వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ | Nalla surya prakash is a candidate of Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్

Published Wed, Nov 4 2015 2:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ - Sakshi

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్

హమీలు నెరవేర్చని అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు: పొంగులేటి
 
 సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ  ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజారంజక, సంక్షేమ పాలనే తమ ఎజెండా అని... అలాంటి పాలనను కోరుకుంటున్న ప్రజలు తమ అభ్యర్థిని గెలిపిస్తారని పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు నల్లాసూర్యప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ ఎన్నిక ల కోసం అయ్యే వ్యయం కోసం పార్టీ తరఫున వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన రూ.25 లక్షల చెక్కును, బీ-ఫారాన్ని అందజేశారు.

అనంతరం పార్టీనాయకులు కె.శివకుమార్,కొండా రాఘవరెడ్డి, గుణ్ణం నాగిరెడ్డి, ముజ్తఫా, జయరాజ్‌లతో కలసి పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయి, అందుకు కారణమేమిటో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ఎన్ని హామీలిచ్చిందో, ఎన్ని నెరవేర్చిందో అందరూ చూస్తున్నారని... సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తుంగలో తొక్కిన అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. దళితుల హక్కుల కోసం కృషి చేసిన వ్యక్తిగా సూర్యప్రకాశ్‌కు ఎంతో పేరు, గుర్తింపు ఉన్నాయని, పార్టీ స్థాపించిన నాటి నుంచి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

  వైఎస్సార్ హయాం నాటి పాలనను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశీస్సులే తమ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని పొంగులేటి చెప్పారు. బుధవారం సూర్యప్రకాశ్ నామినేషన్ దాఖలు చేస్తారని.. ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలుపుదామని పొంగులేటి పిలుపునిచ్చారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న చిత్తశుద్ధి ప్రతిపక్షాలకు ఉంటే ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ముందుకు రావాలన్నారు.

అధికార పార్టీతో కొన్ని ప్రతిపక్షాలు కుమ్మక్కు కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీపై పోటీకి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిలిపితే కుమ్మక్కయ్యారంటూ కొన్ని పార్టీలు, నాయకులు విమర్శించడం హాస్యాస్పదమని పొంగులేటి అన్నారు. టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. 13 ఏళ్ల పోరాట ఫలితంగా రాష్ట్ర విభజన అనంతరం టీఆర్‌ఎస్ గెలుపొందందని ఇప్పుడు అందుకు  భిన్నమైన తీర్పు వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా పొంగులేటి చెప్పారు.
 
 ఒక కార్యకర్తకు గౌరవమిచ్చారు: నల్లా

 పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తగా తనకు వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమిచ్చి గౌరవించారని, ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన సందర్భంగా సూర్యప్రకాష్ విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికలు ఒక సాధనమన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, దొర పోకడలను ఈ ఎన్నికల ప్రచారంలో ఎత్తిచూపుతామన్నారు.

వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనన్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కండువా కప్పుకుని మిత్రపక్షంగా పోటీ చేశారని... ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా విప్‌ను జారీ చేశారని మండిపడ్డారు. ఉపఎన్నికల్లో తనకు టికెట్ వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement