- హడలెత్తిస్తున్న డయేరియా
- నాలుగు రోజుల్లో ఇద్దరు మృతి
- ఆస్పత్రిలో మరో నలుగురు
- మెడికల్ క్యాంపు ఏర్పాటుకు డిమాండ్
మెదక్ మున్సిపాలిటీ : పట్టణంలోని నవాబుపేట వీధి ప్రజలు వాంతులు, విరేచనాలతో వణికిపోతున్నారు. నాలుగు రోజుల్లో ఇదే పరిస్థితులు ఎదుర్కొంటూ ఇద్దరు మృత్యువాత పడగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం నవాబుపేట వీధికి చెందిన బొందుగుల రవి, సునీత దంపతుల కుమార్తె పల్లవి (4) తీవ్ర వాంతులు, విరేచనాలకు గురైంది. దీంతో తల్లిదండ్రులు పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగినా వారు చేర్చుకోకపోవడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఐదు నిమిషాల్లోనే చిన్నారి మృత్యువాత పడింది.
ఇదే వీధికి చెందిన గట్టయ్య (50) నాలుగు రోజుల క్రితం తీవ్ర వాంతులు, విరేచనాలకు గురై మృతి చెందాడు. గురువారం మృతి చెందిన పల్లవి అన్నయ్య మహేష్, వీఆర్‌ఓ మాణయ్యతో పాటు మరో ఇద్దరు మహిళలు సైతం వాంతులు, విరేచనాలకు గురి కాగా పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపాలిటీ నుంచి సరఫరా చేసే నీటిని తాగడం వల్లే రోగాల బారిన పడుతున్నట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వార్డులో మెడికల్ క్యాంపు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి : డీసీహెచ్, డాక్టర్ ఆశీర్వాదం
వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడం, సరైన సమయంలో వైద్యం అందక పోవడంతోనే చిన్నారి పల్లవి మృతి చెందిందని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డీసీహెచ్ డాక్టర్ ఆశీర్వాదం తెలిపారు. గురువారం చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చే లోపే పరిస్థితి విషమించిందన్నారు. చిన్నారికి జ్వరం లాంటి లక్షణాలు లేకపోవడం, కేవలం వాంతులు, విరేచనాలు కావడంతో డయేరియాగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాంతులు, విరేచనాలు అవ్వగానే వైద్యులను సంప్రదించాలన్నారు.
వణుకుతున్న నవాబుపేట
Published Fri, Sep 19 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement
Advertisement