
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. ఫలితాలు https://ntaneet.nic.in/,https://www.mcc.nic.in/లో పొందవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2019–20 విద్య సంవత్సరంలో ప్రవేశాలకు మే 5న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనరల్ కేటగిరీకి 50%, ఎస్సీ, ఎస్టీ 40% పర్సంటైల్, దివ్యాంగులకు 45% పర్సంటైల్‌ను అర్హత మార్కులుగా నిర్ణయించామని తెలిపింది. నీట్ అర్హత అనంతరం కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు. నీట్‌లో అర్హత సాధించిన వారి లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించారు.
రాష్ట్రంలో 1,550 ఎంబీబీఎస్ సీట్లు..
అఖిల భారత స్థాయిలో ఫలితాల వెల్లడి అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రాలకు పంపిస్తారు. జాతీయ ర్యాంకుల ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థులకు అఖిల భారత ఉమ్మడి కోటాలో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో సీట్ల భర్తీ జరుగుతుంది. విద్యార్థులు అఖిల భారత ఉమ్మడి కోటాకు, రాష్ట్ర స్థాయి ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లకూ నీట్ ర్యాంకులే ఆధారం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లుండగా.. వీటిల్లో 15 శాతం సీట్లను ఉమ్మడి కోటాకు కేటాయించాలి.
అఖిల భారత ఉమ్మడి కోటా ప్రవేశాల ప్రక్రియ ఈ నెల రెండో వారం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ప్రవేశాలను నిర్వహిస్తారు. ఈసారి నీట్ ప్రవేశ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు. గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్ మార్కులకు గాను, గతేడాది జనరల్ కేటగిరీలో అర్హత మార్కు 105గా ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అదీ ఈసారి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment