నారాయణపేట పట్టణం వ్యూ
నారాయణపేట : పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇందులో పూర్వ వరంగల్‌లోని ములుగు ఒకటి కాగా.. మహబూబ్‌నగర్ నుంచి విడదీసి నారాయణపేట జిల్లాను ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న (జీఓ నెం.534) నోటిఫికేషన్ జారీచేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నారాయణపేట బహిరంగ సభకు హాజరైన అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు నారాయణపేటను 32వ జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు టీఆర్‌ఎస్ సంపూర్ణ మెజార్టీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో నారాయణపేటను జిల్లాగా చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా వెల్లడించిన ముసాయిదాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 వరకు వెల్లడించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త జిల్లా ఇలా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఇది వరకే నాలుగు జిల్లాలుగా విభజించారు. ప్రస్తుతం నారాయణపేటను జిల్లాగా ప్రకటించడంతో ఐదో జిల్లాగా అవతరించినట్లయింది. ఒక రెవెన్యూ డివిజన్(నారాయణపేట)తో పాటు12 మండలాలు ఉండేలా నారాయణపేట జిల్లాను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. నారాయణపేట రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే నారాయణపేట, ధన్వాడ, మరికల్, దామరగిద్ద, ఊట్కూరు, మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, మద్దూర్, కోస్గి, కోయిలకొండ మండలాలు ఉన్నాయి. ఈ 12 మండలాలతోనే జిల్లా ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.
కలపాలి.. కలపొద్దు...
నారాయణపేట నియోజకవర్గంలోని కోయిల్‌కొండ మండలం పస్తుతం మహబూబ్‌నగర్ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో ఉంది. అయితే, కోయిలకొండను నారాయణపేట జిల్లాలో కలపకుండా మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఆ మండల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే మహబూబ్‌నగర్ ఉన్నందున తమను ఇక్కడే కొనసాగించాలనేది వారి డిమాండ్. అలాగే కోస్గి మండల ప్రజలు సైతం మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంచాలని ఆందోళన బాట పట్టారు. ఇకపోతే ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉన్న దౌల్తాబాద్ మండల వాసులు నారాయణపేట జిల్లాలో తమ మండలాన్ని కోరుతున్నారు. వీరి డిమాండ్ గతంలో జరిగిన జిల్లాల పునర్విభజన నాటి నుంచే ఉంది. అయితే, చివరకు ఏయే మండలాలు ఏయే జిల్లాలో ఉండనున్నాయో తేలాల్సి ఉంది.
తెరపైకి కొత్త డివిజన్లు, మండలాలు
నారాయణపేట జిల్లా ప్రకటనతో కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆత్మకూర్, మక్తల్‌తో పాటు కోస్గిని సైతం రెవెన్యూ డివిజన్ చేయాలని ఆయా ప్రాంత వాసులు, రాజకీయనేతలు, నాయకులు డిమాండ్ చేస్తూ అధికారులకు వినతులను అందజేస్తున్నారు. ఇక ఊట్కూర్ మండలంలోని బిజ్వార్, పూలిమామిడి గ్రామాల ప్రజలు, నారాయణపేట మండలంలో కోటకొండ, అప్పక్‌పల్లి, దామరగిద్ద మండలంలో మొగల్‌మడ్కా, కానుకుర్తి, కోస్గి మండలంలో గుండుమాల్, మద్దూర్ మండలంలో భూనేడ్, కొత్తపల్లి, కోయిల్‌కొండ మండలంలో గార్లపాడు, కోత్లాబాద్‌ను మండలాలుగా చేయాలని స్థానికులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ప్రకటన జారీ చేయగా.. ఇవేవీ ఇందులో లేవు. దీంతో చివరి వరకు ఏమైనా జాబితాలో చేరతాయా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే నోట.. ఆత్మకూరు, అమరచింత మాట
మక్తల్ నియోజకవర్గ కేంద్రం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండగా.. ఇదే నియోజకవర్గంలోని ఆత్మకూర్, అమరచింత మండలాలు మాత్రం వనపర్తి జిల్లాలో కొనసాగుతున్నాయి. అయితే, నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉంటే బాగుంటుందని ఆ ప్రాంత జనం కోరుకుంటున్నారని చెబుతున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నారాయణపేటలో గురువారం జరిగిన సభలో ప్రకటించారు. దీంతో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ రెండు మండలాలను నారాయణపేట జిల్లాలో చేర్చే అంశం పరిశలనకు వస్తుందని.. తద్వారా 14 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటుకావొచ్చని తెలుస్తోంది.
30 వరకు అభ్యంతరాల స్వీకరణ
నారాయణపేట జిల్లా ప్రకటనపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయొచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జిల్లాలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కావాలనే ప్రతిపాదనలు, మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలపాలనే వినతులు తదితర అంశాలపై పలువురు జిల్లా కలెక్టర్‌కు విన్నవించే అవకాశం ఉంది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిశాక నారాయణపేట జిల్లాకు తుది రూపం వచ్చి ఫైనల్ గెజిట్ నెల తర్వాత వెలువరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment