Warangal Lok Sabha by-election
-
ఆ ఇద్దరికి అగ్నిపరీక్ష!
* కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు కీలకంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు * మేయర్ పీఠం రాకపోయినా మెరుగైన ఫలితాలు ఆశిస్తున్న కాంగ్రెస్ * వరంగల్ ఓటమి తరువాత ఉత్తమ్‌కు అసలు పరీక్ష * బీజేపీలోనూ అదే పరిస్థితి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధినేతలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. అలాగని జీహెచ్ఎంసీ పీఠం ఎగరేసుకురావాలని ఈ రెండు పార్టీల అధినాయకత్వాలు కోరుకోవడం లేదు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక వంటి ఘోర పరాజయం పునరావృతం కాకుండా ఉంటే చాలునని ఈ పార్టీల అధినాయకత్వాలు భావిస్తున్నాయి. వారి అంచనాలకు తగ్గట్టు కాంగ్రెస్, బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాయా... ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ. మరి మెరుగైన ఫలితాల సాధన కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తగిన వ్యూహాలతో ముందుకెళ్లడం లేదని, స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆ పార్టీల సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పదవీ కాలం పూర్తి చేసుకున్న కిషన్‌రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఈ ఎన్నికలే కీలకం కానున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు సొంత పార్టీలోనే వ్యతిరేక కూటములు తయారవుతున్నాయి. ఉత్తమ్ నాయకత్వానికి అసలు పరీక్ష పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌కు ఈ ఎన్నికలు అసలు సిసలు పరీక్షే. వరంగల్ ఉప ఎన్నిక ఘోర పరాజయానికి అభ్యర్థి ఎంపికలో అధిష్టానం తప్పిదాలు కూడా తోడవడంతో ఉత్తమ్ దాన్నుంచి తేలిగ్గానే బయటపడ్డారు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యవహారాన్ని అధిష్టానం పూర్తిగా పీసీసీ నాయకత్వానికే వదిలేసింది. అభ్యర్థుల ఎంపికలో ఢిల్లీ జోక్యం ఏ మాత్రం లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదని నలుగురు మాజీలు నామినేషన్లకు ఆఖరు రోజైన ఆదివారం పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో తాము ఓడిపోవడానికి కారణమైన వారికి టికెట్లు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, శ్రీశైలం గౌడ్, లక్ష్మారెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. పీసీసీ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నామినేషన్ల ఘట్టం కూడా ముగియకముందే కాంగ్రెస్‌లో కొట్లాట మొదలుకావడం గమనార్హం. ‘మా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు గట్టి పోటీ ఇస్తారో మాకే బాగా తెలుసు. కానీ, మా ప్రమేయం లేకుండానే ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇస్తే దానికి బాధ్యులు ఎవరు. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో డివిజన్లు గెలుచుకోకపోతే పార్టీలో ఎవరూ ఉండరు. ఆ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వాపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఉన్నా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చేదాకా పీసీసీ తరఫున ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని పార్టీ రాజ్యసభ సభ్యుడొకరు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలన్న ఆశ కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. పార్టీలో ఏ ఒక్కరిని కదిలించినా 25 డివిజన్లు వచ్చినా చాలు అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఈ సంఖ్యలో కూడా గెలవకపోతే ఉత్తమ్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిదని సీనియర్ నేత ఒకరు అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి సరైన పోటీ ఇవ్వలేని స్థితికి ఎందుకు దిగజారిందో అధిష్టానం విశ్లేషించుకోవాలని ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. పొత్తులు తేలక కమలం అప్రతిష్టపాలు బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవడం అటుంచి టీడీపీతో పొత్తునే నామినేషన్ల చివరి రోజుదాకా తేల్చలేకపోయింది. టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయించడంతో ఆశావహులు, వారి వెనుక ఉండి మద్దతు ఇస్తున్న సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారు. కిషన్‌రెడ్డిని తొలగించాలంటూ ఎన్నికలకు ముందే గ్రేటర్లో ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లకూడదని అనుకోబట్టే తాము మౌనంగా ఉన్నామని లేదంటే కిషన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉండటానికి అనర్హుడని నగరానికి చెందిన పార్టీ ఎమ్మెల్యే ఒకరన్నారు. నామినేషన్ల ఆఖరు రోజు సమయం ముగిసిన తరువాత కూడా బీజేపీ అభ్యర్థుల పేర్లను రహస్యంగా ఉంచడంపై ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
హమీలు నెరవేర్చని అధికార టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెబుతారు: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజారంజక, సంక్షేమ పాలనే తమ ఎజెండా అని... అలాంటి పాలనను కోరుకుంటున్న ప్రజలు తమ అభ్యర్థిని గెలిపిస్తారని పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు నల్లాసూర్యప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ ఎన్నిక ల కోసం అయ్యే వ్యయం కోసం పార్టీ తరఫున వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన రూ.25 లక్షల చెక్కును, బీ-ఫారాన్ని అందజేశారు. అనంతరం పార్టీనాయకులు కె.శివకుమార్,కొండా రాఘవరెడ్డి, గుణ్ణం నాగిరెడ్డి, ముజ్తఫా, జయరాజ్‌లతో కలసి పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయి, అందుకు కారణమేమిటో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఎన్ని హామీలిచ్చిందో, ఎన్ని నెరవేర్చిందో అందరూ చూస్తున్నారని... సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తుంగలో తొక్కిన అధికార టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. దళితుల హక్కుల కోసం కృషి చేసిన వ్యక్తిగా సూర్యప్రకాశ్‌కు ఎంతో పేరు, గుర్తింపు ఉన్నాయని, పార్టీ స్థాపించిన నాటి నుంచి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ హయాం నాటి పాలనను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశీస్సులే తమ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని పొంగులేటి చెప్పారు. బుధవారం సూర్యప్రకాశ్ నామినేషన్ దాఖలు చేస్తారని.. ప్రచారంలో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలుపుదామని పొంగులేటి పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్ను ఓడించాలన్న చిత్తశుద్ధి ప్రతిపక్షాలకు ఉంటే ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ముందుకు రావాలన్నారు. అధికార పార్టీతో కొన్ని ప్రతిపక్షాలు కుమ్మక్కు కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీపై పోటీకి వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలిపితే కుమ్మక్కయ్యారంటూ కొన్ని పార్టీలు, నాయకులు విమర్శించడం హాస్యాస్పదమని పొంగులేటి అన్నారు. టీఆర్ఎస్తో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. 13 ఏళ్ల పోరాట ఫలితంగా రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ గెలుపొందందని ఇప్పుడు అందుకు భిన్నమైన తీర్పు వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా పొంగులేటి చెప్పారు. ఒక కార్యకర్తకు గౌరవమిచ్చారు: నల్లా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తగా తనకు వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమిచ్చి గౌరవించారని, ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన సందర్భంగా సూర్యప్రకాష్ విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికలు ఒక సాధనమన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, దొర పోకడలను ఈ ఎన్నికల ప్రచారంలో ఎత్తిచూపుతామన్నారు. వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ కండువా కప్పుకుని మిత్రపక్షంగా పోటీ చేశారని... ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా విప్‌ను జారీ చేశారని మండిపడ్డారు. ఉపఎన్నికల్లో తనకు టికెట్ వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
కొందరు సై.. మరి కొందరు నై!
సిరిసిల్ల రాజయ్య అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజ య్యను ప్రకటించడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్యకే మళ్లీ టికెట్ ఇవ్వడంపై కొందరు పెదవి విరుస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీల బృందంలో ఒకరిగా, వరంగల్ లోక్‌సభ పరిధిలో పాత పరిచయాలున్నందున పలువురు నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. పోటీపడిన ముగ్గురు నేతల్లో సిరిసిల్ల రాజయ్య మినహా మరో ప్రత్యామ్నా యం లేకుండా పోయిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. వివేక్ పోటీ చేస్తే కాం గ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఇంకా ఎక్కువగా ఉండేదంటున్నారు. అభ్యర్థిత్వాన్ని ఆశిం చిన సర్వే సత్యనారాయణ, రాజయ్య మధ్య పోటీలో రాజయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపాల్సి వచ్చిందంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు, హామీలిచ్చి మోసం చేసే టీఆర్ఎస్ మధ్య పోరాటమని అంటున్నారు. ఆఫీసు బేరర్ల సమావేశం వరంగల్ లోక్‌సభలోని ఒక్కో మండలానికి ఒక్కో ముఖ్య నేతను ఇన్చార్జిగా నియమించాలని టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. ఇం దులో ఉపాధ్యక్షులు ఉద్దెమర్రి నర్సిం హారెడ్డి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్‌రావు, హరి రమాదేవి, కోలేటి దామోదర్, సి.జె.శ్రీనివాస్, కుమార్‌రావు, వేణుగోపాలరావు, కుసుమకుమార్, జయప్రకాశ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి ఈ ఉప ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేసేలా చూడాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. మండల, నియోజకవర్గ, లోక్‌సభ స్థాయిలో కమిటీలను వేయాలని నిర్ణయించారు. వరంగల్, హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్‌లు, మీడియా సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాయకులందరితో సోమవారం చర్చించిన తర్వాత పని విభజన కూడా పూర్తిచేసుకుందామని ఉత్తమ్ వివరించారు. -
ఎక్కడివక్కడే!
ఎన్నికల కోడ్‌తో నిలిచిన పథకాలు ఇన్నాళ్లూ అధికారుల అలసత్వంతో నత్తనడకే.. అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖలు అక్కడ ఓకే అంటేనే ముందడుగు వరంగల్ : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అధికారులు ఇంతకాలం చూపిన నిర్లక్ష్యం జిల్లా ప్రజలకు పెనుశాపంగా మారింది. అధికారుల అలసత్వానికి తాజాగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కోడ్ తోడైంది. ఈ ఏడాది జనవరిలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఏ క్షణాన్నైనా వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఇంత స్పష్టత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తీరా ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ వెల్లడైన తర్వాత తమ శాఖల పరిధిలో పథకాలను ఎలా కొనసాగించాలనే విషయంలో హైరానా పడుతున్నారు. పథకాలను కొనసాగించాలా, వద్దా అనే విషయంపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన వస్తే సరే... లేకుంటే లబ్ధిదారుల పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. అధికారులు చేసిన నిర్వాకానికి ఇప్పుడు అర్హులైన తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని దరఖాస్తుదారులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలులో జాప్యమైన కొన్ని సంక్షేమ పథకాల పరిస్థితి... ఎస్సీ స్టడీ సర్కిల్... జిల్లాలో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు గ్రూప్స్ పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోనే రెండో శిక్షణ కేంద్రాన్ని జిల్లాలో ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం దళిత అ భివృద్ధి శాఖ డెరైక్టరు స్వయంగా జిల్లాకు వచ్చి భవనాన్ని పరిశీలించగా.. పలువురు అభ్యర్థులు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అలాగే, స్టడీ సెంటర్ డెరైక్టర్ పో స్టు కోసం అధికారులు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడంతో పాటు గత నెల మొదటి వారంలోనే స్టడీ సెంటర్ ప్రారంభించాల్సి ఉంది. అరుుతే, అధికారు ల నిర్లక్ష్యం కారణంగా పనులు సకాలంలో పూర్తికాలేదు. కొత్త కార్యక్రమం కావడంతో ఎన్నికల నియమావళి పే రు చెప్పి పనులు నిలిపివేశారు. ఎన్నికల కోడ్ విషయం ముందే తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడతో... గ్రూప్స్ పరీక్షల కోచింగ్ కోసం వేచి చూస్తున్న పేద వి ద్యార్ధుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అనుమ తి కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామని.. అక్కడి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని దళిత అభివృద్ధి శాఖ డీడీ శంకర్ తెలిపారు. కార్పొరేషన్ రుణాలు... ఎస్సీ కార్పొరేషన్ నుంచి కొత్తగా రుణాల మంజూరుపై ఇటీవలే జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. 