ఆ డబ్బులెక్కడివి?
‘మెహ్దీ’ అకౌంట్ నుంచి కోట్లలో లావాదేవీలు
వివిధ బ్యాంక్‌ల్లో మొత్తం 18 అకౌంట్లు
చేతులు మారిన డబ్బుపై ఆరా తీస్తున్న పోలీసులు
బెంగళూరు : ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ట్వీట్‌ల ద్వారా మద్దతు తెలుపుతున్నాడనే ఆరోపణలపై అరెస్టైన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్‌ను విచారిస్తున్న పోలీసు అధికారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటున్నారు. ఇందులో దక్షిణ భారత్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో మెహ్దీకి కోట్ల రూపాయల డబ్బు వచ్చి చేరిందని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు గాను రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్‌ఐఏ అధికారులు సైతం మెహ్దీని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మెహ్దీకి వివిధ బ్యాంకుల్లో మొత్తం 18 అకౌంట్‌లున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ అకౌంట్‌లలో కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు
సైతం జరిగిన విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక మెహ్దీకి సంబంధించిన వివరాలపై లండన్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేసే వరకు ఈ అకౌంట్‌లన్నింటి నుంచి లావాదేవీలు జరగగా, ఆ కథనం ప్రసారం అయిన వెంటనే అకౌంట్‌లన్నింటిలోని డబ్బులు పూర్తిగా డ్రా అయ్యాయి. ప్రస్తుతం మెహ్దీ పేరిట ఉన్న 18 అకౌంట్‌లలోనూ బ్యాలెన్స్ జీరోగానే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా మెహ్దీ అకౌంట్‌ల నుండి వెళ్లిన డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి అనే కోణంలో పోలీసులు విచారణను ప్రారంభించారు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి దక్షిణ భారత్ మొత్తానికి మెహ్దీ కమాండర్‌గా వ్యవహరించాడని, అతని ద్వారా ఐఎస్‌ఐఎస్ సంస్థలో చేరిన వ్యక్తుల కుటుంబాలకు ధన సహాయం చేసేందుకే మెహ్దీ అకౌంట్‌లలోకి భారీ మొత్తంలో డబ్బు వచ్చి చేరేదని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ విధంగా ఎవరెవరి కుటుంబాలకు ఎంతెంత డబ్బు చేరింది, వీరంతా ఎక్కడుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి మాత్రం పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి.