అత్తవారింట నవ వధువు ఆత్మహత్య
అల్వాల్ (హైదరాబాద్): ఓ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. ఇంతలోనే నవ వధువు అనుమానస్పద స్ధితితో అత్తవారింట్లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం....నిజామాబాద్ జిల్లా భోదన్‌కు చెందిన వెంకటేశ్వరరావు, మోహిణి దంపతుల కుమార్తె లాస్యప్రియ (26), కేరళకు చెందిన అభిషేక్ (27) నగరంలో ఎంబీఏ చదువుతూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 27న వివాహం చేసుకున్నారు. అల్వాల్‌లోని పంచశీల కాలనీలో కలసి ఉంటున్నారు. అయితే, బుధవారం ఉదయం లాస్య తాను నిద్రించిన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని గమనించిన అభిషేక్ కుటుంబ సభ్యులు లాస్యప్రియ తండ్రికి ఫోన్ చేసి తెలిపారు.
పంచశీల కాలనీకి చేరుకున్న లాస్యప్రియ తల్లిదండ్రులు తమ కుమార్తెను అభిషేక్ కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న లాస్య ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం లేదని పేర్కొన్నారు. వరకట్నం గురించి అభిషేక్ కుటుంబ సభ్యులు వత్తిడి తెచ్చేవారని ఈ క్రమంలోనే లాస్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.