వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితులకు భూ పంపిణీ పథకం జిల్లాలో అటకెక్కింది. ప్రభుత్వ పెద్దలు, జిల్లా ఉన్నతాధికారులు ఈ పథకం గురించి పట్టించుకోవడంలేదు. జిల్లాలోని భూమి లేని దళిత కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వంద కుటుంబాలకు కూడా భూమి పంపిణీ చేయలేదు. భూ పంపిణీ పథకం ప్రారంభించిన ప్రారంభోత్సవం రోజున హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ పెద్దలు ఈ పథకంపై ఒక్కసారీ సమీక్షించడం లేదు. ఫలితంగా భూ పంపిణీ జిల్లాలో అధ్వానంగా మారింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితలకు భూ పంపిణీ పెద్ద అంశగా మారనుందని అధికార, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో 3 లక్షలకుపైగా దళిత కుటుంబాలు ఉన్నట్లు అంచనా. సామాజిక, ఆర్థిక అంశాలపై ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) విభాగం సర్వేలో జిల్లాలో భూమి లేని దళిత కుటుంబాలు 40 వేలు ఉన్నట్లు తేలింది. అధికారులు మాత్రం ఇంత సంఖ్య ఉండదని చెబుతున్నారు.
ఇదే నిజమైనా జిల్లాలో భూమి లేని దళిత కుటుంబాలు 30 వేలు ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరం ఉన్న దళిత కుటుంబానికి రెండు ఎకరాలు... రెండు ఎకరాలు ఉన్న కుటుంబానికి ఒక ఎకరం చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2014 ఆగస్టు 15న భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది.ఏడాది కావస్తున్నా జిల్లాలో కేవలం 82 కుటుంబాలకు 241 ఎకరాల భూమిని పం పిణీ చేశారు. దళిత కుటుంబాలకు పంపిణీ చేసిన భూమిలో 214 ఎకరాలను ఇతరుల నుంచి కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీకి వినియోగించారు. భూ పంపిణీకి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియే లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు భూమి అందుబాటులో ఉన్న గ్రామాల్లోనే అర్హులను గుర్తిస్తున్నారు. ఇప్పటికి ఏడు నియోజవర్గాల్లోనే భూ పంపిణీ మొదలైంది. జిల్లాలో కేవలం 9 మండలాల్లోనే ప్రారంభించారు. స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, ములుగు నియోజకవర్గాల్లో భూ పంపిణీ మొదలే కాలేదు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నగర ప్రాంత నియోజకవర్గాలు కావడంతో ఈ పథకం అమలు చేయడం సాధ్యంకాదు.
భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కాట్రపల్లిలో 26 కుటుంబాలకు 73.01 ఎకరాలు పంపిణీ చేశారు. డోర్నకల్‌లో నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో 19దళిత కుటుంబాలకు 53.08 ఎకరాలు పంచారు.పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం ఆరు కుటుంబాలకు 17.04 ఎకరాలను పంపిణీ చేశారు. ఇదే నియోజకవర్గం కొడకండ్ల మండలం రంగాపురంలో ఏడు కుటుంబాలకు 18.28 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. నర్సంపేట మండలం బానోజీపేటలో ఏడు కుటుంబాలకు 27 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.
మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలం బొడ్లాడలో ఏడు కుటుంబాలకు 21 ఎకరాలు పంచారు. వర్ధన్నపేటలోని పర్వతగిరి మండలం వడ్లకొండలో ఆరు దళిత కుటుంబాలకు 17 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గం నర్మెట మండలం అమ్మపూర్‌లో నాలుగు కుటుంబాలకు 10.07 ఎకరాల భూమిని పంచారు. 3 కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున, ఒక కుటుంబానికి 1.07 ఎకరా పంపిణీ చేశారు.
భూమి ఇయ్యలే !
Published Thu, Jul 23 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement