ISIS terrorist organization
-
ఘనీని విచారించిన ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల విచారణ నాలుగో రోజైన శుక్రవారమూ కొనసాగింది. బేగంపేటలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయంలో ఢిల్లీ నుంచి వచ్చిన డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అబ్దుల్లా బాసిత్ సహా ఎనిమిది మందితో పాటు కొత్తగా ఘనీ అనే యువకుడికి నోటీసులిచ్చి పిలిచి ప్రశ్నించింది. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఘనీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు ఆకర్షితుడయ్యాడు. అంతేకాకుండా నగరానికి చెందిన వారినీ ఆకర్షించి సిరియా వెళ్లేలా ప్రోత్సహించాడు. ఈ విషయం గుర్తించిన రాష్ట్ర పోలీసులు అతడిని డిపోర్ట్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరారు. అలా అక్కడి ప్రభుత్వం 2016లో ఘనీని డిపోర్ట్ చేసింది. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు వర్గాలు కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఆపై కొన్నాళ్లు ఊరుకున్నా ఘనీ మళ్లీ ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారినట్లు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో శుక్రవారం అతడిని పిలిపించి వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఘనీతో పాటు ఆ ఎనిమిది మందినీ ప్రశ్నిస్తున్న ప్రత్యేక బృందం వీరు చెప్తున్న అంశాలను సరిచూస్తోంది. ఫర్హతుల్లాకు సమీప బంధువు... ఘనీ నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీకి సమీప బంధువు. నగరంలోని మాదన్నపేట సమీప కుర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్ (జేఈఎం)కు సానుభూతిపరుడిగా ఉండి 2002లో గుజరాత్‌లోని అక్షర్‌ధామ్‌పై జరిగిన దాడి, 2004లో జరిగిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర తదితర కేసుల్లో నిందితుడిగా మారాడు. 2005లో నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడు. ఇతడిపై రెండు కేసులే ఉన్నప్పటికీ... నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలక వ్యక్తిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. జేఈఎం నుంచి లష్కరేతోయిబా (ఎల్ఈటీ) వైపు మళ్లిన అతను దేశీయ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అమీర్ రజా ఖాన్‌కు సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. -
తమ జిహాదీలనే నరికేసిన ఐసిస్
బ్రిటన్‌లో తీవ్రదాడులకు హెచ్చరిక బాగ్దాద్: తన కబంధ హస్తాల నుంచి తప్పించుకునిపోతున్న 20 మందికిపైగా సొంత సభ్యుల్నే ఐసిస్ ఉగ్రవాద సంస్థ తల నరికి చంపింది. ఈ ఘటన ఇరాక్‌లోని మోసుల్‌లో చోటు చేసుకుంది. మోసుల్‌లోని ఐసిస్ మిలిటెంట్లు కొందరు యుద్ధంనుంచి తప్పించుకుపోతుండగా ఓ చెక్‌పోస్టు వద్ద వారిని శుక్రవారం రాత్రి ఐసిస్ సిబ్బంది పట్టుకున్నారు. వారిని షరియా కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో 20 మందికిపైగా ఐసిస్ సభ్యుల్ని నరికి చంపేసినట్లు వార్తలొచ్చాయి. కాగా, బ్రిటన్‌లో ఇటీవలి పారిస్ దాడులకంటే తీవ్ర దాడులు చేస్తామని ఐసిస్ తన పత్రికలో హెచ్చరించింది. బకింగ్‌హామ్ ప్యాలెస్, నేషనల్ గ్యాలరీను లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
ఆ డబ్బులెక్కడివి?
‘మెహ్దీ’ అకౌంట్ నుంచి కోట్లలో లావాదేవీలు వివిధ బ్యాంక్‌ల్లో మొత్తం 18 అకౌంట్లు చేతులు మారిన డబ్బుపై ఆరా తీస్తున్న పోలీసులు బెంగళూరు : ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ట్వీట్ల ద్వారా మద్దతు తెలుపుతున్నాడనే ఆరోపణలపై అరెస్టైన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్‌ను విచారిస్తున్న పోలీసు అధికారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటున్నారు. ఇందులో దక్షిణ భారత్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో మెహ్దీకి కోట్ల రూపాయల డబ్బు వచ్చి చేరిందని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు గాను రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు సైతం మెహ్దీని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మెహ్దీకి వివిధ బ్యాంకుల్లో మొత్తం 18 అకౌంట్లున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అకౌంట్లలో కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు సైతం జరిగిన విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక మెహ్దీకి సంబంధించిన వివరాలపై లండన్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసే వరకు ఈ అకౌంట్లన్నింటి నుంచి లావాదేవీలు జరగగా, ఆ కథనం ప్రసారం అయిన వెంటనే అకౌంట్లన్నింటిలోని డబ్బులు పూర్తిగా డ్రా అయ్యాయి. ప్రస్తుతం మెహ్దీ పేరిట ఉన్న 18 అకౌంట్లలోనూ బ్యాలెన్స్ జీరోగానే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా మెహ్దీ అకౌంట్ల నుండి వెళ్లిన డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి అనే కోణంలో పోలీసులు విచారణను ప్రారంభించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి దక్షిణ భారత్ మొత్తానికి మెహ్దీ కమాండర్‌గా వ్యవహరించాడని, అతని ద్వారా ఐఎస్ఐఎస్ సంస్థలో చేరిన వ్యక్తుల కుటుంబాలకు ధన సహాయం చేసేందుకే మెహ్దీ అకౌంట్లలోకి భారీ మొత్తంలో డబ్బు వచ్చి చేరేదని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ విధంగా ఎవరెవరి కుటుంబాలకు ఎంతెంత డబ్బు చేరింది, వీరంతా ఎక్కడుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి మాత్రం పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
నగరంపై ఉగ్రవాదుల నజర్
సాక్షి, ముంబై: ఇటీవల పాకిస్థాన్‌లో మారణకాండ సృష్టించిన ఐసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ముంబైలోని పాఠశాలలపై కన్నేసినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ ముఖ్యంగా నగరంలోని గుజరాత్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని ట్విటర్ ద్వారా బయట పడింది. ఇటీవల పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ స్కూల్‌పై దాడిచేసి సుమారు 145 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు. ఇదే తరహాలో ముంబైలోని పాఠశాలపై దాడులు చేయనున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రెండు నెలల కిందట కల్యాణ్‌కు చెందిన నలుగురు ముస్లిం యువకులు హజ్ యాత్రకు వెళ్లి అక్కడ ఉగ్రవాదులతో కలిసినట్లు వార్తలు వచ్చాయి. అందులో అరీబ్ మాజిద్ తిరిగి భారత్‌కు వచ్చాడు. మిగతావారు ఐసీస్‌లో చేరారు. ఆ ముగ్గురిలో ఒకడైన ఫహద్ శేఖ్ ఈ విషయాన్ని ట్వీట్ చేసినట్లు కేంద్ర గూఢచార సంస్థ తెలిపింది. దీంతో పోలీసులు ముంబైలోని గుజరాత్‌తోపాటు ఇతర పాఠశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్వీట్లో పొందుపర్చిన వివరాలిలా ఉన్నాయి... ‘2008 నవంబర్ 26న నగరంలో అక్కడక్కడ దాడులు చేయడానికి కారణం గుజరాతీయులను హతమార్చడమే ప్రధాన లక్ష్యం. దశకంన్నర కిందట గుజరాత్లో మతఘర్షణలు సృష్టించి ముస్లింలపై దాడులు చేయడానికి ముంబై నుంచి గుజరాతీలు డబ్బులు పంపించారు. ఈ ఘటనలో అనేక మంది అమాయక ముస్లింలు మరణించారు. దానికి ప్రతీకారంగానే ముంబైలోని గుజరాతీయులను లక్ష్యంగా చేసుకుంటు’న్నట్లు ట్వీట్లో స్పష్టం చేశాడు. ఐసీస్ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు ములుండ్, ఘాట్కోపర్, విలేపార్లే, కాందివలి, బోరివలి, దహిసర్ తదితర గుజరాతీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో హై అలర్ట్ జారీచేశారు. ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్), క్విక్ రెస్పాన్స్ టీంలను అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు శాఖ హెచ్చరించింది. -
ఎన్ఐఏ కస్టడీకి ‘మెహ్దీ’?
బెంగళూరు : ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ట్విట్టర్ ద్వారా సందేశాలు పంపుతున్నారనే ఆరోపణలపై అరెస్టైన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) అధికారులు కస్టడీకి తీసుకోంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరు సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న మెహ్దీ విచారణ సందర్భంలో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అత్యంత ప్రముఖమైన సమాచారాన్ని వెల్లడిస్తున్న నేపథ్యంలో మెహ్దీని తమ కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఐఏ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ అంశంపై ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే డీజీపీ లాల్‌రుఖుమ్ పచావోతో పాటు నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డిని సైతం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలోపు ఎన్ఐఏ అధికారులు బెంగళూరుకు వచ్చి మరింత సమాచారాన్ని మెహ్దీ నుంచి సేకరించే దిశగా అతన్ని ఢిల్లీకి తీసుకువెళ్తున్నట్లు సమాచారం. మెహ్దీ ట్విట్టర్ నుంచి వివిధ దేశాలకు మొత్తం 1,29,000 సందేశాలు వెళ్లాయని, ఈ ట్విట్టర్ అకౌంట్‌కు తిరిగి అన్నే సందేశాలు వచ్చాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా మెహ్దీ ట్విట్టర్ ద్వారా పంపిన సందేశాలతో ప్రేరేపితమైన దాదాపు 20 మంది యువకులు ఇప్పటికే సిరియాకు చేరుకొని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు సమాచారాన్ని సేకరించారు. ఇక ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్త దక్షిణ భారత్‌లో దాడులకు పాల్పడనుందనే సమాచారం సైతం మెహ్దీ వద్ద ఉందనే విషయాన్ని తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు మెహ్దీని తమ కస్టడీకి తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. పాస్వర్డ్ మరిచిపోయా ఇక సీసీబీ పోలీసుల కస్టడీలో ఉన్న మెహ్దీ తాను ఉపయోగించిన మరో రెండు ట్విట్టర్ అకౌంట్లు, మూడు ఈమెయిల్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లపై నోరు విప్పడం లేదని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో విచారణకు సహకరిస్తున్న మెహ్దీ ఈ పాస్‌వర్డ్‌లకు సంబంధించి మాత్రం ‘నేను ఆ పాస్వర్డ్స్ మరిచిపోయాను’ అని చెబుతున్నట్లు సమాచారం. -
ఐఎస్ విస్తరణ ఆందోళనకరమే!
డీజీపీల సదస్సులో రాజ్‌నాథ్ ⇒ పాక్ తన బుద్ధి మార్చుకోవడం లేదు ⇒ సదస్సులో గుర్రుపెట్టి బజ్జున్న సీబీఐ చీఫ్ గువాహటి: భారత్‌లో కొందరు యువకులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులవడంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోబోదని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వేతర శక్తుల ముసుగులో భారత్‌ను అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. శనివారమిక్కడ డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌కు ఏదో ఒక రూపంలో హాని చేయాలన్న బుద్ధిని పాకిస్తాన్ ఇప్పటికీ మార్చుకోలేదన్నారు. ఐఎస్ మిలిటెంట్ సంస్థ నుంచి ముంబైకి చెందిన ఆరిఫ్ మజీద్ అనే యువకుడు భారత్‌కు తిరిగిరావడాన్ని ప్రస్తావించారు. ‘‘ఈ సంస్థ సిరియా, ఇరాక్‌లకు అవతల పుట్టినా దీని జాడ్యం భారత ఉపఖండానికి విస్తరిస్తోంది. ఆరిఫ్‌ను అరెస్టు చేయడం ఆయనను బాధించడానికి కాదు’ అని చెప్పారు. భారత్‌లోని ముస్లింలు దేశభక్తి కలవారని అన్నారు. లష్కరే తోయిబా వంటి సంస్థలతో భారత్ భద్రతకు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుందని ఇంటెలిజెన్స్ విభాగం డెరైక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం అన్నారు. కాకాగా దేశభద్రత, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుండగా ఈ సదస్సుకు హాజరైన సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా మాత్రం ఇవేవీ పట్టనట్టు హాయిగా కునుకేశారు! రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతుండగా.. ఆయన గుర్రుపెట్టి నిద్రపోవడం గమనార్హం.