గూడు లేక డేరాలో..
- అప్పులబాధతో రైతు ఆత్మహత్య.. దిక్కుతోచని కుటుంబం
ఎల్లారెడ్డిపేట: బంగారు పంట పండుతుందనే తలంపుతో అప్పు చేశాడు. ఉన్న ఇంటినీ అమ్ముకున్నాడు. చివరికి అప్పు కట్టే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్నాడా రైతు. ఇప్పుడా కుటుంబం నిలువ నీడ లేక గ్రామ శివారులో పాలిథిన్ కవర్‌తో డేరా వేసుకొని నివాసముంటోంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లిలో వెలుగుచూసింది. పిట్ల లింగం(58) అప్పుల బాధ తాళలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండెకరాల్లో వరి, పత్తి సాగు చేసేవారు. ఊళ్లో ఉపాధి కరువై రెండేళ్ల క్రితం కుమారుడు నాగరాజును రూ.లక్ష అప్పు చేసి గల్ఫ్ పంపించాడు. కంపెనీలో పనిలేక నాగరాజు ఏడాదికే ఉత్తచేతులతో తిరిగొచ్చాడు.
కూతుళ్లు భాగ్యలక్ష్మి, కవిత పెళ్లి కోసం లింగం మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. అప్పులు ఓ వైపు పెరిగిపోతున్నా... భూమినే నమ్ముకుని మరో రూ.3 లక్షలు అప్పు చేసి నాలుగు బోర్లు వేశాడు. వాటిల్లో నీరు పడలేదు. ఈ ఏడాది అప్పు చేసి మరో రెండు బోర్లు వేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పులు ఎక్కువ కావడంతో ఉన్న ఇల్లును అమ్మేశాడు. ఆరు బోర్లు వేసినా చుక్కనీరు లేక పంట ఎండిపోవడంతో లింగం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తడిసి మోపెడు కావడంతో... తీర్చలేననే బెంగతో పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు.
లింగం ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు నుంచి గ్రామశివారులో ఓ చిన్న డేరా వేసుకుని ఆ కుటుంబం తలదాచుకుంటోంది. అయితే, వీర్నపల్లిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ శుక్రవారం గ్రామానికి వెళ్లగా, రైతు కుటుంబం డేరా వేసుకొని జీవిస్తున్న దృశ్యం కనిపించింది. ఆయన కుటుంబాన్ని పరామర్శించి, బాధితులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా లింగం కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.