నల్లగొండ టూటౌన్: చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేపలు పోయగా కేంద్రప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ప్రైవేట్ భూముల్లో చెరువుల తవ్వకానికి సబ్సిడీ అవకాశం కల్పిస్తూ మత్స్య పరిశ్రమ సమీకృత అభివృద్ధి పథకం (నీలి విప్లవం) ప్రవేశ పెట్టింది. దీనిని పకడ్బందీగా అమలు చేసి అర్హులైన వారికి ఈ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
నీరు ఉన్న చోటనే చెరువుల నిర్మాణం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీలి విప్లవం పథకంలో చేపల చెరువుల నిర్మాణాలకు సమృద్ధిగా నీటి వసతి ఉండాల్సి ఉంటుంది. కేవలం బోరు, బావుల మీదే ఆధార పడకుండా ప్రవహించే వనరులు కలిగి ఉండాలి. రైతులు నిర్మించే చెరువుకు సమీపంలో ఏదైనా నది, పారే కాల్వ, వాగులు, ఏఎమ్మార్పీ కెనాల్,మూసీ లాంటి నదులు ఉండి నీటి వసతి పుషల్కంగా ఉండే ప్రాంతాల రైతులకే దీనిని వర్తింప జేస్తారు. చేపల చెరువు నిర్మాణాల్లో 50 శాతం ప్రభుత్వం ఇవ్వనుండగా రైతు 50 శాతం భరించాల్సి ఉంది. ఒక్కో లబ్థిదారుడికి రెండున్నర హెక్టార్లకు (5ఎకరాలు) మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.
వీటికి సబ్సిడీ ..
చేపల చెరువులు, ఉత్పాదకాలు, చేప పిల్లల హేచరీల నిర్మాణం, చేప పిల్లల పెంపక, చెరువుల నిర్మాణం, కేజ్ (పంజరాలు) లలో చేపల పెంపకం, మినీ దాణా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు తదితర వాటికి సబ్సిడీ ఇవ్వనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపల పిల్లలను ఉచితంగా మత్స్యకారులకు సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎక్కడా లేకపోవడంతో ఆంధ్రాప్రాంతం నుంచి చేప పిల్లల విత్తనాలను తెప్పించింది. ఇక్కడ చేప పిల్లల పెంపకం చేపట్టే విధంగా ప్రభుత్వం సబ్సిడీ అవకాశం కల్పిం చింది. ఇక్కడే చేప పిల్లల విత్తనాలు లభించడం, ఉత్పత్తిని ప్రోత్సహిం చ డం ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశం లభించనుంది.
కలెక్టర్ నేతృత్వంలో లబ్ధిదారుల ఎంపిక..
జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే రైతులు జిల్లా స్థాయి కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఏ రైతు అయినా చేపల పెంపకానికి చెరువులు నిర్మాణాలు చేపట్టవచ్చు. భూమి పై పూర్తి హక్కు ఉండడంతో పాటు స్వదేశీ చేపలను మాత్రమే పెంచాల్సి ఉంటుంది. భూమి సారవంతమైనది కాకూడదు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖ అధికారి కన్వీనర్‌గా , జేడీఏ, ఐబీ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ అన్ని దరఖాస్తులను పరిశీలించి అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుంది.
చెరువుల నిర్మాణాల వివరాలు
పథకం పేరు యూనిట్ సబ్సిడీ లబ్ధిదారుడి
విలువ వాటా
చేపల చెరువుల నిర్మాణం 7.00 3.50 3.50
ఉత్పాదకాలు 1.50 0.75 0.75
చేపల హేచరీల నిర్మాణం 25.00 12.50 12.50
చేపల పిల్లల పెంపక 6.00 3.00 3.00
చెరువుల నిర్మాణం
కేజ్‌లలో చేపల పెంపకం 25.00 20.00 5.00
మినీ దాణా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు 10.00 5.00 5.00
నీలి విప్లవం
Published Wed, Dec 28 2016 12:47 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement