బాలుడు నేహాల్‌తో మంత్రి హరీశ్‌రావు, ఘంటా చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: పిల్లాడికి పట్టుమని ఐదేళ్లు లేవు. కంఠస్తం చేసి చెబుతున్నవి పద్యాలు కావు. నిష్ణాతులకే అర్థం కాని ఇంజనీరింగ్ అంశాలు.. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రీ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచే గోదావరిని నీటిని ఎందుకు ఎత్తిపోస్తున్నారు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్ని టీఎంసీలతో నిర్మిస్తున్నారు. ఇలా అన్నీ ఫటాఫట్ చెప్పేస్తున్నాడు. బుడ్డోడి బుర్రకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సహా ఇంజనీర్లంతా నివ్వెరపోయారు.. అబ్బురపడ్డారు.. పిల్లోడిని తెలంగాణ ఇరిగేషన్ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు హరీశ్ ప్రకటించారు.
యూకేజీ బుడ్డోడు..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన హనుమంతరావు హైదరాబాద్ షాపూర్ నగర్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి. కొడుకు ఐదేళ్ల నేహాల్ యూకేజీ చదవుతున్నాడు. ప్రాజెక్టుల గురించి ఇంట్లో నేహాల్ అనర్గళంగా మాట్లాడుతుండగా చూసిన స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడొకరు ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి చేరవేశారు. దీంతో అబ్బురపడ్డ మంత్రి ఆదివారం జలసౌధలో ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన మేధోమధన సదస్సుకు నేహాల్‌ను పిలిపించారు. హరీశ్‌రావు, ఇంజనీర్ల సమక్షంలో నేహాల్ తన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు. నిపుణులైన ఇంజనీర్లు కూడా గుర్తు పెట్టుకోని సమాచారాన్ని ఆశువుగా చెబుతుంటే హరీశ్ రావు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, దేవీప్రసాద్, పలువురు చీఫ్ ఇంజనీర్లు, నీటిపారుదల రంగ నిపుణులు నివ్వెరపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టును తమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డ పాయింట్‌కు ఎందుకు మార్చారో, మహారాష్ట్ర అభ్యంతరాలు ఏమిటో, కేసీఆర్ దూరదృష్టి ఎలాంటిదో గణాంకాలతో సహా అలవోకగా వివరించాడు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల గురించి కూడా చెప్పాడు. యూకేజీ చదువుతున్న నేహాల్ రాష్ట్ర ప్రాజెక్టులు, ఆయకట్టు, ఇతర ప్రయోజనాలపై 20 నిమిషాలపాటు ప్రసంగించిన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రెండేళ్ల వయసు నుంచే రికార్డులు
సీఎం కేసీఆర్‌ను కలిస్తే ఏం మాట్లాడతావని నేహాల్‌ను హరీశ్ రావు అడగ్గా.. ‘శీలం సిద్దారెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండగా మా గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని చెప్పి నేటి వరకు కట్టించలేదు. గ్రామ రైతుల కోసం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించమని కోరతా’అని తెలిపాడు. నేహాల్ రెండేళ్ల వయసు నుంచే తన ప్రతిభతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్–2, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్–1, బొంబాయి సూపర్ కిడ్–2, భారత్ వరల్డ్ రికార్డ్–1, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్–1 అవార్డులను సాధించాడు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు అందుకున్నాడు. నేహాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో యూకేజీ చదువుతున్నాడు.
త్వరలోనే సీఎం వద్దకు..
నేహాల్ తెలివికి సంబురపడ్డ మంత్రి హరీశ్‌రావు.. పిల్లోడిని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. నేహాల్ చదువుకయ్యే ఖర్చు మొత్తం ఇరిగేషన్ శాఖ భరిస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ను కలవాలని నేహాల్ కోరగా, త్వరలోనే ఆ కోరిక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే నేహాల్‌తోపాటు ఆతని కుటుంబ సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకువెళ్లి చూపాలని సీఈ హరిరామ్‌ను ఆదేశించారు. నేహాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని హరీశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment