సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు కొత్త పాస్ పుస్తకాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీకి ముహూర్తం కుదిరింది. మార్చి 11న అన్ని గ్రామాల్లో ఒకేరోజు కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలపై శనివారం ప్రగతి భవన్‌లో 8 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఇందులో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, శాంతకుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, మీసేవా కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ జీఎం డి.శ్రీధర్, సీనియర్ మేనేజర్ సుధీర్ గోలి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన ఫలితాలను ఇందులో విశ్లేషించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణలో మాత్రమే సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని అన్నారు. ‘‘ఇది దేశానికే ఆదర్శం. ఇప్పుడు భూమి వివరాలన్నీ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలతో కూడిన పాస్ పుస్తకాలు కొత్తగా ప్రింట్ చేస్తున్నాం. భూముల వివరాన్నింటినీ కోర్ బ్యాంకింగ్ తరహాలో ఉండే వెబ్‌సైట్‌లో నమోదు చేస్తాం. ఈ ల్యాండ్ వెబ్‌సైట్‌కు ‘ధరణి’ అనే పేరును ఖరారు చేశాం. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా మార్చి 11 నుంచే అమలు చేయనున్నట్టు తెలిపారు. అదేరోజు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. రెండు శాఖల మధ్య మరింత సమన్వయం కోసం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న వాకాటి కరుణకే రిజిస్ట్రేషన్ల్ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘పార్ట్ ఏ’ సక్సెస్.. త్వరలో ‘పార్ట్ బీ’
రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల పాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన పార్ట్–ఎ విజయవంతమైందని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 90 శాతానికి పైగా భూముల విషయంలో స్పష్టత వచ్చిందని, ఏ భూమికి ఎవరు యజమానో తేలిందని చెప్పారు. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్ పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మద్దతు పథకం అమలు చేస్తామని చెప్పారు. కోర్టు కేసులు, ఇతర వివాదాలు, అభ్యంతరాలు ఉన్న భూములను పార్ట్–బిలో పరిష్కరిస్తామన్నారు. పార్ట్–బి చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, దీనిపై త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పార్ట్–ఎ ద్వారా లెక్క తేలిన భూములకు సంబంధించిన వ్యవసాయ ఖాతాలు దాదాపు 71 లక్షలున్నాయని, వారందరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు.
కోర్ బ్యాంకింగ్ తరహాలో ‘ధరణి’
రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూభాగానికి సంబంధించిన వివరాలతోపాటు ఎప్పటికప్పుడు జరిగే మార్పులను నమోదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ వెబ్‌సైట్ నిర్వహించనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ను కోర్ బ్యాంకింగ్ తరహాలో నిర్వహిస్తామని, ఇందుకు ప్రత్యేకంగా ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ వివరాలు, పేరు మార్పిడి వివరాలు అదే రోజు ఈ వెబ్‌సైట్‌లో నమోదు అవుతాయని, మండల కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల దీన్నుంచి వివరాలు తీసుకోవచ్చన్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా ‘ధరణి’ ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపారు.
అవినీతి, నకిలీలు తొలగించడమే లక్ష్యం
భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో వందకు వంద శాతం పారదర్శకత సాధించడం, అవినీతి నిరోధించడం, నకిలీ పాస్ పుస్తకాలను అరికట్టడం లాంటి లక్ష్యాలతో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘‘రైతులు, ప్రజలు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలి. కేవలం ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రావాలి. పాస్ పుస్తకం వారి ఇంటికే కొరియర్ ద్వారా చేరాలి. ఎవరి వద్దకూ వెళ్లకుండానే తమ పని ఒక్కరోజులో పూర్తి కావాలి. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని విధంగా రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలి. నకిలీ పాస్ పుస్తకాల ద్వారా రుణాలు పొంది ప్రభుత్వాన్ని కూడా మోసం చేసిన దాఖలాలున్నాయి. ఇకపై అలా సాధ్యం కాదు. భూ రికార్డుల నిర్వహణను ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుంది. అందుకోసమే సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రతీ విషయం ‘ధరణి’లో నమోదవుతుంది’’ అని వివరించారు.
ఎమ్మార్వోలకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు
రైతులు, ఇతరులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతీ మండల రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 584 మండలాలుండగా.. ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిని యథాతథంగా కొనసాగిస్తూనే మిగిలిన చోట్ల తహశీల్దార్లకు సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించనున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వారు హాజరు కాలేకపోతే, ఆ బాధ్యతలను డిప్యూటీ తహశీల్దార్లకు అప్పగిస్తారు.
‘స్లాటు’ పద్ధతిలో రిజిస్ట్రేషన్
ఇకపై భూములకు సంబంధించిన క్రయ విక్రయ లావాదేవీలను స్లాటు పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పాస్‌పోర్టులు, వాహనాల రిజిస్ట్రేషన్ల తరహాలో అమ్మేవారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ వద్ద సమయం తీసుకోవాల్సి ఉంటుంది. వీరు లైసెన్స్‌డ్ డాక్యుమెంట్ రైటర్లకు ఫీజు చెల్లించి, వారు రాసిన కాగితాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే ఇరు వర్గాలు స్వయంగా డాక్యుమెంట్ రాసుకున్నా అనుమతిస్తారు. సబ్ రిజిస్ట్రార్లు ఇచ్చిన సమయం ప్రకారం ఇరువర్గాలు పాస్ పుస్తకాలతో హాజరుకావాలి. బయోమెట్రిక్ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు తీసుకుంటారు. ఎంత భూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్ పుస్తకం నుంచి సబ్ రిజిస్ట్రార్ తొలగిస్తారు. అదే సమయంలో కొన్న వారి పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ముద్ర వేసి, సంతకం చేస్తారు. భూమిని కొత్తగా కొంటున్న వారయితే, కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. అందులో కొన్న భూమి వివరాలు నమోదు చేస్తారు. ఇద్దరి పాస్ పుస్తకాలను అదే రోజు ఎమ్మార్వోకు పంపుతారు. సదరు భూమి యజమానిగా అమ్మిన వారి పేరు తొలగించి, కొన్న వారి పేరిట మార్పిడి(మ్యుటేషన్) చేస్తారు. ఈ వివరాలను ఎమ్మార్వో కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు.
వెబ్‌సైట్ వివరాలు ఎస్‌ఎంఎస్
మ్యుటేషన్ తర్వాత తహశీల్దార్ కార్యాలయంలోని ఐటీ అధికారికి ఈ వివరాలు పంపాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఐటీ అధికారిని వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. అలా నమోదు చేసిన వివరాలు అమ్మిన, కొన్న వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. పాస్ పుస్తకాలను ఇప్పటి మాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్) బాధ్యత పూర్తిగా ఎమ్మార్వోదే. మ్యుటేషన్ తర్వాత తహశీల్దార్ సంతకం చేసి ముద్ర వేసి పంపుతారు. ఆ పాస్ పుస్తకాలను అదే రోజు మళ్లీ సబ్ రిజిస్ట్రార్‌కు పంపుతారు. ఎమ్మార్వో నుంచి తనకు అందిన పాస్ పుస్తకాలను సబ్ రిజిస్ట్రార్ కొరియర్ ద్వారా అమ్మినవారికి, కొన్నవారికి పంపుతారు. కొన్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు పంపుతారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాయం నుంచి పంపిన వెంటనే ఇద్దరికీ ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం కూడా ఇస్తారు. రైతులకిచ్చే పాస్‌పుస్తకంలో ఖాతా నంబరుతో పాటు పాస్ యూనిక్ కోడ్, గ్రామం, మండలం కోడ్, యజమాని ఆధార్ నంబరు ఉంటాయి.
రాష్ట్రంలో భూభాగం వివరాలు
– 2.80 కోట్ల ఎకరాలు: రాష్ట్రంలోని మొత్తం భూభాగం
– 1.42 కోట్ల ఎకరాలు: ఎలాంటి వివాదాలు లేని వ్యవసాయ భూమి
– 17.89 లక్షల ఎకరాలు: కోర్టు కేసులు, వివాదాలు, చిక్కులు కలిగిన భూములు
– 11.95 లక్షల ఎకరాలు: రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూములు
– 84.00 లక్షల ఎకరాలు: చెరువులు, కుంటలు, కాల్వలు, రైల్వేలైన్లు, సబ్ స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింద భూములు, కోర్టు కేసుల్లోని అటవీ భూములు.
– 24 లక్షల ఎకరాలు: నగరాలు, పట్టణాలు, గ్రామాల నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీ భూమి
Comments
Please login to add a commentAdd a comment