
స్వయం సంఘాలకు కొత్త రూపు
- జిల్లాలో 15,683 ఎస్‌హెచ్‌జీలకు కొత్త అధ్యక్షులు
- 624 గ్రామ సమాఖ్యలకు కూడా..
- అవకతవకలను అరికట్టడమే లక్ష్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ‘కొత్త’రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ సంఘాలకు కొత్త అధ్యక్షుల ఎంపికకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నడుంబిగించింది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుల్లో చాలావరకు ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నారు. దీంతో సంఘ అభివృద్ధి కార్యకలాపాల్లో ఇబ్బందులు ఏర్పడుతుండడంతోపాటు కొంతమేర అవకతవకలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో అవకతవకలకు చెక్‌పెడుతూ.. మరింత బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జిల్లాలో 15,683 ఎస్‌హెచ్‌జీలకు నూతన అధ్యక్షులు ఎంపిక కానున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 35,460 మహిళా సంఘాలున్నాయి. వీటి పరిధిలో 3,62,689 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి ఈ సంఘాలకు కొత్త అధ్యక్షురాళ్లు ఎంపిక కావాల్సి ఉంటుంది. సంఘాల నిబంధనల ప్రకారం ఒక సంఘానికి అధ్యక్షురాలుగా మూడేళ్లకు మించి కొనసాగే అర్హత లేదు. అయినప్పటికీ చాలాచోట్ల ఐదేళ్లకు పైబడి.. పదేళ్లుగా ఒకే అధ్యక్షురాలితో కొనసాగుతున్న సంఘాలున్నాయి.
ఈక్రమంలో వాటిని గుర్తించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ యంత్రాంగం... వెంటనే అధ్యక్ష మార్పునకు నిర్ణయించింది. జిల్లాలో 13,284 సంఘాలు మూడేళ్లకు పైబడిన అధ్యక్షురాళ్లు కొనసాగుతున్నారు. ఇవేగాకుండా మరో 2,399 సంఘాలకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాతినిధ్యాన్ని మార్చాల్సి వచ్చింది. ఇలా మొత్తంగా 15,683 సంఘాలకు ఈనెలాఖరులోగా కొత్త అధ్యక్షులను ఏర్పాటు చేయాల్సి ఉంది.
‘సమాఖ్య’లోనూ మార్పులు..
ప్రస్తుతం ఎస్‌హెచ్‌జీ స్థాయిలో నూతన అధ్యక్షులు ఏర్పాటు కానుండడంతో గ్రామ సంఘాలు(వీఓ)ల్లోనూ మార్పులు అనివార్యం కానుంది. ఎస్‌హెచ్‌జీ అధ్యక్షులే గ్రామ సంఘాల్లో సభ్యులు, అధ్యక్షులుగా కొనసాగుతారు. వీఓల్లోని సభ్యులు మండల సమాఖ్యలో.. మండల సమాఖ్యలోని సభ్యులు జిల్లా సమాఖ్యలో కొనసాగుతారు. ప్రస్తుతం జిల్లాలో 1,452 గ్రామ సమాఖ్యలున్నాయి. తాజాగా ఎస్‌హెచ్‌జీ అధ్యక్షుల మార్పుతో జిల్లాలో 624 గ్రామ సమాఖ్యల అధ్యక్షులు మార నున్నారు. ఇవేగాకుండా సమాఖ్య తీర్మానంతో మరికొన్ని గ్రామ సమాఖ్యలు కూడా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అవకతవకలకు ఆస్కారం లేకుండా..
సంఘాల అధ్యక్ష మార్పుతో అవకతవకలకు ఆస్కారం ఉండదనేది ప్రధాన ఉద్దేశం. దీర్ఘకాలికంగా ఒకరే అధ్యక్షురాలిగా కొనసాగుతుండడంతో వాటి నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. యాచారం మండలంలోని ఓ గ్రామంలో పదేళ్లుగా ఒక మహిళ ఆధ్వర్యంలో సంఘం కొనసాగడంతో అక్కడ అభయహస్తం ఉపకారవేతనాలకు మొదలు.. స్త్రీనిధి రుణాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.
దీంతో ఒక ప్రాజెక్టు మేనేజర్‌తోపాటు ఇద్దరు స్లస్టర్ స్థాయి అధికారులపై వేటు వేశారు. అదేవిధంగా శామీర్‌పేట మండలంలోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. బంట్వారం, వికారాబాద్ మండలాల్లోనూ సంఘాల నిర్వహణ గాడితప్పుతోందని పసిగట్టారు. ఇకపై అక్రమాలకు ఆస్కారం లేకుండా సంఘాల అధ్యక్షుల మార్పును యుద్దప్రాతిపదికంగా చేపడుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు.