ఓరుగల్లు బరిలో నేనంటే నేను..! | Warangal Lok Sabha by-elections | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు బరిలో నేనంటే నేను..!

Published Mon, Aug 31 2015 2:55 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

ఓరుగల్లు బరిలో నేనంటే నేను..! - Sakshi

ఓరుగల్లు బరిలో నేనంటే నేను..!

సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య కొత్త పంచాయితీని తెచ్చిపెడుతోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో ఇక్కడ నుంచి పోటీకి అన్ని పార్టీలూ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా వరంగల్ స్థానం నుంచి బీజేపీ పోటీచేసింది. అయితే, ఇక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.

దీంతో ఈసారి తామే బరిలో దిగాలని టీడీపీ భావిస్తోంది. కానీ, బీజేపీ మాత్రం గత ఎన్నికల్లో ఓటమి పాలైన సీటులో తామే తిరిగి పోటీ చేస్తామని పట్టుబడుతోంది. ఇది రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసేలా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కేందమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇక్కడ నుంచి తాము పోటీచేస్తామని, ఇందుకు సహకరించాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును కలసి విజ్ఞప్తి చేశారు. కానీ, ఈ స్థానంలో తమకే అనుకూలత ఉందని, ఈసారి టీడీపీ నుంచే అభ్యర్థి బరిలో ఉంటారని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.  
 
టీడీపీ బహుళ వ్యూహం!
వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి గెలవడం ద్వారా పలు ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జైలుకెళ్లి వచ్చారు. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడూ ఈ వ్యవహారంలో బదనాం అయ్యారు. దీంతో వరంగల్‌లో గెలవడం ద్వారా పోయిన పరువును కొద్దిగానైనా కాపాడుకోవాలని టీడీపీ భావిస్తోంది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని ఉప ఎన్నికల్లో ఉపయోగించుకుని గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అధికారపార్టీలో స్థానికంగా గ్రూపులు ఉండడం కూడా తమకు లాభిస్తుం దని నమ్ముతోంది. అదేవిధంగా తమపార్టీ నుంచి టీఆర్‌ఎస్ ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేసుకోవడంపై గుర్రుగా ఉన్న టీడీపీ ఉప ఎన్నికల్లో విజయం ద్వారా అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని ఆశిస్తోంది.

మిత్రపక్షం బీజేపీని బరిలో నుంచి తప్పించేందుకు కొత్తి ప్రతిపాదననూ తెరపైకి తెస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితి ఎవరికి అనూకూలంగా ఉందో తేల్చుకునేందుకు ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే చేయించాలని టీడీపీ నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు. ప్రత్యేక సమావేశంలో ఇదే అంశంపై టీడీపీ నేతలు చర్చించినట్లు తెలిసింది.
 
సానుభూతిపై కమలం ఆశలు...
మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి చెందిన తమకు ఈసారి సానుభూతి పవనాలు వీస్తాయని బీజేపీ భావిస్తోంది. అంతేకాకుండా ఈసారి కేంద్రంలో అధికారంలో ఉండడం అదనంగా కలిసివచ్చే అంశమని అభిప్రాయపడుతోంది. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఆ పార్టీకి స్థానిక అభ్యర్ధి లేకపోవడం తమకు అనూకూలిస్తుందని అంచనా వేస్తోంది. టీడీపీని ఎలాగైనా ఒప్పించి బరిలో ఉండాల్సిందేనని పార్టీలో నిర్ణయం కూడా జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘ఓరుగల్లు బరిలో నేనంటే నేనంటూ’ ఇరు పార్టీలూ పట్టుబడుతుండడంతో ఉత్కంఠ నెలకొంది.
 
టీడీపీ, బీజేపీ సీనియర్ నేతల భేటీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ, బీజేపీ సీనియర్ నాయకులు ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ శాసనసభాపక్ష నాయకుడుడాక్టర్ లక్ష్మణ్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రెండు పార్టీలూ కలసి పనిచేసి గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెలుచుకోవడంతోపాటు, వరంగల్‌లో విజయం సాధించాలని.. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై అంతర్గత సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య విభేదాలు ఏవైనా ఉంటే  ఎలా సరిదిద్దుకోవాలి అనే దానిపై కూడా చర్చించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement