మాతృత్వానికి అర్థం చెప్పిన సీఐ
ఖాకీ వెనుక కన్న తల్లి ప్రేమ కూడా దాగుంటుందని చాటారు వేములవాడ సీఐ మాధవి.
వేములవాడ: ఖాకీ వెనుక కన్న తల్లి ప్రేమ కూడా దాగుంటుందని చాటారు వేములవాడ సీఐ మాధవి. వేములవాడ దేవస్థానం మెట్ల దగ్గర గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు 20 రోజుల పసికందును వదిలి వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ మాధవి హుటాహుటిన అక్కడికి చేరుకుని చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయారు. బాబును అక్కున చేర్చుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు.
బాబుకు స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి పాలు పట్టించారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడున్న కొందరు సీఐ మాధవిని తమ జిల్లాకు పోలీసు అమ్మగా ఆమెను పేర్కొనడంతో అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. ఇదే కాదు, ఇంతకు మునుపు కూడా పలుమార్లు సీఐ మాధవి ఇటువంటి ఎన్నో ఘటనలకు అమ్మవలే స్పందించి మంచి తనాన్ని చాటుకున్నారు.