ఘనీని విచారించిన ఎన్‌ఐఏ  | NIA investigated Ghani | Sakshi
Sakshi News home page

ఘనీని విచారించిన ఎన్‌ఐఏ 

Published Sat, Aug 11 2018 1:55 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

NIA investigated Ghani - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్‌ కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల విచారణ నాలుగో రోజైన శుక్రవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అబ్దుల్లా బాసిత్‌ సహా ఎనిమిది మందితో పాటు కొత్తగా ఘనీ అనే యువకుడికి నోటీసులిచ్చి పిలిచి ప్రశ్నించింది. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఘనీ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఆన్‌లైన్‌ ద్వారా ఐసిస్‌కు ఆకర్షితుడయ్యాడు.

అంతేకాకుండా నగరానికి చెందిన వారినీ ఆకర్షించి సిరియా వెళ్లేలా ప్రోత్సహించాడు. ఈ విషయం గుర్తించిన రాష్ట్ర పోలీసులు అతడిని డిపోర్ట్‌ (బలవంతంగా తిప్పి పంపడం) చేయాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరారు. అలా అక్కడి ప్రభుత్వం 2016లో ఘనీని డిపోర్ట్‌ చేసింది. శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు వర్గాలు కౌన్సెలింగ్‌ చేసి విడిచిపెట్టాయి. ఆపై కొన్నాళ్లు ఊరుకున్నా ఘనీ మళ్లీ ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. దీంతో శుక్రవారం అతడిని పిలిపించి వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఘనీతో పాటు ఆ ఎనిమిది మందినీ ప్రశ్నిస్తున్న ప్రత్యేక బృందం వీరు చెప్తున్న అంశాలను సరిచూస్తోంది.  

ఫర్హతుల్లాకు సమీప బంధువు... 
ఘనీ నగరానికి చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీకి సమీప బంధువు. నగరంలోని మాదన్నపేట సమీప కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్‌ అబు సూఫియాన్‌ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌ (జేఈఎం)కు సానుభూతిపరుడిగా ఉండి 2002లో గుజరాత్‌లోని అక్షర్‌ధామ్‌పై జరిగిన దాడి, 2004లో జరిగిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర తదితర కేసుల్లో నిందితుడిగా మారాడు.

2005లో నగర కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడు. ఇతడిపై రెండు కేసులే ఉన్నప్పటికీ... నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలక వ్యక్తిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. జేఈఎం నుంచి లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ) వైపు మళ్లిన అతను దేశీయ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అమీర్‌ రజా ఖాన్‌కు సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement