కొత్త సర్కారుపై కోటి ఆశలు | New government huge hopes | Sakshi
Sakshi News home page

కొత్త సర్కారుపై కోటి ఆశలు

Published Mon, May 19 2014 2:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

New government huge hopes

గోదావరిఖని,న్యూస్‌లైన్: సింగరేణి కార్మికులు కారుకు జైకొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా గులాబీకి పట్టం కట్టారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది, ఐదు లోక్‌సభ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఉద్యమ ప్రస్థానంలో అడుగడుగునా అండగా నిలిచి.. ఇప్పుడు అధికారం అప్పగించడంలో ముందున్న సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆ పార్టీ ప్రజాప్రతినిధులపైనే ఉంది.
 
 కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. సింగరేణి వ్యాప్తంగా 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజె క్టులు ఉండగా, 64వేల మంది కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తూ అటు ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.
 
 అయినప్పటికీ గనికార్మికుల జీవితాలు దినదినగండానే గడుస్తున్నాయి. సింగరేణి ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక సమస్యలతో నల్లసూరీళ్లు సతమతమవుతున్నారు. కార్మికుల సమస్యలను ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మరిచిపోయి శ్రమజీవుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. సింగరేణిలో కొలువుదీరిన స్థానికేతర అధికారులు, ఉన్నతాధికారులు స్థానిక కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షతను ప్రదర్శిస్తున్నారనే అపవాదు ఉంది. ఆ అవమానాలు, అణిచివేతల కారణంగా ఆక్రోశంతో రగిలిపోతున్న కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైన తరుణంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని నియోజకవర్గాల పరిధిలో సింగరేణి సంస్థ విస్తరించి ఉండగా, రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న గనికార్మికులు అక్కడ సైతం గులాబీ జెండానే ఎగురవేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎన్నుకున్నారు.
 
 అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కారుకు పట్టం కట్టారు. దీంతోపాటు పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాద్‌లలో టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ తమ సమస్యలకు విముక్తి కలుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక కార్మికులు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపైనే ఉంది.
 
 ఎంపీల గురుతర బాధ్యత ఇది...
 తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీఆర్‌ఎస్‌పై సింగరేణి ప్రాంత అభివృద్ధితో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం చేయడాన్ని గురుతర బాధ్యత. లోక్‌సభకు పోటీ చేసిన టీఆర్‌ఎస్ సభ్యులు కోల్‌బెల్ట్ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి  కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
 ప్రాణాలకు ఫనంగా పెట్టి పనిచేస్తున్న గని కార్మికులకు కూడా ఆదాయపు పన్ను మినహారుుంపు ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 1998లో 1,09,000 మంది కార్మికులు పనిచేస్తే నేడు 64 వేలకు వారి సంఖ్య తగ్గింది. కార్మికుల నియూమక ప్రక్రియ చేపట్టాలి. కొత్తగా భూగర్భ గనులను ప్రారంభించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలి. పనిఒత్తిడి కారణంగా విధులకు గైర్హాజరైన దాదాపు 10 వేల మంది కార్మికులను యాజమాన్యం డిస్మిస్ చేసింది.
 
 వీరిలో ఇటీవల కొంత మందిని విధులకు తీసుకున్నా వేలాది మంది రోడ్లపైనే బతుకీడుస్తున్నారు. డిస్మిస్ కార్మికులను కూడా బేషరతుగా ఉద్యోగాల్లోకి తీసుకునేలా యాజమాన్యంతో చర్చించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 35 రోజుల పాటు కార్మికులు సకల జనుల సమ్మె చేపట్టి బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి వేలాది రూపాయలు వేతనాలను కోల్పోయారు. ఈ సందర్భంగా రూ. 25 వేలను సమ్మె అడ్వాన్స్ చెల్లించి తిరిగి వేతనాల నుంచి కోత విధించారు. ఆ సొమ్మును తిరిగి కార్మికులకు చెల్లించాలనే డిమాండ్‌ను ఎంపీలు తమ భూజాలపై వేసుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement