరారు. సోమవారం ఆయనకు బాబు తన నివాసంలో విందు ఇచ్చారు.