ఆర్‌ అండ్‌ బీకి కొత్త రుణం | New loans for Roads and Buildings Department | Sakshi
Sakshi News home page

ఆర్‌ అండ్‌ బీకి కొత్త రుణం

Published Thu, Feb 7 2019 1:49 AM | Last Updated on Thu, Feb 7 2019 1:49 AM

New loans for Roads and Buildings Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మళ్లీ అప్పులవేట ప్రారంభించింది. గతేడాది మొదలైన రూ.మూడు వేల కోట్ల అప్పుల కష్టాలు ఇంకా కొలిక్కిరాలేదు. ఆర్‌ అండ్‌ బీ తాజాగా మరో రూ.వెయ్యి కోట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2018–19 ఆర్థిక ఏడాదిలో దాదాపు రూ.3 వేల కోట్ల అప్పు కోసం నానా తంటాలు పడిన ఆర్‌ అండ్‌ బీ కేవలం రూ.వెయ్యి కోట్ల వరకు అప్పు తెచ్చుకోగలిగింది. ప్రభుత్వ రద్దుతో మిగిలిన రూ.2 వేల కోట్ల రుణాలు సందిగ్ధంలో పడ్డాయి. ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావడంతో అధికారులు రుణం కోసం తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈసారి బ్యాంకులు కూడా ఆర్‌ అండ్‌ బీ కి రుణం ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. 

గతంలో రూ.వెయ్యి కోట్లు మంజూరు! 
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌అండ్‌ బీకి కేటాయించిన రూ.5,600 కోట్లను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. ఆర్‌ అండ్‌ బీ పరిధిలో ఈ ఏడాది రూ.20 వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. ప్రభుత్వం నుంచి  నిధులు రాకపోగా.. రూ.మూడు వేల కోట్లు బ్యాంకు రుణం కోసం ప్రయత్నించాలని, పూచీకత్తు ఇస్తానని ప్రభుత్వం సలహా ఇచ్చింది. దీంతో అధికారులు బ్యాంకు రుణాల కోసం తిరిగారు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వం లోని 4 బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డా యి. ఆంధ్రాబ్యాంకు దాదాపు రూ.వెయ్యి కోట్లు, మిగిలిన బ్యాంకులు రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. ఆంధ్రాబ్యాంకు రూ.750 కోట్లు, విజయ బ్యాంకు రూ. 250 కోట్లు రుణం మంజూరు చేశాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో మిగిలిన రుణం మంజూరు విషయంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. అదేసమయం లో కాంట్రాక్టర్ల బకాయిలు పెరిగిపోసాగాయి. దీంతో అక్టోబర్‌ మొదటివారంలో తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్‌ పనులు నిలిపివేసింది. దీంతో చర్చలకు పిలిచిన ప్రభుత్వం వారికి తొలివిడతగా రూ.5,600 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.

దీంతో కాంట్రాక్టర్లు తిరిగి పనులు మొదలుపెట్టారు. నవంబర్‌ వచ్చినా వారికి ఆ నిధులు అందలేదు. దీంతో రెండోసారి సమ్మె యోచన చేశారు కాంట్రాక్ట ర్లు. చివరికి ఇటీవల సీఎస్‌ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. ఫిబ్ర వరి వచ్చినా కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లింపుల్లో పెద్దగా మార్పు రాలేదు. తాజాగా వీరికి అప్పు ఇచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు అధికారులు ప్రధాన శాఖకు అనుమతి కోసం లేఖ  రాశారని తెలిపారు. ఈ లేఖకు ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయం ఆమోదం తెలపగానే వీరికి రూ.వెయ్యి కోట్లు విడుదలవుతాయని ఆర్‌ అండ్‌ బీ అధికారులు వివరించారు.  నెలాఖరుకు నిధులు: ఆర్‌ అండ్‌ బీ శాఖకు ఇంకా మంత్రిని నియమించలేదు. నెలాఖరున ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక విభాగం వీరికి నిధులు మంజూరు చేసే పనిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement