పోలీసుల వాహనాల్లో కొత్త ట్విస్ట్
-
తెరపైకి ఎర్టిగా వాహనం!
-
ఇన్నోవా కంటే రూ.6 లక్షలు తక్కువ
సాక్షి, సిటీబ్యూరో: పోలీసులకు రాబోతున్న కొత్త వాహనాలలో ఇప్పటి వరకు ఇన్నోవా తెరపైకి వచ్చింది. తాజాగా మారుతి కంపెనీ ఎర్టిగా కూడా ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది. జంట పోలీసు కమిషనరేట్లకు ఇన్నోవా కారు, హీరో మోటార్ సైకిల్‌ను కొనేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి అందులో కొన్నింటిని ఖరీదు చేసింది. సుమారు 1,500 కార్లు, 1,600కుపైగా బైక్‌లు కొత్తగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్లు ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇన్నోవా ఖరీదు సుమారు రూ.16 లక్షలు ఉంది. కానీ, మారుతి ఎర్టిగా సుమారు రూ.10 లక్షలే. రెండు వాహనాల్లో సిట్టింగ్ కేపాసిటీ ఒకే విధంగా ఉంది. పైగా ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుంది. దీన్నే మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. దీంతో ఇన్నోవాల కొనుగోలులో ప్రభుత్వం పునరాలోచించే అవకాశం కనిపిస్తోంది.