ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు  | New coal blocks in other states | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు 

Published Wed, Jul 3 2019 2:19 AM | Last Updated on Wed, Jul 3 2019 2:19 AM

New coal blocks in other states - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో లాభదాయక బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో 6 నుంచి 10 బ్లాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడించారు. వీటిని కేటాయిస్తే రానున్న ఐదేళ్లలో సింగరేణి ఏడాదికి 85 మిలియన్‌ టన్నుల నుంచి 100 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు కార్మిక సంఘం నేతలతో జరిగిన 37వ సీఎండీ స్థాయి స్ట్రక్చర్డ్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడతూ రానున్న 5 ఏళ్ల కాలంలో బొగ్గు పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కోనుందని, 50కి పైగా ప్రైవేటు బొగ్గు సంస్థలతో సింగరేణి, కోలిండియా సంస్థలు పోటీ పడాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గించుకుంటేనే మార్కెట్‌లో నిలబడి మనుగడ సాధించగలమని తెలిపారు. సింగరేణి సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని థర్మల్‌ విద్యుత్‌తోపాటు సోలార్‌ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 130 మెగావాట్లు, వచ్చే ఏడాది మరో 80 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేశామన్నారు.  

సంస్థ మనుగడ, వృద్ధికి సహకరించాలి.. 
కార్మికులకు కంపెనీకి సంబంధించిన వాస్తవాలు వివరించాలని, తద్వారా నిర్మాణాత్మక ఆలోచనలతో కంపెనీని ముందుకు తీసుకుపోవాలని కార్మికులకు, కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ఎప్పుడూ సానుకూల వైఖరితోనే ఉంటుందన్నారు. గత ఐదేళ్లలో అనేక దీర్ఘకాలిక సమస్యలపై పలు చారిత్రక ఒప్పందాలు చేసుకుని అమలు చేసిందని తెలిపారు. ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘంతో కొత్త కేడర్‌ స్కీం, బదిలీ రెగ్యులరైజేషన్, అలవెన్సుల పెంపుదల వంటి వాటిపై చారి త్రక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఒప్పం దాల్లో అన్ని అంశాలు వెంటనే అమలు చేశామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే మెడికల్‌ బోర్డు ద్వారా అన్‌ఫిట్‌ అయిన కార్మికుల వారసులు దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలిచ్చామని తెలి పారు.  

సీఎండీ ముందు డిమాండ్లు.. 
గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.వెంకట్రావు, జనరల్‌ సెక్రటరీ మిరియాల రాజి రెడ్డి మాట్లాడుతూ దేశంలో నంబర్‌ 1గా నిలిచిన సింగరేణిని ఇలాగే ముందుకు తీసుకెళ్లడంలో కార్మికులను సమాయత్తం చేస్తామన్నారు. పెర్కు మీద ఇన్‌కంటాక్స్‌ రీయింబర్స్‌మెంట్, సర్ఫేస్‌కు అన్‌ఫిట్‌ మీద వచ్చిన ఉద్యోగులకు డిపెండెంట్‌ ఉద్యోగాల అవకాశం, సీపీఆర్‌ఎంఎస్‌ స్కీంకు డబ్బు చెల్లింపును కార్మికుడి ఇష్టానికి వదిలేయడం వంటి డిమాండ్లను కార్మిక నాయకులు వినిపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement