ట్రాన్స్‘ఫార్మర్’ ఇబ్బందులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. వర్ధన్నపేటలోని 133/11 కేవీ సబ్‌స్టేషన్‌లోని 50 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ మూడు వారాల కిత్రం కాలిపోరుుంది. ఫలితంగా ఆయూగ్రామాలకు కరెంట్ కోతలు తప్పడంలేదు. ఓ వైపు వర్షాభావం.. మరోవైపు విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
- కాలిపోయిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్
- ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం
- 100కుపైగా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం
- కాలుతున్న మోటార్లు
వర్ధన్నపేట 133/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి మైలారం, నందనం, కొండూరు, కూనూరు ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. మైలారం ఫీడర్‌లో మైలారం, ల్యాబర్తి, అన్నారం, నందనం ఫీడర్‌లో నందనం, పంథిని ఐనవోలు, ఇల్లంద, వడ్లకొండ.. కొండూరు ఫీడర్‌లో కొండూరు, రాయపర్తి, కాట్రపల్లి.. కూనూర్ ఫీడర్‌లో కూనూర్, దమ్మన్నపేట, జఫర్‌గడ్, వెంకటాపూర్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 100పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా కానుంది.
ఓవర్‌లోడ్‌తో ఇబ్బంది..
వర్ధన్నపేట సబ్‌స్టేషన్‌లో 2001లో 50 ఎంవీఏ, 31.5 ఎంవీఏ సామర్థ్యంతో రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్) ఏర్పాటు చేశారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్‌ను కంట్రోల్ చేస్తూ గ్రామాల్లోని సబ్‌స్టేషన్లకు సరఫరా చేసేవారు. సాంకేతిక కారణాలతో గత నెల 21న అర్ధరాత్రి రూ. కోటి విలువైన 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. అప్పటి నుంచి అధికారులు మరమ్మతుకు చర్యలు తీసుకోలేదు. అందుబాటులో ఉన్న పీటీఆర్ 31.5 ఎంవీఏ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పవర్‌డ్రాప్ (అంతరాయం) అవుతున్నా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు.
వ్యవసాయానికి అంతంత మాత్రమే..
కొన్ని మండలాల్లో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నా.. వర్ధన్నపేట పరిధిలో కనీసం 5-6 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఓవర్‌లోడ్‌తో సబ్‌స్టేషన్లలోని ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కి విద్యుత్ నిలిచిపోతుంది. గ్రామాల్లో 12 గంటల పాటు ఎల్‌ఆర్ పేరుతో విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను రైతులు నష్టపోతున్నారు. కొన్ని గ్రామాల్లో తరచూ విద్యుత్ మోటార్లు కాలిపోతున్నారుు.
నివేదిక పంపించాం..: సత్యనారాయణ, ట్రాన్‌సకో ఏఈ
సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి 50 ఎంవీఏ పీటీఆర్‌ను తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. రైతులు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం.