కాళేశ్వరం(మంథని): రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన ఐదేళ్ల నేహాల్ శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. తల్లిదండ్రులు రజని–హనుమంతరావుతో కలసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను తిలకించారు.
కన్నెపల్లి క్యాంపు కార్యాలయంలో ఇంజనీర్లు మ్యాప్‌ల ద్వారా ప్రాజెక్టులను చూపిస్తుండగా, నేహాల్ చకచకా సమాధానం చెబుతూ ఇంజనీర్లతోపాటు ఏజెన్సీ సంస్థల ప్రతినిధులను ఆకట్టుకున్నాడు. టీఎంసీలు, ఆనకట్టల పొడవు, బ్యారేజీల మధ్య దూరం, నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడానికిగల కారణాలు, తమ్మడిహెట్టి వద్ద నిర్మాణం చేయకపోవడానికిగల కారణాలను నేహాల్ అనర్గళంగా వివరించాడు.
అనంతరం మేడిగడ్డ పంప్‌హౌస్, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా నేహాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు 100 శాతం వేగంగా నడుస్తున్నాయన్నాడు. ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని చూసిన ప్రాజెక్టుల కన్నా ప్రస్తుతం నేరుగా చూడటం ఎంతో బాగుందన్నాడు. మళ్లీ కేసీఆర్ తాతతో కలసి వస్తానని చెప్పాడు. వారి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు డీఈఈ ప్రకాశ్, ఇరిగేషన్ లైసన్ అధికారి టీవీ ప్రసాద్, జేఈఈ వెంకటరమణ, ఏజెన్సీల ప్రతినిధులు మెగా సీజీఎం వేణు, పీఎం వినోద్, అఫ్‌కాన్ పీఎం శేఖర్‌దాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment