
భువనగిరి : గంజ్‌మార్కెట్‌యార్డ్‌కు వచ్చిన వేపకాయలు
జూన్ మొదటి వారంలో ఓ మాదిరి వర్షాలు పడటంతో చాలా గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో గ్రామాల్లో కూలీ పనులు దొరకక నిరుపేద కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు గ్రామాల్లోని మహిళలు వేపకాయల సేకరణ చక్కటి ఉపాధిగా ఎంచుకున్నారు. మహిళలు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల వెంట ఉన్న వేపచెట్లు, వ్యవసాయ భూములు, అడవుల్లో ఉన్న వేప చెట్ల వద్దకు వెళ్లి వేపకాయలు ఏరుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
భువనగిరి/పెద్దవూర : భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూరు(ఎం), బీబీనగర్, పోచంపల్లి మండలాలతోపాటు భువనగిరి మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు వేపగింజలను విక్రయించేందుకు భువనగిరి మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన వేపగింజలను విజయవాడ, ముంబాయి, బెంగళూరు, పుణె, మద్రాస్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలంలోని నాయినివానికుంట గ్రామానికి చెందిన మహిళలు ఆటో కిరాయికి తీసుకుని వేకువజామునే ఆంధ్రా ప్రాంతాలైన మాచర్ల, గురజాల, దుర్గి, రెంటచింతల పరిసర ప్రాంతాలకు వెళ్లి పొద్దంతా వేపకాయలు ఏరుకుని ఉపాధి పొందుతున్నారు.
భువనగిరి మార్కెట్ భారీగా వేపకాయల రాక
భువనగిరి గంజ్ మార్కెట్‌యార్డ్‌లో వేపగింజల కొనుగోళ్ల సందడి మొదలైంది. గత వారం రోజుల నుంచి కొనుగోళ్లు జరుగుతుండటంతో మార్కెట్‌కు భారీగా వేపగింజలను తీసుకువస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్ల అనంతరం తిరిగి మార్కెట్‌లో వేపగింజల కొనుగోళ్లతో రద్దీ కనిపిస్తోంది. సుమారు 20 రోజుల పాటు కొనసాగే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం క్వింటాళ్‌కు రూ.600ను చెల్లిస్తున్నారు.
దిగుబడి ఎక్కువ ధర తక్కువ..
గత సంవత్సరంలో వర్షాభావం వల్ల వేపగింజల దిగుబడి తక్కువగా ఉండటంతో క్వింటాళ్‌కు రూ.750 నుంచి రూ.850వరకు చెల్లించారు. ఈ సీజన్‌కుగాను వేపగింజల దిగుబడి ఎక్కువగా ఉండటంతో క్వింటాళ్‌కు రూ.600 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి క్వింటాళ్‌కు రెండు కిలోల చొప్పున తరుగుదల కింద తీసుకుంటుండగా వాహనాల కిరాయి పోను వేపగింజలను వేరే వారికి రోజుకూ కూలీ రేటు కూడా పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేపకాయలతో ఉపయోగాలు
వేప గింజల నుంచి యంత్రాల సహయంతో నూ నెను తీస్తే నూనెతో పాటు వేప పిండి వస్తుంది. ఈ వేపనూనె, పిండి పంట తెగుళ్లకు, వ్యాధి నిరోధకంగా, క్రిమిసంహారక మందులలో వాడుతున్నారు. వేప పిండిలో నత్రజని, భాస్వరం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషక పదార్థాలే కాకుండా గంధకం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఉంటాయి. వేపపిండిని వాడటం ద్వారా పంట ఏపుగా పెరగటంతో పాటు వేర్లను ఆశించే పురుగులు, నులి పురుగులు, చీడపీడల సమస్య తగ్గుతుంది. దీంతో బత్తాయి తోటల రైతులు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ఎరువులుగా వాడుతున్నారు. దీంతో వేపకాయలకు ఏడాదికేడాది డిమాండ్ పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment