రైల్వే వ్యాగన్లలో రవాణా అవుతున్న బొగ్గు
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి సంస్థ ఒకే రోజు 2,43,731 టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలోనే అత్యధికంగా 46 రేక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేయడంతో సింగరేణి మరో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఈ నెల 27న అత్యదిక బొగ్గు రవాణాతో రికార్డు సాధించింది. విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా సంస్థ భారీగా పెంచుకుంది. సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రతీవారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నిర్వహిస్తున్న ఉత్పత్తి, రవాణా సమీక్షలు ఫలితాలిస్తున్నాయి. రైల్వేశాఖ వారితో నిర్వహిస్తున్న సమన్వయం ఫలితంగా తగినన్ని రేక్‌లు బొగ్గు రవాణా కోసం అందుబాటులోకి రావడంతో విద్యుత్ సంస్థలకు బొగ్గు సమకూర్చే వీలు కలిగింది. సాధారణంగా రోజుకు 30–33 రేక్‌ల బొగ్గును రవాణా చేసే కంపెనీ ఈ నెల 12న 41 రేక్‌లు, 10, 20న 42 రేక్‌లు, 22న 43 రేక్‌లు, 24న 44 రేక్‌లు, 27న అత్యధికంగా 46 రేక్‌ల బొగ్గు రవాణా చేయడం విశేషం. సింగరేణిలోని అన్ని ఏరియాల్లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ద్వారా 27న పెద్దఎత్తున బొగ్గు రవాణా జరిగింది. అత్యధికంగా 10 రేక్‌లను కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ సీహెచ్‌పీ నుంచి రవాణా చేశారు.
మణుగూర్ కొండాపురం సీహెచ్‌పీ నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–2 నుంచి ఆరు రేక్‌లు, ఇల్లందు నుంచి ఆరు రేక్‌లు, బెల్లంపల్లి నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–1 నుంచి నాలుగు రేక్‌లు, శ్రీరాంపూర్ నుంచి నాలుగు రేక్‌లు, మందమర్రి నుంచి నాలుగు రేక్‌లతో బొగ్గు రవాణా చేశారు. 27న రవాణా అయిన రేక్‌లలో తెలంగాణ జెన్‌కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అత్యధికంగా 12 రేక్‌లు, ఏపీ జెన్‌కో విద్యుత్ కేంద్రాలైన ఆర్‌టీపీఎం, వీటీపీఎస్‌లకు ఆరు రేక్‌లు, కర్నాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన మూడు విద్యుత్ కేంద్రాలకు ఐదు రేక్‌లు, మహారాష్ట్ర జెన్‌కోకు అనుబంధంగా ఉన్న పర్లి, కొరాడి, పరాస్, భూసాలి, చాపూర్ విద్యుత్ కేంద్రాలకు ఎనిమిది రేక్‌లు, ఎన్టీపీసీ రామగుండం, కుడ్గి, శోలాపూర్, మౌదా, సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆరు రేక్‌లు, ఎన్టీపీసీ (జేవీసీ)కి చెందిన మూడు కేంద్రాలకు ఒక రేక్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (జైపూర్)కు రెండు రేక్‌లు, సిమెంట్ తదితర పరిశ్రమలకు కలిపి ఆరు రేక్‌ల బొగ్గును ఒక్క రోజునే సరఫరా చేసింది కంపెనీ.
విద్యుత్ కేంద్రాల్లో తగితనంత నిల్వలు..
సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని విద్యుత్ కేంద్రాలకు సింగరేణి సంస్థ క్రమం తప్పకుండా బొగ్గు సరఫరా చేస్తోంది. విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి అందుకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసి రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో గరిష్ట విద్యుత్ వినియోగం ఉంటున్న తెలంగాణ విద్యుత్ కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా బొగ్గు రవాణా జరుపుతోంది. కనుక బొగ్గు కొతర లేకుండా విద్యుత్ ఉత్పత్తి సజావుగా కొనసాగుతోంది.
మహారాష్ట్ర అభ్యర్థనపై...
ఇటీవల మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా సింగరేణి యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పెరిగిన విద్యుత్ వాడకం రిత్యా అదనంగా నాలుగు రేక్‌ల బొగ్గు సరఫరా చేయాలని కోరగా, సింగరేణి తక్షణమే స్పందించి ఈనెల 27న ఎనిమిది రేక్‌ల బొగ్గు సరఫరా చేసింది.
సీఎండీ అభినందనలు..
రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసిన అన్ని ఏరియాల ఉద్యోగులు, అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందికి సీఎండీ శ్రీధర్ అభినందనలు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తి రవాణాను మరింతగా పెంచాలని, ఇదే ఒరవడితో పనిచేస్తూ లక్ష్యాలు దాటి ముందుకు పోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment