
సాక్షి, హైదరాబాద్: శ్రావణ మాసం... శుభకార్యాలకు మంచి తరుణంగా భావిస్తారు. మరో వారం రోజుల్లో మొదలుకానున్న ఈ మాసంలో కొత్త సచివాలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే నెల రోజుల్లో పనులు ప్రారంభించడం అంత సులభం కానప్పటికీ, మంచి రోజులు కావటంతో ఏదో ఒక పనితో సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరో నెల రోజుల్లో ప్రస్తుత సచివాలయం పూర్తిగా ఖాళీ కానుంది.
ఎక్కువ కార్యాలయాలకు తాత్కాలిక నెలవు కానున్న బూర్గుల రామకృష్ణారావు భవనం దాదాపు ఖాళీ అయింది. ఇందులోకి సచివాలయం తరలాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్లుగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు ప్రారంభించారు. మిగతా కార్యాలయాలు కూడా ఖాళీ అయ్యాక భవనానికి రంగులు వేసి ఈ పనులు పూర్తి కాగానే సచివాలయ కార్యాలయాలను తరలించనున్నారు. శ్రావణమాసం ప్రారంభంలోనే ఈ తరలింపు మొదలుపెట్టి వీలైనంత తొందరగా పూర్తి చేసి కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. సచివాలయ భవనం ఎలా ఉండాలన్నది మరో 15 రోజుల్లో తేలుతుంది.
Comments
Please login to add a commentAdd a comment