కొత్త పాఠం...!
ఇటు స్కూళ్లు తెరుచుకున్నాయి. సెలవుల జోష్‌నుంచి తేరుకున్న విద్యార్థులు పుస్తకాలతో పాఠశాలలకు గురువారం పరుగులు తీశారు. అమ్మల రెస్ట్‌కు కాస్త ఫుల్‌స్టాప్ పడి..పిల్లలను రెడీ చేస్తూ హడావిడిగా కనిపించారు. తొలిరోజు స్కూలుకు వెళ్లేందుకు మొరాయించిన చిట్టి తమ్ముళ్లను అక్కలే ఓర్పుగా..బడి వైపు అడుగులేయించారు. కొత్త పాఠాలు వినేందుకు వచ్చిన స్టూడెంట్స్, బోధనకోసం వచ్చిన గురువులతో ప్రభుత్వ, ప్రైవేటు బడులు కళకళలాడాయి. కొత్తదనం సంతరించుకున్నాయి.
అటు పల్లెలు ఏరువాక పౌర్ణమికి ముస్తాబయ్యాయి. సాగు యజ్ఞానికి రైతులు ఉపక్రమించారు. శక్తులన్నీ కూడగట్టుకొని కొత్త ఆశలతో వ్యవసాయాన్ని చేసేందుకు పలుగు,పార, అరక సిద్ధం చేసుకున్నారు. తమ జీవన నేస్తాలైన బసవన్నలకు ముచ్చటగా అలంకరించి శ్రమసాయానికి రెడీ చేశారు. ఇళ్లవద్ద సాంప్రదాయ బద్ధంగా మామిడి తోరణాలు కట్టి ‘పచ్చ’గా పంటలు ఎదగాలని వేయి దేవుళ్లకు మొక్కారు. విత్తనం వేసింది మొదలు...ఫలసాయం వచ్చే వరకూ కాపాడాలని వేడుకున్నారు.