80 శాతం సబ్సిడీతో కొన్ని రకాల రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించడం తో అర్హులు చాలా మంది సంతోషపడ్డారు. వీరిలో కొం దరు ఇప్పటికే బ్యాంకర్లతో ఒప్పందాలు చేసుకున్నా రు. కోడ్ ప్రభావంతో ఎస్సీ కార్పొరేషన్ రుణాల మం జూరు ప్రక్రియ డిసెంబర్ వరకు వాయిదా పడింది. రుణాలు అందుతాయని ఆశించిన వారు ఇప్పుడు రెం డు నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు బీసీ కార్పొరేషన్ నుంచి ఇప్పటివరకు రుణాలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రాయితీల విషయం అధికారులు వెల్లడించకపోగా.. ఆయూ వర్గాలు కూడా ఎన్నికల పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. అరుుతే, పాత మంజూరీలు సైతం కోడ్ పూర్తయిన తర్వాతే ఉంటాయని అధికారులు తెలిపారు. అయ్యో ‘దీపం’... అర్హులైన పేదలకు కట్టెల పొయ్యి ఇబ్బందులను తొలగించే దీపం వంట గ్యాస్ కనెక్షన్ల పథకం అమలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. పథకం మంజూరై మూడు నెలలవుతున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. దీపం పథకం కింద జిల్లాలోని 12 నియోజకవర్గాలకు మొత్తం 60 వేల కనెక్షన్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పది వేల మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారు. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా ఎంపిక ప్రక్రియకే బ్రేక్ పడింది. భూ పంపిణీ... రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూపంపిణీ కార్యక్రమం జిల్లాలో మంచిగానే సాగుతోంది. ఈ పథకం అమలులో మన జిల్లా మూడో స్థానంలో నిలవగా.. ప్రస్తుతం 500 ఎకరాల వరకు భూమి పంపిణీకి సిద్ధంగా ఉంది. వారంలో చివరి దశ పనులు పూర్తయి పంపిణీ చేయూల్సి ఉండగా.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ విషయంలో అధికారులు ముందుగానే స్పందిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘వరంగల్’పై టీఆర్ఎస్ కసరత్తు
♦ టి.రాజయ్య భార్య వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ ♦ టికెట్ రేసులో పలువురు ఆశావహులు ♦ వారంలోగా షెడ్యూల్ వస్తుందని అంచనా సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి వారంలోపే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాతో అందుకు తగినట్లే ఏర్పాట్లు చేసుకుంటోంది. తమకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలువురు నేతలు అధినేత కేసీఆర్‌ను కోరారు. వరంగల్ జిల్లాకు చెందిన నాయకులకు తోడు జేఏసీలో పనిచేసి తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్న వారూ ఆశావహుల్లో ఉన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తనకు అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్నారు. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వాలని అగ్రనేతలను కోరారు. తానూ పోటీకి సిద్ధంగా ఉన్నానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న పిడమర్తి రవి తన మనసులోని కోరికను బయట పెట్టారు. ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే వివిధ సమీకరణలను ముందు పెట్టుకుని విశ్లేషించినట్లు చెబుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. రాజయ్య భార్య ఫాతిమా మేరీకి సంబంధించిన వివరాలను నిఘా వర్గాల ద్వారా సేకరించినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం సీనియర్ లైబ్రేరియన్‌గా వరంగల్ జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఆమెకు ఇంకా ఎంత సర్వీసు ఉంది? జీతమెంత? తదితర సర్వీసు పరమైన వివరాలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించాయని తెలిసింది. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై ఎస్సీ వర్గాల్లో కొంత వ్యతిరేక ప్రచారం జరిగింది. ఈ అపప్రదను తొలగించుకోవడానికి వరంగల్ ఎంపీ స్థానం నుంచి ఆయన కుటుంబ సభ్యులనే నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన మేరకే ఈ వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఆయన తనయుడు కూడా రేసులో ఉన్నాడని అంటున్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో కూడా రాజయ్య వరంగల్ ఉప ఎన్నికపై స్పందించినా, తమ కుటుంబం రేసులో ఉందని స్పష్టంగా చెప్పలేదు. రాష్ట్రంలో అత్యంత సానుభూతి తనపైనే ఉందని మాత్రం వ్యాఖ్యానించారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్‌లో మాదిగ వర్గ నేతలకే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. ‘గెలుపోటముల విషయాన్ని పక్కన పెడితే, మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది’ అని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. -
వరంగల్‌కు ఏడుగురు కేంద్ర మంత్రులు!
* ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ * కేసీఆర్‌పై వ్యూహాత్మక దాడికి కమల దళం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వరంగల్ స్థానాన్ని గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ రాష్ట్ర కమిటీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే వడపోతకు దిగిన కమల దళం.. అభ్యర్థి ఎంపిక కోసం వేచిచూడకుండా పార్టీ శ్రేణులను ఉపఎన్నిక కోసం సమాయత్తం చేసే చర్యలను ప్రారంభించనుంది. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5 దాకా సమావేశాలు నిర్వహించనుంది. వారంపాటు జరిగే ఈ సమావేశాలకు ఏడుగురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. దీనికి కొనసాగింపుగా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కేంద్ర మంత్రి కనుసన్నల్లో ఉప ఎన్నికను ఎదుర్కోవాలని పార్టీ భావిస్తోంది. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఎం.వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీ, సంతోష్ గంగ్వార్, హన్స్‌రాజ్ గంగారాం, బండారు దత్తాత్రేయ, చౌదరి బీరేందర్‌సింగ్ ఈ అసెంబ్లీ స్థాయి పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై వ్యూహాత్మక దాడి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోకుండా బీజేపీకి పేరు రావొద్దనే కుట్రతో పనులను కూడా అడ్డుకుంటోందని టీఆర్ఎస్ను విమర్శించాలని సంకల్పించింది. యాదాద్రి నుంచి హన్మకొండ దాకా 99 కిలోమీటర్ల జాతీయ రహదారి కోసం కేంద్రం రూ.1,900 కోట్లు మంజూరు చేయడం, ఈ నెల తొలి వారంలోనే శంకుస్థాపన జరగాల్సి ఉన్నా సీఎం అడ్డుపడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించడానికి కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ వస్తున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నేతలు వెల్లడించారు. మరోవైపు వరంగల్‌కు వారసత్వ నగరం, స్మార్ట్ సిటీ, అమృత్ పథకం వంటి వాటి ద్వారా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో వరంగల్ పట్టణంలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. పత్తి రైతుల కోసం పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న చేనేతశాఖ నుంచి సంతోష్ గంగ్వార్, అభివృద్ధి నమూనా కోసం దేశంలోనే మూడు మండలాల్లో వర్ధన్నపేటలోని పర్వతగిరిని ఎంపిక చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఆ శాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ ఒక సమావేశానికి హాజ రవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ సమావేశాలను ఏర్పాటు చేయనుంది. -
ఓరుగల్లు బరిలో నేనంటే నేను..!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య కొత్త పంచాయితీని తెచ్చిపెడుతోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో ఇక్కడ నుంచి పోటీకి అన్ని పార్టీలూ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా వరంగల్ స్థానం నుంచి బీజేపీ పోటీచేసింది. అయితే, ఇక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి తామే బరిలో దిగాలని టీడీపీ భావిస్తోంది. కానీ, బీజేపీ మాత్రం గత ఎన్నికల్లో ఓటమి పాలైన సీటులో తామే తిరిగి పోటీ చేస్తామని పట్టుబడుతోంది. ఇది రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసేలా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కేందమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇక్కడ నుంచి తాము పోటీచేస్తామని, ఇందుకు సహకరించాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును కలసి విజ్ఞప్తి చేశారు. కానీ, ఈ స్థానంలో తమకే అనుకూలత ఉందని, ఈసారి టీడీపీ నుంచే అభ్యర్థి బరిలో ఉంటారని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ బహుళ వ్యూహం! వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి గెలవడం ద్వారా పలు ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జైలుకెళ్లి వచ్చారు. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడూ ఈ వ్యవహారంలో బదనాం అయ్యారు. దీంతో వరంగల్‌లో గెలవడం ద్వారా పోయిన పరువును కొద్దిగానైనా కాపాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని ఉప ఎన్నికల్లో ఉపయోగించుకుని గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అధికారపార్టీలో స్థానికంగా గ్రూపులు ఉండడం కూడా తమకు లాభిస్తుం దని నమ్ముతోంది. అదేవిధంగా తమపార్టీ నుంచి టీఆర్ఎస్ ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేసుకోవడంపై గుర్రుగా ఉన్న టీడీపీ ఉప ఎన్నికల్లో విజయం ద్వారా అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని ఆశిస్తోంది. మిత్రపక్షం బీజేపీని బరిలో నుంచి తప్పించేందుకు కొత్తి ప్రతిపాదననూ తెరపైకి తెస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితి ఎవరికి అనూకూలంగా ఉందో తేల్చుకునేందుకు ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే చేయించాలని టీడీపీ నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు. ప్రత్యేక సమావేశంలో ఇదే అంశంపై టీడీపీ నేతలు చర్చించినట్లు తెలిసింది. సానుభూతిపై కమలం ఆశలు... మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి చెందిన తమకు ఈసారి సానుభూతి పవనాలు వీస్తాయని బీజేపీ భావిస్తోంది. అంతేకాకుండా ఈసారి కేంద్రంలో అధికారంలో ఉండడం అదనంగా కలిసివచ్చే అంశమని అభిప్రాయపడుతోంది. టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఆ పార్టీకి స్థానిక అభ్యర్ధి లేకపోవడం తమకు అనూకూలిస్తుందని అంచనా వేస్తోంది. టీడీపీని ఎలాగైనా ఒప్పించి బరిలో ఉండాల్సిందేనని పార్టీలో నిర్ణయం కూడా జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘ఓరుగల్లు బరిలో నేనంటే నేనంటూ’ ఇరు పార్టీలూ పట్టుబడుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, బీజేపీ సీనియర్ నేతల భేటీ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ, బీజేపీ సీనియర్ నాయకులు ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ శాసనసభాపక్ష నాయకుడుడాక్టర్ లక్ష్మణ్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రెండు పార్టీలూ కలసి పనిచేసి గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెలుచుకోవడంతోపాటు, వరంగల్‌లో విజయం సాధించాలని.. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై అంతర్గత సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య విభేదాలు ఏవైనా ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి అనే దానిపై కూడా చర్చించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. -
వీరి వీరి గుమ్మడిపండు
ఎంపీ టిక్కెట్‌పై నేతల ఆశలు టీఆర్ఎస్లో పెరుగుతున్న పోటీ అభ్యర్థి కోసం కాంగ్రెస్ యత్నాలు వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. అధికార టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అన్ని పార్టీల్లో ఆశావహులు టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టిక్కెట్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఈ పార్టీల్లోని సీనియర్ నేతలు, కొత్తవారు, తటస్థులు.. ఎవరికివారు అభ్యర్థిత్వం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అధికార టీఆర్ఎస్లో ఆశావహుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుసులో ఏముందో తెలియక అయోమయం నెలకొంది. జిల్లాలోని టీఆర్ఎస్ ముఖ్యనేతల పరిస్థితి ఇలాగే ఉంది. వరంగల్ ఉప ఎన్నికలో వ్యూహం, పోటీ చేసే వారి అంశంలో తమను సంప్రదించకపోవడం జిల్లా నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఆశావహులు మాత్రం జిల్లాలోని మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ జిల్లా ముఖ్యనేతలను కలిసి తమకు అవకాశం వచ్చేలా చూడాలని కోరుతున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్నవారితోపాటు కొత్తవారు టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీగా వరంగల్ లోక్‌సభ స్థానం గెలుచుకోవడం టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్లో ఆశావహులు అనేకం టీఆర్ఎస్లో మొదటి నుంచి క్రీయాశీలంగా ఉన్న గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి, బోడ డిన్న, పసునూరి దయాకర్, జోరిక రమేశ్ తమకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఉద్యమంలో కీలక దశల్లో కీలకంగా వ్య వహరించిన బోడ డిన్నకు విద్యార్థుల కోటాలో తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. విద్యార్థుల కోటాలో ఉస్మానియాకే అవకాశాల్లో ప్రాధాన్యత దక్కింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమలో ఒకరికి వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు భావిస్తున్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి పని చేస్తున్నవారితోపాటు మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య, జన్ను జకారియా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పోలీసు అధికారి ఆరోగ్యం అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు టీఆర్ఎస్లో సమీకరణలు మారుతాయని.. కొత్త వాళ్లకు తెరపైకి వస్తారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో సేమ్ సీన్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంటోంది. ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ ఈ ఎన్నిక కోసం జిల్లాలో ఈ నెలాఖరులో పర్యటించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరేది స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సిరిసిల్ల రాజయ్య మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ మాత్రం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ను బరిలో దింపాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. జి.వివేక్ కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాలని దీని కోసం లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను బరిలో దించాలని కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు అధిష్టానానికి సూచిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారవుతారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ, వామపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీడీపీ పొత్తుతో తమ పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జైపాల్, చింతా సాంబమూర్తి, కొత్త రవి తదితరులు టిక్కెట్ ఆశిస్తున్నారు. జిల్లాలోని బీజేపీ నేతలు మాత్రం బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కోరుతున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె పోటీ చేసే అవకాశం ఉందని కమలనాథులు చెబుతున్నారు. వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ప్రజాగాయకుడు గద్దర్, మల్లెపల్లి లక్ష్మయ్యలో ఒకరితో పోటీ చేయించాలని చూస్తున్నాయి. -
భరించే అభ్యర్థి ఎవరు..?
* ఓరుగల్లు ఉపఎన్నికపై టీపీసీసీ మల్లగుల్లాలు * కాసులు పెట్టే అభ్యర్థికోసం అన్వేషణ * ఖర్చుకోసం వెనుకాడుతున్న నేతలు * వ్యూహాత్మకంగా తెరపైకి మీరాకుమార్ సాక్షి, హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు టీపీసీసీకి ‘భారం’గా మారాయి. అధికారపార్టీ సిట్టింగ్ స్థానంలో పోటీ పడాలంటే అంగబలం, అర్థబలం దండిగా ఉన్న అభ్యర్థినే బరిలో నిలపాలి. అలాంటి అభ్యర్థి అయితేనే ఖర్చు భారం తమపై పడదని టీపీసీసీ భావిస్తోంది. ఇక్కడ గెలవాలంటే అర్థబలం కీలకమని, దీనికి తట్టుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థిని కాకుండా, పదేళ్లపాటు ప్రభుత్వ పదవుల్లో కొనసాగిన వారిని వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిపితేనే టీపీసీసీ నేతలపై భారం పడకుండా తప్పించుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా వ్యవహరించిన నేతలు సైతం వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాసక్తతతో ఉండడం పార్టీని కలవరపరుస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం వల్ల టీఆర్ఎస్కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని, ఖర్చుకు కూడా వెనకాడే పరిస్థితి ఉండదని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలంటే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారని ఆ పార్టీ నాయకుడొకరు పేర్కొంటున్నారు. మీరాకుమార్‌కు పార్టీ టికెట్ ఇస్తే వరంగల్‌లో ఉప ఎన్నిక ఖర్చు అంతా ఏఐసీసీ భరిస్తుందనే ఆలోచనలతోనే వ్యూహాత్మకంగా ఈ పేరును ప్రచారంలోకి తెచ్చినట్టుగా చెబుతున్నారు. దామోదరపై పెరుగుతున్న ఒత్తిడి టీఆర్ఎస్కు పోటీగా ఖర్చు పెట్టుకోవడంతో పాటు తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటీలో దిగాలంటూ కొందరు నేతలు కోరుతున్నారు. ఆయన బరిలో ఉంటే తెలంగాణవాదుల నుంచి మద్దతును పొందడం సులభం అవుతుందని వారు వాదిస్తున్నారు. తెలంగాణ 10 జిల్లాలకు రాయలసీమ జిల్లాలను కలిపే ప్రతిపాదనను వ్యతిరేకించిన చరిత్ర దామోదరకు ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలుచేయడంలోనూ కీలకంగా పనిచేశారని, ఇది ఆయనకు ఉప ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీలు జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య వంటిపేర్లపై అధిష్టానం సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. -
భూమి ఇయ్యలే !
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితులకు భూ పంపిణీ పథకం జిల్లాలో అటకెక్కింది. ప్రభుత్వ పెద్దలు, జిల్లా ఉన్నతాధికారులు ఈ పథకం గురించి పట్టించుకోవడంలేదు. జిల్లాలోని భూమి లేని దళిత కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వంద కుటుంబాలకు కూడా భూమి పంపిణీ చేయలేదు. భూ పంపిణీ పథకం ప్రారంభించిన ప్రారంభోత్సవం రోజున హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ పెద్దలు ఈ పథకంపై ఒక్కసారీ సమీక్షించడం లేదు. ఫలితంగా భూ పంపిణీ జిల్లాలో అధ్వానంగా మారింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితలకు భూ పంపిణీ పెద్ద అంశగా మారనుందని అధికార, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో 3 లక్షలకుపైగా దళిత కుటుంబాలు ఉన్నట్లు అంచనా. సామాజిక, ఆర్థిక అంశాలపై ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) విభాగం సర్వేలో జిల్లాలో భూమి లేని దళిత కుటుంబాలు 40 వేలు ఉన్నట్లు తేలింది. అధికారులు మాత్రం ఇంత సంఖ్య ఉండదని చెబుతున్నారు. ఇదే నిజమైనా జిల్లాలో భూమి లేని దళిత కుటుంబాలు 30 వేలు ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరం ఉన్న దళిత కుటుంబానికి రెండు ఎకరాలు... రెండు ఎకరాలు ఉన్న కుటుంబానికి ఒక ఎకరం చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2014 ఆగస్టు 15న భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది.ఏడాది కావస్తున్నా జిల్లాలో కేవలం 82 కుటుంబాలకు 241 ఎకరాల భూమిని పం పిణీ చేశారు. దళిత కుటుంబాలకు పంపిణీ చేసిన భూమిలో 214 ఎకరాలను ఇతరుల నుంచి కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీకి వినియోగించారు. భూ పంపిణీకి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియే లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు భూమి అందుబాటులో ఉన్న గ్రామాల్లోనే అర్హులను గుర్తిస్తున్నారు. ఇప్పటికి ఏడు నియోజవర్గాల్లోనే భూ పంపిణీ మొదలైంది. జిల్లాలో కేవలం 9 మండలాల్లోనే ప్రారంభించారు. స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, ములుగు నియోజకవర్గాల్లో భూ పంపిణీ మొదలే కాలేదు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నగర ప్రాంత నియోజకవర్గాలు కావడంతో ఈ పథకం అమలు చేయడం సాధ్యంకాదు. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కాట్రపల్లిలో 26 కుటుంబాలకు 73.01 ఎకరాలు పంపిణీ చేశారు. డోర్నకల్‌లో నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో 19దళిత కుటుంబాలకు 53.08 ఎకరాలు పంచారు.పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం ఆరు కుటుంబాలకు 17.04 ఎకరాలను పంపిణీ చేశారు. ఇదే నియోజకవర్గం కొడకండ్ల మండలం రంగాపురంలో ఏడు కుటుంబాలకు 18.28 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. నర్సంపేట మండలం బానోజీపేటలో ఏడు కుటుంబాలకు 27 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలం బొడ్లాడలో ఏడు కుటుంబాలకు 21 ఎకరాలు పంచారు. వర్ధన్నపేటలోని పర్వతగిరి మండలం వడ్లకొండలో ఆరు దళిత కుటుంబాలకు 17 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గం నర్మెట మండలం అమ్మపూర్లో నాలుగు కుటుంబాలకు 10.07 ఎకరాల భూమిని పంచారు. 3 కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున, ఒక కుటుంబానికి 1.07 ఎకరా పంపిణీ చేశారు.