సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల అవసరాల దృష్ట్యా ఈ ఏడాది చివరిలోగా కొత్త పార్కింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి తారకరామారావు చెప్పారు. నగరంలో ఎక్కువ సాంద్రత గల ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ పాలసీ అమలు చేస్తామని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో పార్కింగ్ విధానంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు, దేశాల్లోని పార్కింగ్ విధానాలు అధ్యయనం చేసి ఈ విధానాన్ని రూపొందించామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల అవసరాలకు అనుగుణంగా పార్కింగ్ విధానం ఉంటుందని.. అన్ని పట్టణాల్లో దశల వారీగా అమలు చేస్తామని వివరించారు. పార్కింగ్ విధానం అమలుకు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ విధానం అమలయ్యేనాటికి ఎక్కడ పార్కింగ్ అందుబాటులో ఉందో తెలుసుకునేలా ప్రత్యేక మొబైల్ యాప్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 700 కొత్త వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయని, కొత్త వాహనాలతో ఎదురయ్యే పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రత్యేక విధానం రూపొందించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment