Nehal
-
పంప్‌హౌస్‌లను పరిశీలించిన ‘నేహాల్’
మంథని/రామగుండం: నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్ చిన్నారి నేహాల్ శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి, కాళే శ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని డివిజన్లో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్‌లను సందర్శించారు. తన తల్లిదండ్రులు రజని–హనుమంతరావు, ఇంజనీరింగ్ అధికారులకు కలసి వచ్చిన నేహాల్ తొలుత గోలివాడలో పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ‘‘ఎల్లం ప్రాజెక్టు ఇదే నా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించారు కదా.? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయికి ఆధారం. దీని కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది కదా’అంటూ టక..టక వివరాలు చెప్పారు. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్ చూశాడు. మధ్యమానేరు నీటినిల్వ సామర్థ్యం ఎంతా? అని అని తల్లి రజని ప్రశ్నించగా 32 టీఎంసీలు అని వివరించాడు. సుందిళ్ల బ్యారేజీ కాంట్రాక్ట్ పనులు ఎవరు దక్కించుకున్నారని అడగ్గా నవయుగ కంపెనీ అని చెప్పాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విన్నదానికంటే ఇక్కడి వచ్చిచూస్తే షాక్ గురయ్యానని.. తాతయ్య కేసీఆర్ డిజైన్ చేసినట్లు కోటి ఎకరాల కు సాగునీరు అందడం ఖాయమన్నారు. చిన్నారి వెంట లైజనింగ్ ఆఫీసర్ ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు బండ విష్ణుప్రసాద్, నరేశ్ తదితరులున్నారు. -
‘కాళేశ్వరం’ను సందర్శించిన నేహాల్
కాళేశ్వరం(మంథని): రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన ఐదేళ్ల నేహాల్ శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. తల్లిదండ్రులు రజని–హనుమంతరావుతో కలసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను తిలకించారు. కన్నెపల్లి క్యాంపు కార్యాలయంలో ఇంజనీర్లు మ్యాప్‌ల ద్వారా ప్రాజెక్టులను చూపిస్తుండగా, నేహాల్ చకచకా సమాధానం చెబుతూ ఇంజనీర్లతోపాటు ఏజెన్సీ సంస్థల ప్రతినిధులను ఆకట్టుకున్నాడు. టీఎంసీలు, ఆనకట్టల పొడవు, బ్యారేజీల మధ్య దూరం, నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడానికిగల కారణాలు, తమ్మడిహెట్టి వద్ద నిర్మాణం చేయకపోవడానికిగల కారణాలను నేహాల్ అనర్గళంగా వివరించాడు. అనంతరం మేడిగడ్డ పంప్‌హౌస్, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా నేహాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు 100 శాతం వేగంగా నడుస్తున్నాయన్నాడు. ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని చూసిన ప్రాజెక్టుల కన్నా ప్రస్తుతం నేరుగా చూడటం ఎంతో బాగుందన్నాడు. మళ్లీ కేసీఆర్ తాతతో కలసి వస్తానని చెప్పాడు. వారి వెంట కాళేశ్వరం ప్రాజెక్టు డీఈఈ ప్రకాశ్, ఇరిగేషన్ లైసన్ అధికారి టీవీ ప్రసాద్, జేఈఈ వెంకటరమణ, ఏజెన్సీల ప్రతినిధులు మెగా సీజీఎం వేణు, పీఎం వినోద్, అఫ్కాన్ పీఎం శేఖర్‌దాస్ ఉన్నారు. -
ఐదేళ్ల పిల్లాడు.. మంత్రిని మురిపించిండు!
సాక్షి, హైదరాబాద్: పిల్లాడికి పట్టుమని ఐదేళ్లు లేవు. కంఠస్తం చేసి చెబుతున్నవి పద్యాలు కావు. నిష్ణాతులకే అర్థం కాని ఇంజనీరింగ్ అంశాలు.. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రీ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచే గోదావరిని నీటిని ఎందుకు ఎత్తిపోస్తున్నారు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్ని టీఎంసీలతో నిర్మిస్తున్నారు. ఇలా అన్నీ ఫటాఫట్ చెప్పేస్తున్నాడు. బుడ్డోడి బుర్రకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సహా ఇంజనీర్లంతా నివ్వెరపోయారు.. అబ్బురపడ్డారు.. పిల్లోడిని తెలంగాణ ఇరిగేషన్ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు హరీశ్ ప్రకటించారు. యూకేజీ బుడ్డోడు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన హనుమంతరావు హైదరాబాద్ షాపూర్ నగర్లో ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి. కొడుకు ఐదేళ్ల నేహాల్ యూకేజీ చదవుతున్నాడు. ప్రాజెక్టుల గురించి ఇంట్లో నేహాల్ అనర్గళంగా మాట్లాడుతుండగా చూసిన స్థానిక టీఆర్ఎస్ నాయకుడొకరు ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి చేరవేశారు. దీంతో అబ్బురపడ్డ మంత్రి ఆదివారం జలసౌధలో ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన మేధోమధన సదస్సుకు నేహాల్‌ను పిలిపించారు. హరీశ్‌రావు, ఇంజనీర్ల సమక్షంలో నేహాల్ తన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు. నిపుణులైన ఇంజనీర్లు కూడా గుర్తు పెట్టుకోని సమాచారాన్ని ఆశువుగా చెబుతుంటే హరీశ్ రావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, దేవీప్రసాద్, పలువురు చీఫ్ ఇంజనీర్లు, నీటిపారుదల రంగ నిపుణులు నివ్వెరపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డ పాయింట్‌కు ఎందుకు మార్చారో, మహారాష్ట్ర అభ్యంతరాలు ఏమిటో, కేసీఆర్ దూరదృష్టి ఎలాంటిదో గణాంకాలతో సహా అలవోకగా వివరించాడు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల గురించి కూడా చెప్పాడు. యూకేజీ చదువుతున్న నేహాల్ రాష్ట్ర ప్రాజెక్టులు, ఆయకట్టు, ఇతర ప్రయోజనాలపై 20 నిమిషాలపాటు ప్రసంగించిన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండేళ్ల వయసు నుంచే రికార్డులు సీఎం కేసీఆర్‌ను కలిస్తే ఏం మాట్లాడతావని నేహాల్‌ను హరీశ్ రావు అడగ్గా.. ‘శీలం సిద్దారెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండగా మా గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని చెప్పి నేటి వరకు కట్టించలేదు. గ్రామ రైతుల కోసం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించమని కోరతా’అని తెలిపాడు. నేహాల్ రెండేళ్ల వయసు నుంచే తన ప్రతిభతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్–2, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్–1, బొంబాయి సూపర్ కిడ్–2, భారత్ వరల్డ్ రికార్డ్–1, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్–1 అవార్డులను సాధించాడు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు అందుకున్నాడు. నేహాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో యూకేజీ చదువుతున్నాడు. త్వరలోనే సీఎం వద్దకు.. నేహాల్ తెలివికి సంబురపడ్డ మంత్రి హరీశ్‌రావు.. పిల్లోడిని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. నేహాల్ చదువుకయ్యే ఖర్చు మొత్తం ఇరిగేషన్ శాఖ భరిస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలవాలని నేహాల్ కోరగా, త్వరలోనే ఆ కోరిక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే నేహాల్‌తోపాటు ఆతని కుటుంబ సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకువెళ్లి చూపాలని సీఈ హరిరామ్‌ను ఆదేశించారు. నేహాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని హరీశ్ పేర్కొన్నారు. -
అరుదైన వ్యాధితో బాలుడి మృతి
సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన బీట్ల నేహాల్(15) ప్రొజేరియా వ్యాధితో బాధపడుతూ మంగళవారం వేకువజామున మరణించాడు. బీట్ల శ్రీనివాస్-శ్రీదేవి దంపతుల కుమారుడైన నేహాల్ పుట్టిన మూడేళ్ల వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని భీవండికి వలస వెళ్లారు. శ్రీనివాస్ మొబైల్ రిపేర్స్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. 2014లో ముంబైలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వైద్యులు నేహాల్కు ప్రొజేరియా సోకిందని నిర్ధారించారు. జన్యు సంబంధ సమస్యతో వచ్చే ఈ వ్యాధి సోకిన వారు ఎండలో తిరగకూడదు. ఎప్పుడూ ఏసీలోనే ఉండాలి. ఎముకలు పెలుసుగా తయారయి, చిన్నవయసులోనే ముసలితనం వచ్చినట్లుగా మారడం ఈ వ్యాధి లక్షణం. ప్రపంచం మొత్తం మీద ఈ వ్యాధిసోకిన వాళ్లు 134 మంది ఉండగా ఇండియాలో గుర్తించిన నలుగురిలో మొదటివాడు నేహాలే. అమెరికాలోని ప్రొజేరియా రీసెర్చ్ ఫౌండేషన్ ఈ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సేవ చేయడమే కాకుండా వ్యాధి నయం చేసేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. నేహాల్‌ను ప్రొజేరియాకు ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.15 ఏళ్ల వయసులోనూ నేహాల్ బరువు 13 కిలోలకు మించలేదు. ఇటీవల తన బాబాయి కూతురు పెళ్లి ఉండడంతో స్వగ్రామం పూసాలకు నేహాల్ కుటుంబం వచ్చింది. సోమవారం ఎండతీవ్రత అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకోగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల సూచనమేరకు కరీంనగర్ వైద్యులు ముంబైలో నేహాల్కు చికిత్స అందించే వైద్యులను ఫోన్లో సంప్రదించారు. ఎండలో తిరగడం వల్లే సమస్యకు కారణమని, అతడు ఎప్పుడూ చల్లటి వాతావరణంలో ఏసీలోనే ఉండాలని వారు చెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున నేహాల్ మృతి చెందాడు.