ఆ ఇద్దరికి అగ్నిపరీక్ష!
* కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు కీలకంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
* మేయర్ పీఠం రాకపోయినా మెరుగైన ఫలితాలు ఆశిస్తున్న కాంగ్రెస్
* వరంగల్ ఓటమి తరువాత ఉత్తమ్‌కు అసలు పరీక్ష
* బీజేపీలోనూ అదే పరిస్థితి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధినేతలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. అలాగని జీహెచ్‌ఎంసీ పీఠం ఎగరేసుకురావాలని ఈ రెండు పార్టీల అధినాయకత్వాలు కోరుకోవడం లేదు.
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక వంటి ఘోర పరాజయం పునరావృతం కాకుండా ఉంటే చాలునని ఈ పార్టీల అధినాయకత్వాలు భావిస్తున్నాయి. వారి అంచనాలకు తగ్గట్టు కాంగ్రెస్, బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాయా... ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ. మరి మెరుగైన ఫలితాల సాధన కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తగిన వ్యూహాలతో ముందుకెళ్లడం లేదని, స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆ పార్టీల సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికే పదవీ కాలం పూర్తి చేసుకున్న కిషన్‌రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఈ ఎన్నికలే కీలకం కానున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు సొంత పార్టీలోనే వ్యతిరేక కూటములు తయారవుతున్నాయి.
ఉత్తమ్ నాయకత్వానికి అసలు పరీక్ష
పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌కు ఈ ఎన్నికలు అసలు సిసలు పరీక్షే. వరంగల్ ఉప ఎన్నిక ఘోర పరాజయానికి అభ్యర్థి ఎంపికలో అధిష్టానం తప్పిదాలు కూడా తోడవడంతో ఉత్తమ్ దాన్నుంచి తేలిగ్గానే బయటపడ్డారు. అయితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యవహారాన్ని అధిష్టానం పూర్తిగా పీసీసీ నాయకత్వానికే వదిలేసింది. అభ్యర్థుల ఎంపికలో ఢిల్లీ జోక్యం ఏ మాత్రం లేదని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.
అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదని నలుగురు మాజీలు నామినేషన్లకు ఆఖరు రోజైన ఆదివారం పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో తాము ఓడిపోవడానికి కారణమైన వారికి టికెట్లు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, శ్రీశైలం గౌడ్, లక్ష్మారెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. పీసీసీ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నామినేషన్ల ఘట్టం కూడా ముగియకముందే కాంగ్రెస్‌లో కొట్లాట మొదలుకావడం గమనార్హం.
‘మా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు గట్టి పోటీ ఇస్తారో మాకే బాగా తెలుసు. కానీ, మా ప్రమేయం లేకుండానే ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇస్తే దానికి బాధ్యులు ఎవరు. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో డివిజన్లు గెలుచుకోకపోతే పార్టీలో ఎవరూ ఉండరు. ఆ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వాపోయారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఉన్నా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చేదాకా పీసీసీ తరఫున ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని పార్టీ రాజ్యసభ సభ్యుడొకరు మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలన్న ఆశ కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. పార్టీలో ఏ ఒక్కరిని కదిలించినా 25 డివిజన్లు వచ్చినా చాలు అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఈ సంఖ్యలో కూడా గెలవకపోతే ఉత్తమ్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిదని సీనియర్ నేత ఒకరు అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి సరైన పోటీ ఇవ్వలేని స్థితికి ఎందుకు దిగజారిందో అధిష్టానం విశ్లేషించుకోవాలని ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
పొత్తులు తేలక కమలం అప్రతిష్టపాలు
బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవడం అటుంచి టీడీపీతో పొత్తునే నామినేషన్ల చివరి రోజుదాకా తేల్చలేకపోయింది. టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయించడంతో ఆశావహులు, వారి వెనుక ఉండి మద్దతు ఇస్తున్న సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారు.
కిషన్‌రెడ్డిని తొలగించాలంటూ ఎన్నికలకు ముందే గ్రేటర్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లకూడదని అనుకోబట్టే తాము మౌనంగా ఉన్నామని లేదంటే కిషన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉండటానికి అనర్హుడని నగరానికి చెందిన పార్టీ ఎమ్మెల్యే ఒకరన్నారు. నామినేషన్ల ఆఖరు రోజు సమయం ముగిసిన తరువాత కూడా బీజేపీ అభ్యర్థుల పేర్లను రహస్యంగా ఉంచడంపై ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.