వీరి వీరి గుమ్మడిపండు
ఎంపీ టిక్కెట్‌పై నేతల ఆశలు
టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ
అభ్యర్థి కోసం కాంగ్రెస్ యత్నాలు
వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. అధికార టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అన్ని పార్టీల్లో ఆశావహులు టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో టిక్కెట్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఈ పార్టీల్లోని సీనియర్ నేతలు, కొత్తవారు, తటస్థులు.. ఎవరికివారు అభ్యర్థిత్వం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌లో ఆశావహుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మనుసులో ఏముందో తెలియక అయోమయం నెలకొంది. జిల్లాలోని టీఆర్‌ఎస్ ముఖ్యనేతల పరిస్థితి ఇలాగే ఉంది. వరంగల్ ఉప ఎన్నికలో వ్యూహం, పోటీ చేసే వారి అంశంలో తమను సంప్రదించకపోవడం జిల్లా నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఆశావహులు మాత్రం జిల్లాలోని మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్యనేతలను కలిసి తమకు అవకాశం వచ్చేలా చూడాలని కోరుతున్నారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్నవారితోపాటు కొత్తవారు టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీగా వరంగల్ లోక్‌సభ స్థానం గెలుచుకోవడం టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.
టీఆర్‌ఎస్‌లో ఆశావహులు అనేకం
టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి క్రీయాశీలంగా ఉన్న గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి, బోడ డిన్న, పసునూరి దయాకర్, జోరిక రమేశ్ తమకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఉద్యమంలో కీలక దశల్లో కీలకంగా వ్య వహరించిన బోడ డిన్నకు విద్యార్థుల కోటాలో తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. విద్యార్థుల కోటాలో ఉస్మానియాకే అవకాశాల్లో ప్రాధాన్యత దక్కింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమలో ఒకరికి వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పని చేస్తున్నవారితోపాటు మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య, జన్ను జకారియా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పోలీసు అధికారి ఆరోగ్యం అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు టీఆర్‌ఎస్‌లో సమీకరణలు మారుతాయని.. కొత్త వాళ్లకు తెరపైకి వస్తారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో సేమ్ సీన్
కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంటోంది. ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఎన్నిక కోసం జిల్లాలో ఈ నెలాఖరులో పర్యటించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరేది స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్య మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ మాత్రం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. జి.వివేక్ కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాలని దీని కోసం లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను బరిలో దించాలని కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు అధిష్టానానికి సూచిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారవుతారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ, వామపక్షాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీడీపీ పొత్తుతో తమ పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జైపాల్, చింతా సాంబమూర్తి, కొత్త రవి తదితరులు టిక్కెట్ ఆశిస్తున్నారు. జిల్లాలోని బీజేపీ నేతలు మాత్రం బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కోరుతున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె పోటీ చేసే అవకాశం ఉందని కమలనాథులు చెబుతున్నారు. వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ప్రజాగాయకుడు గద్దర్, మల్లెపల్లి లక్ష్మయ్యలో ఒకరితో పోటీ చేయించాలని చూస్తున్నాయి.