మోదీ విధానాలపై దేశవ్యాప్త ఉద్యమం: చాడ
కరీంనగర్: మోదీ సర్కారు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, వర్సిటీల్లో మతతత్వ రాజకీయాలను చొప్పించే చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఐక్య ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు.
మోదీ పాలనలో దేశవ్యాప్తంగా మతోన్మాదం పెరిగిపోతోందన్నారు. రోహిత్ ఆత్మహత్య విషయంలో వీసీపై ఇంతవరకు చర్య తీసుకోలేదన్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌పై కక్షసాధింపు చర్యలో భాగంగానే కేసులు బనాయించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికే ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తోందని దుయ్యబట్టారు.