టార్గెట్ డౌటే..! | Target dought..! | Sakshi
Sakshi News home page

టార్గెట్ డౌటే..!

Published Thu, Feb 6 2014 3:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Target dought..!

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనకబడుతోంది. అధికారుల ప్రణాళికాలోపంతో పన్నెండేళ్లుగా లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చిన రికార్డు చెదిరిపోయే ప్రమాదంలో పడింది. ఓబీ టెండర్ల జాప్యం, బొగ్గు రవాణాలో ఇబ్బందులు, పని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిర్దేశిత లక్ష్యసాధనకు రెండు నెలలు కూడా లేకపోవడంతో యాజమాన్యం ఆందోళనలో పడింది.
 
 గోదావరిఖని, న్యూస్‌లైన్ : కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించిన సింగరేణి సంస్థలో 35 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి 54.30 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు 43.86 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 38.85 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీశారు. అంటే గడిచిన పది నెలల కాలంలో లక్ష్యానికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడి ఉంది. లక్ష్యసాధనకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు, మహాశివరాత్రితో 23 రోజులు, మార్చిలో ఐదు ఆదివారాలకు తోడు హోలీ, ఉగాది పండుగతో 24 రోజుల పనిదినాలున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు మూడు రోజులు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. ఈ జాతరకు సింగరేణి ఉద్యోగులు భారీగా వెళ్తారు.
 
 ఈ లెక్కన రెండు నెలల్లో 44 రోజులే పని దినాలున్నాయి. ఈ రోజుల్లో గడిచిన కాలానికి వెనకబడిన 5 మిలియన్ టన్నులతోపాటు 10.45 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాల్సి ఉంటుంది. మొత్తం 15.45 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న లక్ష్యాన్ని రెండు నెలల్లో సాధించడం సింగరేణికి కష్టసాధ్యమని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు బొగ్గు ఉత్పత్తిని వెలికితీసేందుకు సంస్థ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. స్పెషల్ ప్యాకేజీలు, ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తూ ఉత్పత్తి మెరుగుపరిచేందుకు యత్నిస్తున్నా లక్ష్యం చేరడం అనుమానంగానే ఉంది.
 
 ఓబీ మట్టి తరలింపే సమస్య
 ఉత్పత్తిలో కొత్తగూడెం, ఎల్లందు, రామగుండం-3, బెల్లంపల్లి డివిజన్లు లక్ష్యాన్ని సాధించడంలో ముందున్నాయి. మణుగూరు, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా, భూపాలపల్లి, రామగుండం-1, రామగుండం-2, మందమర్రి, శ్రీరాంపూర్  డివిజన్లు లక్ష్యసాధనలో వెనుకబడ్డాయి. ముఖ్యంగా పని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆర్జీ-1లోని మేడిపల్లి ఓసీపీలో 1.5 మిలియన్ టన్నులు, అడ్రియాల షాఫ్ట్‌బ్లాక్‌లో 2 మిలియన్ టన్నులు, కాకతీయ లాంగ్‌వాల్ ప్రాజెక్టు, భూపాలపల్లి ఓసీపీ, మణుగూర్ ఓపెన్‌కాస్ట్‌ల్లో సరైన విధంగా బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయారు. పలు ఓపెన్‌కాస్ట్‌ల్లో మట్టి తొలగింపు చేసే కాంట్రాక్టు సంస్థల టెండర్లు పూర్తి కాకపోవడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి జరగలేదు. బొగ్గు రవాణా సరిగ్గా సాగకపోవడంతో పలు సంస్థలు ఇతర సంస్థలు, విదేశీ బొగ్గుపై ఆధారపడుతున్నాయి.
 
 ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ధర 230 డాలర్ల నుంచి 130 డాలర్లకు పడిపోవడంతో కర్ణాటకలోని పలు సిమెంట్ కంపెనీలు విదేశాల నుంచి వచ్చే బొగ్గును వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీకి ప్రతీసారి అదనంగా బొగ్గును రవాణా చేసే సింగరేణి సంస్థ ఈసారి ఎక్కువ బొగ్గును రవాణా చేయలేకపోయింది. దీంతో పలు సంస్థల యజమాన్యాలు సింగరేణిపై అసంతృప్తితో ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 ప్రణాళికా లోపం
 ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి ప్రణాళికా లోపం ఉంది. ఓపెన్‌కాస్టుల్లో సమయానికి అనుకూలంగా ఓబీ టెండర్లు ఇవ్వాల్సి ఉండగా జాప్యం చేయడంతో మట్టి తరలింపు త్వరగా జరగడం లేదు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. ఇది లక్ష్యంపై ప్రభావం చూపుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల సమయంలోనే అంచనా వేసి ఉత్పత్తి మెరుగుపరిచేందుకు సరైన ప్రణాళికలు వేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేశారు.
 
 ఫలితంగా 2000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చిన రికార్డును ఈ ఏడాది సింగరేణి కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటోంది. ఇన్సెంటివ్‌లు, స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించినా లక్ష్యం సాధించే పరిస్థితి లేదు. గతేడాది లక్ష్యం 54 మిలియన్ టన్నులు కాగా, 53.19 మిలియన్ టన్నులు సాధించి లక్ష్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే సంస్థాగత లక్ష్యం 53 మిలియన్ టన్నులే కావడంతో లక్ష్యాన్ని సాధించినట్లుగానే పరిగణించారు.
 
 ఇలా చేస్తే ఉత్పత్తి మెరుగు
  సమయం వృథా కాకుండా ఉత్పత్తి ఎక్కువ చేయడం.
 గనులు, ఓపెన్‌కాస్టుల్లో ఉన్న మిషన్లు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక.
  ఓబీ కాంట్రాక్టర్లు మట్టి తీశాక కొంతకాలానికి అక్కడ బొగ్గు తీసేవారు. ఇప్పుడు ఓబీ మట్టి తీశాక వెంటనే ఆ ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి చేయడం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement