నిప్పు వెనక నిర్లక్ష్యం | Negligence behind fire | Sakshi
Sakshi News home page

నిప్పు వెనక నిర్లక్ష్యం

Published Mon, Dec 28 2015 4:10 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

నిప్పు వెనక నిర్లక్ష్యం - Sakshi

నిప్పు వెనక నిర్లక్ష్యం

హోమగుండంలో ఒక్కసారిగా నెయ్యి కుమ్మరించడంతో చెలరేగిన మంటలు
 
 సాక్షి, హైదరాబాద్: ఓ చిన్న నిర్లక్ష్యం యాగశాలలో మంటలకు కారణమైంది. ఫలితంగా 15 నిమిషాల్లో వంద యజ్ఞ గుండాలతో కూడుకున్న యాగశాల దగ్ధమైంది. అసలేం జరిగిందంటే... యాగానికి కాసేపు విరామం ప్రకటించడంతో రుత్విక్కులు వారి బ్యాగులు సర్దుకొని బయటకు పయనమవుతున్నారు. ఇదే సమయంలో హోమగుండాల వద్ద మిగిలిన ఆవు నెయ్యిని కొందరు రుత్విక్కులు ఓ బకెట్‌లో పోసి పక్కనపెట్టారు. ఆగ్నేయం దిక్కున మొదటి హోమగుండం పక్కన ఉన్న బకెట్‌లోని నెయ్యిని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా యజ్ఞగుండంలో కుమ్మరిం చేశాడు. దీంతో హోమగుండం నుంచి రెండు మీటర్ల ఎత్తుతో ఒక్కసారిగా మంటలు ఎగిసి రెల్లు గడ్డితో వేసిన పైకప్పుకు అంటుకున్నాయి.

వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలనార్పే ప్రయత్నం చేసినా.. పైకప్పు ఎత్తుగా ఉండటంతో నిప్పు ఆరలేదు. చూస్తుండగానే మంటలు యాగశాలలోని మిగతా వైపు వ్యాపించాయి. యజుర్వేద యాగశాలలో వేసి వందల సంఖ్యలో కుర్చీలు కూడా కాలిపోయాయి. అయితే దానికి అనుకునే ఉన్న ప్రధాన యాగశాల వైపు మంటలు రాలేదు.

 ఫైరింజన్ రావటంలో ఆలస్యం..
 యాగశాల చుట్టూ మూడు ఫైరింజిన్‌లను సిద్ధంగా ఉంచారు. కానీ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు అవి లోనికి రావటానికి వీలుపడలేదు. ఒక ఫైరింజన్ అయినా లోపలి వైపు ఉండి ఉంటే యాగశాలకు అంటుకున్న మంటలను వెంటనే అదుపుచేసే అవకాశం ఉండేది. చివరికి హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, సనత్‌నగర్, సికింద్రాబాద్‌ల నుంచి మూడు ఫైరింజిన్లు, మూడు ఫోమ్ బుల్లిట్ ద్విచక్రవాహనాలను హుటాహుటిన యాగశాల వద్దకు రప్పించారు.

 ధైర్యం చెప్పిన గవర్నర్
 ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రపతితోపాటు హెలికాప్టర్‌లో ఉన్న గవర్నర్ నరసింహన్ కూడా వెనుదిరిగారు. అగ్ని ప్రమాదం విషయం సీఎం గవర్నర్‌కు ఫోన్‌లో తెలిపారు. దీంతో తాను వస్తానని, యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ధైర్యం చెప్పారు. అంతకుముందు గవర్నర్ సతీమణి విడిగా ఉదయమే యాగశాలకు వచ్చి ప్రమాదం జరిగిన తర్వాత హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ దంపతులిద్దరూ ప్రత్యేక హెలికాప్టర్‌లో యాగశాలకు వచ్చి కేసీఆర్‌తో కలిసి మహాపూర్ణాహుతిని పూర్తి చేశారు. అనుకోని ప్రమాదంతో భక్తులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతికి గురి అయినా సీఎం మాత్రం స్థైర్యం కోల్పోలేదు. ‘ఏం ఫర్వాలేదు.. యాగం మొత్తం దిగ్విజయంగా ముగిసింది’ అంటూ భక్తులకు చిరునవ్వుతో చె ప్పారు.
 
 అందరికీ కృతజ్ఞతలు: హరీశ్‌రావు
 అయుత చండీయాగానికి వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు విశేష సేవలు అందించారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. యాగంలో పాల్గొన్న లక్షలాది మందికి ఇబ్బందులు రాకుండా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర అధికారులు, ఉద్యోగులు, రుత్విక్కులు, పండితులు, పారాయణకర్తలు సహా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం యాగం ముగిశాక ఆయన మాట్లాడారు. యాగ స్థలంలో చెలరేగిన మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు యాగ స్థలిలో రేయింబవళ్లు కష్టపడ్డారని చెప్పారు. ముందెన్నడూ లేని విధంగా యాగంలో రాష్ట్రపతి, మూడు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తి, న్యాయమూర్తులు, పీఠాధిపతులు పాల్గొనడం విశేషమని చెప్పారు.
 
 అరిష్టం కాదు.. శుభసూచకమే!
 మంటలు రేగడంపై విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి
 కొండపాక: లోక కల్యాణం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగశాలలో మంటలు చెలరేగడం అరిష్టం కాదని.. అది శుభసూచకమేనని విశాఖ పీఠాధిపతి స్వరూపానందస్వామి పేర్కొన్నారు. ఆదివారం యాగం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అందరి సంక్షేమం, పాడి పంటల సమృద్ధి కోసం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ఈ యాగాన్ని చేపట్టారని, ఎంతో గొప్ప ధైర్యసాహసాలు ఉంటేగాని ఇలాంటి మహిమాన్వితమైన యగం చేపట్టలేరని చెప్పారు.

ఐదు రోజుల పాటు సుభిక్షంగా సాగిన యజ్ఞంలో చివరిరోజు మహాపూర్ణాహుతికి ముందు మంటలు చెలరేగినంత మాత్రాన ఎవరూ అశాంతిగా మాట్లాడుకోకూడదన్నారు. అసలు దైవ అనుగ్రహంతోనే మంటలు చెలరేగాయని.. చండీమాత అనుగ్రహం యాగ ప్రాంగణంలో ఉండడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని స్వామి చెప్పారు. యాగశాలలో ఏర్పాటు చేసిన వంద హోమ గుండాల చుట్టూ ప్రదక్షణలు చేయడం వల్ల పాపవిముక్తులు అవుతారన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో చండీ మహాయగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారని పేర్కొన్నారు.
 
 తప్పిన ముప్పు
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కలెక్టర్ సాహసం.. డీఎస్పీ మెరుపు నిర్ణయం వేల మంది భక్తులను యాగశాల అగ్ని ప్రమాదం నుంచి కాపాడాయి. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మంటలంటుకున్న యాగశాలలోకి వెళ్లి భక్తులను, పోలీసులను అప్రమత్తం చే యగా.. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతి, మరో డీఎస్పీ సురేందర్‌రెడ్డి భక్తులు యాగశాలోకి వెళ్లకుండా కట్టడి చేశారు. నవార్ణ జపాల మంత్ర పఠనం పూర్తి కావటంతో రుత్వికులు సేద తీరేందుకు విడిది గృహం వైపు వెళ్లారు. కేవలం ముఖ్యమైన రుత్వికులు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో సామవేద మండ ప సమీపంలో ఆగ్నేయం వైపున  పైకప్పునకు మంటలంటుకున్నాయి.

ఈ వార్త దావానంలా బయటికొచ్చింది. సాధారణ భక్తుల వద్ద క్యూలైన్ బాధ్యుడిగా ఉన్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతి అప్రమత్తమయ్యారు. క్యూలై న్ కొంతభాగం మూసి వేయించారు. అదే సమయంలో అగ్నికీలలు ఎగిసి పడుతుండటంతో అక్కడే ఉన్న కలెక్టర్ కాలుతున్న యాగశాలలోకి వెళ్లి అక్కడున్న భక్తులను అప్రమత్తం చేశారు. ఫైర్ ఇంజిన్ పైపును స్వయంగా లాగి సిబ్బందికి అందజేశారని అక్కడున్న భక్తులు తెలిపారు. అనంతరం క్యూలైన్లో ఉన్న భక్తులు సులభంగా వెనుదిరిగేందుకు వీలుగా పోలీసులు మీడియా పాయింట్ వద్ద ఉన్న బారికేడ్లను తొలగించారు.

 దగ్గరుండి వైద్యం చేయించిన పోచారం
 ఆదివారం యాగశాలలో జరిగిన ప్రమాదంలో ఓ రుత్విజునికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో యాగశాల ప్రాంగణంలోని యశోద హాస్పటల్ ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య శిబిరానికి తరలించారు. మంత్రి దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగనే ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement