తమ జిహాదీలనే నరికేసిన ఐసిస్
బ్రిటన్‌లో తీవ్రదాడులకు హెచ్చరిక
బాగ్దాద్: తన కబంధ హస్తాల నుంచి తప్పించుకునిపోతున్న 20 మందికిపైగా సొంత సభ్యుల్నే ఐసిస్ ఉగ్రవాద సంస్థ తల నరికి చంపింది. ఈ ఘటన ఇరాక్‌లోని మోసుల్‌లో చోటు చేసుకుంది. మోసుల్‌లోని ఐసిస్ మిలిటెంట్లు కొందరు యుద్ధంనుంచి తప్పించుకుపోతుండగా ఓ చెక్‌పోస్టు వద్ద వారిని శుక్రవారం రాత్రి ఐసిస్ సిబ్బంది పట్టుకున్నారు.
వారిని షరియా కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో 20 మందికిపైగా ఐసిస్ సభ్యుల్ని నరికి చంపేసినట్లు వార్తలొచ్చాయి. కాగా, బ్రిటన్‌లో ఇటీవలి పారిస్ దాడులకంటే తీవ్ర దాడులు చేస్తామని ఐసిస్ తన పత్రికలో హెచ్చరించింది. బకింగ్‌హామ్ ప్యాలెస్, నేషనల్ గ్యాలరీను లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.