బొగ్గే ముద్దు.. జనాలు వద్దు! | Singareni Was Not Give Funds to Construct Sathupalli Road Railway Station | Sakshi
Sakshi News home page

బొగ్గే ముద్దు.. జనాలు వద్దు!

Published Thu, Dec 5 2019 8:31 AM | Last Updated on Thu, Dec 5 2019 8:32 AM

Singareni Was Not Give Funds to Construct Sathupalli Road Railway Station - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం సీతంపేటలో మధ్యలోనే ఆగిపోయిన రైల్వే స్టేషన్‌ నిర్మాణం

పెరిగిన అంచనా వ్యయం.. కలగానే మారుతున్న సత్తుపల్లివాసుల రైలు ప్రయాణం.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైల్వే లైను నిర్మాణంతో కేవలం బొగ్గు రవాణాకే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి రైల్వే లైను నిర్మాణ పనుల్లో మూడు స్టేషన్ల రద్దు తీవ్ర చర్చనీయాంశమైంది. సంబంధిత రైల్వే శాఖ అధికారులు దీనిని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ సీతంపేట రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనుల నిలిపివేతతో ఆ నిర్ణయం స్పష్టమవుతోంది. రైల్వే శాఖ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బొగ్గు రవాణాతోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న 56 కిలోమీటర్ల నిడివి గల రైలు మార్గం బొగ్గు రవాణాకే పరిమితం కానుంది. చుక్‌.. చుక్‌ రైలొస్తుంది.. అందరు పక్కకు జరగండి.. ఆగకుండా వెళ్తుంది అన్న చందంగా తయారైంది సత్తుపల్లివాసుల పరిస్థితి.

సాక్షి, ఖమ్మం : భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి రైల్వే లైను నిర్మాణం కోసం 2015–16లో రూ.740కోట్ల అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో రైలుమార్గం నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.618కోట్లు, రైల్వే శాఖ భూ సేకరణ కోసం రూ.85కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చాయి. అయితే 2018–19లో ప్రాజెక్టు ప్రారంభం కావడంతో ప్రస్తుత అంచనా విలువ రూ.952కోట్లకు చేరింది. ఇందులో రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి సంస్థ వాటా రూ.618కోట్ల నుంచి రూ.704కోట్లకు పెరిగింది. అలాగే భూ సేకరణకు రైల్వే శాఖ అదనపు నిధులు చెల్లించనుంది. అయితే సింగరేణి సంస్థ తాము కేవలం రైల్వే లైను నిర్మాణానికే నిధులు ఇస్తామని, గతంలో కేటాయించిన నిధుల కంటే పెంచి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

అంటే పెరిగిన సింగరేణి సంస్థ వాటా అంచనా వ్యయం సుమారు రూ.86కోట్లు అదనంగా ఇచ్చేది లేదని చెప్పింది. చేసేది లేక రైల్వే శాఖ.. రైల్వే లైను మార్గంలో కొన్ని పనులను తగ్గించి.. అందుబాటులో ఉన్న నిధులతోనే పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం రైల్వే లైను మార్గంలో ఉన్న సుజాతనగర్‌ మండలం సీతంపేట, పెనుబల్లి మండలంలోని పెనుబల్లి జంక్షన్, సత్తుపల్లి రోడ్డు(లంకపల్లి) రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులను నిలిపివేసింది. ఆ శాఖకు అక్కడ స్టేషన్ల నిర్మాణ వ్యయం తగ్గనుంది. కోయగూడెం, చండ్రుగొండ, భవన్నపాలెంలో మాత్రమే రైల్వే స్టేషన్లు నిర్మించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. సీతంపేటలో సగం మేర నిర్మించిన రైల్వే స్టేషన్‌ పనులు నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. పెనుబల్లి జంక్షన్, సత్తుపల్లి రోడ్‌ స్టేషన్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే నిలిచిపోయిన మూడు రైల్వే స్టేషన్లు బొగ్గు రవాణాకు, ప్రజా రవాణాకు ప్రాముఖ్యత, అవసరం ఉన్నవే. 

ఆ స్టేషన్లే కీలకం..
భవిష్యత్‌లో సత్తుపల్లి రోడ్‌ నుంచి కొవ్వూరుకు 73 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణం జరగాలంటే సత్తుపల్లి రోడ్‌(లంకపల్లి) స్టేషన్‌ ఏర్పాటే కీలకం. అలాగే పెనుబల్లి జంక్షన్‌ నుంచి విజయవాడ సమీపంలోని కొండపలి్లకి 80 కిలోమీటర్ల రైల్వే లైను విస్తరించాలంటే పెనుబల్లి జంక్షన్‌ అవసరం. సీతంపేటలో ఇప్పటికే సగం మేర చేపట్టిన స్టేషన్‌ నిర్మాణ పనులు మధ్యలో వదిలేస్తే నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది. రైతులు,  ప్రజా రవాణాకు కూడా రైల్వే లైను ఉపయోగపడుతుందనే తలంపుతో తమ భూములను భూ సేకరణలో కోల్పోయినప్పటికీ ప్రజా ప్రయోజనార్థం  అంగీకరించారు.

ప్రస్తుతం రైల్వే అధికారుల తీరుతో రైల్వే లైను కేవలం బొగ్గు రవాణాకే పరిమితం అవుతుందని, ప్రజా రవాణాకు ఉపయోగపడని.. సింగరేణి లాభార్జన కోసం ఉపయోగించే రైల్వే లైనుకు తమ భూములు ఎందుకివ్వాలంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. భూ సేకరణలో జాప్యం, అరకొర నిధుల కేటాయింపుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.

వచ్చే డిసెంబర్‌ నాటికి..
ఇప్పటికే భూ సేకరణ 90 శాతం పూర్తయిందని, కోర్టు కేసులు, రైతులు నిరాకరించిన 10 శాతం భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు రైల్వే కట్ట నిర్మాణం 50 శాతం, బ్రిడ్జిల నిర్మాణం 50 శాతం, విద్యుద్దీకరణ పనులు 20 శాతం పూర్తయ్యాయి. వీటిలో భూ సేకరణకు రైల్వే శాఖ రూ.130కోట్లు, రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.150కోట్లు.. మొత్తం రూ.280కోట్లు రైల్వే నిర్మాణానికి ఖర్చు చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. భూ సేకరణ సజావుగా పూర్తయి.. నిధులు సకాలంలో సమకూరితే డిసెంబర్‌ 2020 నాటికి రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏదేమైనా సింగరేణి సంస్థ లాభార్జనే ధ్యేయంగా కాకుండా.. బొగ్గు రవాణా వల్ల కాలుష్యం బారిన పడుతున్న రైల్వే మార్గంలోని గ్రామాల్లో మొదట్లో గుర్తించిన రైల్వే స్టేషన్ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించి, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ప్రజలకు రవాణా సేవలు అందేలా చూడాలని సత్తుపల్లి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కాగా.. దీనిపై సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్‌.నరి్సంహారావును వివరణ కోరగా... బొగ్గు రవాణా కోసం రైల్వే లైన్‌ నిర్మాణానికి నిధులు కేటాయించడం వరకే మా బాధ్యత. నిర్మాణం, పనుల వ్యవహారం అంతా రైల్వే శాఖ చూసుకుంటుంది. ఇంకా దీనిపై మా వద్ద ఎటువంటి సమాచారం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement