Neem seed oil
-
వేపకాయలతో ఉపాధి
జూన్ మొదటి వారంలో ఓ మాదిరి వర్షాలు పడటంతో చాలా గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో గ్రామాల్లో కూలీ పనులు దొరకక నిరుపేద కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు గ్రామాల్లోని మహిళలు వేపకాయల సేకరణ చక్కటి ఉపాధిగా ఎంచుకున్నారు. మహిళలు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల వెంట ఉన్న వేపచెట్లు, వ్యవసాయ భూములు, అడవుల్లో ఉన్న వేప చెట్ల వద్దకు వెళ్లి వేపకాయలు ఏరుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భువనగిరి/పెద్దవూర : భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూరు(ఎం), బీబీనగర్, పోచంపల్లి మండలాలతోపాటు భువనగిరి మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు వేపగింజలను విక్రయించేందుకు భువనగిరి మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన వేపగింజలను విజయవాడ, ముంబాయి, బెంగళూరు, పుణె, మద్రాస్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలంలోని నాయినివానికుంట గ్రామానికి చెందిన మహిళలు ఆటో కిరాయికి తీసుకుని వేకువజామునే ఆంధ్రా ప్రాంతాలైన మాచర్ల, గురజాల, దుర్గి, రెంటచింతల పరిసర ప్రాంతాలకు వెళ్లి పొద్దంతా వేపకాయలు ఏరుకుని ఉపాధి పొందుతున్నారు. భువనగిరి మార్కెట్ భారీగా వేపకాయల రాక భువనగిరి గంజ్ మార్కెట్‌యార్డ్‌లో వేపగింజల కొనుగోళ్ల సందడి మొదలైంది. గత వారం రోజుల నుంచి కొనుగోళ్లు జరుగుతుండటంతో మార్కెట్‌కు భారీగా వేపగింజలను తీసుకువస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్ల అనంతరం తిరిగి మార్కెట్లో వేపగింజల కొనుగోళ్లతో రద్దీ కనిపిస్తోంది. సుమారు 20 రోజుల పాటు కొనసాగే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం క్వింటాళ్‌కు రూ.600ను చెల్లిస్తున్నారు. దిగుబడి ఎక్కువ ధర తక్కువ.. గత సంవత్సరంలో వర్షాభావం వల్ల వేపగింజల దిగుబడి తక్కువగా ఉండటంతో క్వింటాళ్‌కు రూ.750 నుంచి రూ.850వరకు చెల్లించారు. ఈ సీజన్‌కుగాను వేపగింజల దిగుబడి ఎక్కువగా ఉండటంతో క్వింటాళ్‌కు రూ.600 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి క్వింటాళ్‌కు రెండు కిలోల చొప్పున తరుగుదల కింద తీసుకుంటుండగా వాహనాల కిరాయి పోను వేపగింజలను వేరే వారికి రోజుకూ కూలీ రేటు కూడా పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేపకాయలతో ఉపయోగాలు వేప గింజల నుంచి యంత్రాల సహయంతో నూ నెను తీస్తే నూనెతో పాటు వేప పిండి వస్తుంది. ఈ వేపనూనె, పిండి పంట తెగుళ్లకు, వ్యాధి నిరోధకంగా, క్రిమిసంహారక మందులలో వాడుతున్నారు. వేప పిండిలో నత్రజని, భాస్వరం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషక పదార్థాలే కాకుండా గంధకం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఉంటాయి. వేపపిండిని వాడటం ద్వారా పంట ఏపుగా పెరగటంతో పాటు వేర్లను ఆశించే పురుగులు, నులి పురుగులు, చీడపీడల సమస్య తగ్గుతుంది. దీంతో బత్తాయి తోటల రైతులు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ఎరువులుగా వాడుతున్నారు. దీంతో వేపకాయలకు ఏడాదికేడాది డిమాండ్ పెరుగుతుంది. -
వేపకూ తప్పని చీడపీడలు!
పంటలపై చీడపీడల నివారణకు వేప గింజల నూనె, వేపాకుల రసం వాడటం పరిపాటి. భూసారం పెంపుదలకు, మట్టి ద్వారా పంటలకు తెగుళ్లు సోకకుండా వేప పిండి ఉపకరిస్తుంది. అటువంటి జగత్ప్రసిద్ధి గాంచిన వేప చెట్టుకూ పురుగుల బెడద తప్పటం లేదు. నల్లగొండ జిల్లాలో ఇటీవల రెండు రకాల పురుగులు వేప చెట్లకు ఆకు లేకుండా తినేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇటువంటి సందర్భాలున్నాయని సమాచారం. పురుగులకు సింహస్వప్నం లాంటి వేపకు ఈ పరిస్థితి రావడం చిత్రంగా అనిపించినా.. ఇది నిజం. నల్లగొండ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఇటీవల వేప చెట్లకు ఆకుపచ్చని పురుగు(సెమీలూపర్), గొంగళి పురుగులు వందల సంఖ్యలో ఆశించి ఆకులన్నీ తినేశాయి. ఈ పురుగులు శరీరంపై పాకితే దురదతో పాటు దద్దుర్లు వస్తుండడంతో జనం బెంబేలెత్తారు. మర్రిగూడ మండలంలోనూ కొన్ని వేప చెట్లను ఈ పురుగులు మోళ్లుగా మార్చేశాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్కడక్కడ వేప చెట్ల ఆకులను పురుగులు తినేస్తున్నట్లు చెబుతున్నారు. బీటీ పత్తి సాగుతో సంబంధం ఉందా? ఈ రెండు జిల్లాల్లోనూ బీటీ పత్తి సాగు చాలా విస్తారంగా సాగవుతోంది. నిలువెల్లా విషపూరితంగా ఉండే బీటీ పత్తిని విస్తారంగా సాగు చేయడానికి, వేపపై పురుగుల దాడికి ఏమైనా సంబంధం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘బీటీ పత్తి పొలాల చుట్టూతా కొన్ని చాళ్లలో నాన్‌బీటీ పత్తిని ఎర పంటగా సాగు చేయాల్సి ఉంటుంది. అయితే అలా జరగడం లేదు. పత్తిని ఆశించే పురుగే ఇప్పుడు వేప చెట్లను ఆశించడం ప్రారంభించినట్లుంద’ని నారాయణపూర్ వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు పి. నాగమణి ‘సాక్షి’తో చెప్పారు. తదనంతరం ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటకశాస్త్ర విభాగాధిపతి డా. వి. శశిభూషణ్, డా. జి. అనిత, డా. ఎం. శంకర్‌లతో కూడిన బృందం నారాయణ పూర్ గ్రామాన్ని సందర్శించి నమూనాలను సేకరించి, అధ్యయనం చేసింది. పత్తిని ఆశించే పురుగు కాదు : డా. రాజిరెడ్డి ఈ నేపథ్యంలో.. వేప చెట్లను ఆశించిన పురుగు పత్తిని ఆశించే శనగపచ్చ పురుగు కాదని తమ పరిశీలనలో తేలిందని వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. రాజిరెడ్డి చెబుతున్నారు. ఇది వేప చెట్టును ఆశించే పురుగేనని, అయితే ఇటీవల దీని తీవ్రత బాగా ఎక్కువగా కనిపించడంతో వెలుగులోకి వచ్చిందన్నారు. 2009లో లక్నోలోని భావులా గ్రామంలోనూ, 2010లో ఉత్తర ప్రదేశ్‌లోనూ ఆకుపచ్చ పురుగులు వేప చెట్లను ఆశించిన దాఖలాలున్నాయని ఆయన అన్నారు. సెమీలూపర్తోపాటు, లద్దెపురుగు, పొలుసు పురుగు, శనగపచ్చ పురుగు, తేయాకు దోమ, రెక్కల పురుగు, పిండి పురుగు, ఆకుతేలు, పెంకు వంటివి కూడా వేప చెట్లను ఆశిస్తూ ఉంటాయని డా. రాజిరెడ్డి వివరించారు. అయితే, వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపాంతరం చెందిన పురుగులేవో వేప చెట్లను నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆశిస్తున్నాయని పత్తి సలహా సంఘం సభ్యుడు డా. డి. నర్సింహారెడ్డి సందేహం వెలిబుచ్చారు. శాస్త్రవేత్తలు ఉదాసీనత వదిలి దీనిపై మరింత లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. - అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: విజయ్ పొలగోని; మునుగోడు, శ్రీధర్, నారాయణపూర్